మన ప్రభువైన యేసుక్రీస్తు నరరూపిగా ఈ భూలోకానికి రాకముందే తండ్రితో ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది (ఆది 1:26; కొలొ 1:15; యోహాను 1:2-3). యేసుక్రీస్తు త్రిత్వ దైవంలోని వ్యక్తి. అంటే తండ్రితోనూ, పరిశుద్ధాత్మతోనూ నిత్యత్వంలో సమానత్వం కలిగినవాడు. ఈ త్రిత్వంలో ముగ్గురూ ఏకమై ఉండి, సమానమైన శక్తి, అధికారాన్ని, స్వభావాన్ని కలిగినవారు. మరో మాటలో చెప్పాలంటే “three in person one in essence/వ్యక్తిత్వములో ముగ్గురైనా, స్వభావంలో ఒక్కరే”. ఎవరూ ఎవరి కంటే ఎక్కువ కాదు, ఎవరూ ఎవరి కంటే తక్కువ కాదు. ముగ్గురు త్రియేకముగా ఉన్నవారు, త్రియేకముగా సర్వశక్తిమంతులు.
మరి అలాంటప్పుడు యేసుక్రీస్తును, తండ్రియైన దేవుడు ఎలా చంపగలడు? కానీ యేసు సిలువలో మరణించాడు. ఎందుకు? అది ఎందుకో తెలుసుకోవాలంటే ముందుగా అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం గురించి ఆలోచించాలి.
- యేసు ఈ లోకంలో జన్మించడం గురించి ముందుగానే ప్రవచించబడింది (ఆది 3:15; యెష 9:6).
- నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు (లూకా 19:10).
- మన పాపాలను భరించడానికి, విమోచన కలిగించడానికి వచ్చాడు (యెషయా 53:11).
- యేసు క్రీస్తు మానవుల పాపముల నిమిత్తమై మరణించడానికి వచ్చాడు, మరణించి, తిరిగి పునరుత్థానుడై లేచాడు (1 కొరి 15:1-3).
ఈ కారణాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, కొందరు ఏమంటారంటే, తండ్రియైన దేవుడు తన కుమారుని చంపాడని, మరికొందరేమో ప్రజలే ఆయనను చంపారని వాదిస్తారు. అసలు యేసును ఎవరు చంపారు? తండ్రియైన దేవుడా, యూదా, రోమా ప్రజలా, లేక మరెవరైనా?
యేసుక్రీస్తును చంపింది ఎవరు?
1. యేసును, యూదా, రోమా ప్రజలు చంపారా?
యేసును సిలువ వేయడంలో యూదులూ, రోమా ప్రజలు ముక్యమైన పాత్ర పోషించినప్పటికీ, క్రీస్తు అనుమతి లేకుండా వారు ఆయనను చంపలేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసు ఇలా చెప్పాడు: "ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను." (యోహాను 10:18).
కానీ చాలా క్రూరమైన విధానంలో క్రీస్తు మరణానికి యూదులు, రోమీయులు కారణమయ్యారు:
- యేసు తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అని, ఆ సత్యాన్ని అంగీకరించకుండా యేసును చంపాలని కుట్ర పన్నారు (మార్కు 14:61-64).
- పిలాతు, ప్రజల ఒత్తిడికి లోనై యేసును శిక్షించాల్సి వచ్చింది (మత్తయి 27:24-26).
- రోమా సైనికులు యేసును సిలువ వేసారు (మత్తయి 27:27-35).
- యూదా ప్రజలు కూడా యేసును సిలువ వేయాలని గట్టిగా నినాదించారు (మార్కు 15:11-15).
- యూదులను గురించి మాట్లాడుతూ పేతురు ఏమంతాడంటే, “యీయనను (యేసును) మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి” (అపో 2:23)
ఇవన్నీ వాస్తవాలే అయినప్పటికీ, వీటన్నిటి వెనుక దేవుని విమోచన ప్రణాళిక ఉందని మనం అర్థం చేసుకోవాలి (అపో.కా 2:23).
2. తండ్రియైన దేవుడు యేసును చంపాడా?
కొంతమంది ఏమనుకుంటారంటే, మానవుల పాపముల కొరకై క్రీస్తు పాప పరిహారార్ధ బలిగా మరణించినందున తండ్రియైన దేవుడే ఆయనను చంపాడని భావిస్తారు. యేసు మరణానికి కారణం తండ్రియైన దేవుడే అని, ఆయనను హంతకుడిని చేసి మాట్లాడుతారు. కానీ బైబిలు స్పష్టంగా బోధించేది ఏంటంటే, తండ్రియైన దేవుడు, యేసును బలవంతంగా చంపలేదు లేదా హత్య చేయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా తండ్రియైన దేవుడు యేసును చంపినట్లు లేదు. ఎందుకంటే తండ్రి క్రీస్తును బలిగా అర్పించాడు. అది కూడా క్రీస్తు అంగీకారంతోనే. అంతకంటే ముక్యంగా క్రీస్తు తనకు తానే స్వయంగా, ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించాడు.
మరి క్రీస్తు మరణించడంలో తండ్రియైన దేవుని పాత్ర ఏంటి?
- తండ్రి తన విమోచన ప్రణాళికలో భాగంగా యేసును లోకములోనికి పంపాడు (యోహాను 3:16).
- తండ్రి యేసు మరణాన్ని ప్రాయశ్చిత్త బలిగా నియమించాడు (అపొ. 2:23).
- మానవులను విమోచించడానికి క్రీస్తును ఈ లోకానికి పంపించాడు (గల 4:4-5)
- తండ్రి యేసును బాధించడానికి అనుమతించాడు, కానీ ఆయనను ఎన్నడూ విడిచిపెట్టలేదు (మత్తయి 27:46, యోహాను 16:32).
- తండ్రి యేసు బలిని అంగీకరించాడు మరియు ఆయనను మహిమపరచాడు (ఫిలిప్పీయులు 2:8-9).
తండ్రి యేసును "చంపలేదు", లేదా క్రీస్తుకు వ్యతిరేకంగా కూడా వ్యవహరించలేదు. బదులుగా, మానవాళి రక్షణ ప్రణాళికను నెరవేర్చుటకు తండ్రి, కుమారుడు సంపూర్ణ ఐక్యతతో కలిసి పనిచేశారు. ఈ సత్యం తెలిసి కూడా తండ్రియైన దేవుడు, క్రీస్తును చంపాడు అని అంటే అది దేవుణ్ణి హంతకుడిగా చేసి, క్రీస్తును సర్వశక్తిమంతుడు కాదని పరోక్షంగా ప్రకటిస్తున్నట్లే అవుతుంది. కాబట్టి తండ్రి యేసును చంపాడు అనకుండా, బలిగా అర్పించాడు అనడం వాక్యానుసారమైన పదజాలం.
3. యేసు తన ప్రాణాన్ని తానే అర్పించుకున్నాడా?
యేసు తానే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనను ఎవరూ బలవంతపెట్టలేదు, ఎవరూ చంపలేదు. ఆయన సర్వాధికారంతో, తండ్రికి లోబడి, మానవాళి రక్షణకై తనకు తానే మనకు బదులుగా మరణానికి అప్పగించుకున్నాడు. ఫిలిప్పీ 2:8లో చెప్పబడినట్లు "ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను." ఆయన మరణం బలవంతంగా జరగలేదు, అది ఆయన మనపట్ల ప్రేమతో స్వయంగా చేసిన త్యాగం.
క్రీస్తు సిలువలో పలికిన చివరి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.
- "సమాప్తమైనది" (యోహాను 19:30): అంటే క్రీస్తు మానవాళి రక్షణకై తండ్రితో వేసిన ప్రణాళికను పూర్తిచేశాడు.
- "తండ్రీ, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుకొనుచున్నాను" (లూకా 23:46): గమనించండి క్రీస్తే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు.
వీటి ద్వారా ఆయన తన ప్రాణాన్ని స్వయంగా అప్పగించుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే క్రీస్తు మనవునిగా జన్మించిన దేవుడు అలాగే సర్వాధికారం కలిగినవాడు. యోహాను 10:18 లో ఆయనే స్వయంగా శిష్యులకు చెప్పాడు, “ప్రాణమును పెట్టుటకు మరియు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము ఉన్నది.”
అసలైన అర్థం: యేసు మరణం దైవ త్యాగం
"తండ్రి యేసును చంపాడు" లేదా "ప్రజలు యేసును చంపారు" అని చెప్పడం కంటే, "యేసు తన ప్రాణాన్ని తానే అర్పించుకున్నాడు" అని చెప్పడం బైబిలు సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. యూదా, రోమా ప్రజలు ఆయనను శారీరకంగా హింసించారని, తండ్రి ఆయనను విమోచన ప్రణాళికలో భాగంగా పంపాడని చెప్పడంలో ఎలాంటి పొరపాటులేదు. కానీ యేసు తన స్వంత అధికారంతో తన ప్రాణాన్ని అర్పించాడు అనేది వాక్యానుసారమైన సత్యం. క్రీస్తు తనకు తానే స్వయంగా మనకు బదులుగా మరణించాడు. It was voluntary and vicarious death.
ప్రియా దేవుని సేవక/విశ్వాసి మన ఉచ్చారణలో మనకు తెలియకుండా ఏదైనా వ్యర్థంగా ప్రకటిస్తే అది తోటి విశ్వాసులలో కలవరము తీసుకొని వచ్చే అవకాశముంటుంది. గనుక మన బాష, పదాల ఉపయోగంలో జాగ్రత్త పాడుదాం. దేవుని పరిశుద్దతను వక్రీకరించే ప్రకటనలు/బోధలు చేసి, దేవుణ్ణి అబద్ధికునిగా చేయకూడదు.
అయితే, అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ఆయన రక్షణను అంగీకరించామా? ఎందుకంటే ఆయన మరణం అంతిమం కాదు, ఆయన మనకు నిత్యజీవాన్ని అందించడానికి తిరిగి పునరుత్థానుడై లేచాడు (యోహాను 11:25-26). కాబట్టి, మనం విశ్వాసంతో ఆయన త్యాగాన్ని అంగీకరించి, కృతజ్ఞతతో ఆయనను ఆరాధించుదాం.

