ప్రతి సంవత్సరం, శ్రమల దినాలు మొదలుకొని శుభ-శుక్రవారం వరకు యేసు పొందిన శ్రమలను, సిలువ త్యాగాన్ని స్మరించుకుంటాం (యెషయా 53:5). ఈస్టర్ రోజున అత్యంత సంతోషంతో క్రీస్తు పునరుత్థానాన్ని బ్రహ్మాండంగా జరుపుపకుంటాం (మత్తయి 28:6). కానీ ఆ రోజు గడిచిన వెంటనే ఈ ఉత్సవం మందగిస్తుంది. పునరుత్థాన శక్తి మన మనస్సుల నుండి జారిపోతుంది. అస్సలు పునరుత్థానమే జరగలేదు అన్నట్లు మన జీవితం మళ్లీ మామూలుగా, రోజువారీ దిన చర్యలతో మునిగిపోతుంది. పునరుత్థానం మన జీవితాల్లో నుండి మరుగైపోతుంది. చివరకు క్రీస్తు పునరుత్థానుడై లేచిన సంగతే మర్చిపోతాం.
ఈ నిర్లక్ష్యం చరిత్రలో మొదటిగా పునరుత్థానాన్ని అణచివేయాలని చూసిన సంఘటనను మనస్సుకు తెస్తుంది. యేసు సమాధి ఖాళీగా ఉందని తెలుసుకున్న, యూదా మత పెద్దలు, రోమా సైనికులు కుట్ర పన్ని, కాపలాదారులకు లంచాలు ఇచ్చి దేహం దొంగిలించబడినట్లు ప్రచారం చేశారు (మత్తయి 28:11-15). నేడు, విశ్వాసులైన మనం భయంతో, సుఖజీవితాలలో మునిగిపోయి, సువార్త పట్ల ఏకాగ్రత లేమి వలన మౌనంగా ఉండటం ద్వారా వారి పాత్రనే పోషిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానాన్ని మనం కూడా దాచిపెడుతున్నాం, మరుగున పెట్టేస్తున్నాం. క్రీస్తు పునరుత్థానాన్ని పండగల జరుపుకున్నప్పటికీ "మరణము గెల్చిన జయ యేసు.....సమాధి గెల్చిన జయ యేసు" అని పాడుతున్నప్పటికీ, క్రీస్తు పునరుత్థాన సువార్తను ప్రకటించడం మరచిపోతున్నాం. పునరుత్థానం ఒక శాశ్వతమైన అద్భుతం కాకుండా, కేవలం ఒక పండుగ దినంలా అయిపోతుంది. క్రీస్తు పునరుత్థానుడై సమాధి నుండి బయటకు వస్తే, ఆ పునరుత్థానానికి ముసుగేసి మనం సమాధిలోకి వెళ్తున్నాం.
అయితే పునరుత్థానం క్యాలెండర్ పేజీకి మాత్రమే పరిమితం కాకూడదు. ఎందుకంటే అది మన విశ్వాస హృదయస్పందన: యేసు సార్వభౌమత్వానికి సాక్ష్యం (రోమా 1:4), మన విమోచనకు హామీ (రోమా 4:25), మన అనుదిన జీవితానికి శక్తి. అలాంటి పునరుత్థాన శక్తిని మూసుగేసి మూలన పెట్టడం సరైనది కాదు. క్రీస్తు "మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి" అని మహా ఆజ్ఞ ఇచ్చాడు (మత్తయి 28:18-20). మనము క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్పడానికి పరిశుద్ధాత్ముడు శక్తినిస్తున్నాడు (అపొ. కార్యాలు 1:8). అయినా మనం ఎందుకు ఈ లోకంలో ఎవరి సహాయం లేదనట్లుగా జీవిస్తున్నాం?
క్రీస్తు మన విమోచనకై పొందిన విజయాన్ని మరలా సమాధిలో పెట్టకూడదు. పునరుత్థాన వెలుగును అంధకారంలో ఉన్న జనుల దగ్గరకు తీసుకెళ్ళాలి. పునరుత్థాన సత్యంలో జీవించే శిష్యులుగా మారాలి. భయం, స్వార్థం అనే తెరను తొలగించి క్రీస్తు పునరుత్థాన శక్తిని అందరికీ ప్రకటించాలి. క్రీస్తు అనుగ్రహించిన పునరుత్థాన శక్తితో నిజమైన విశ్వాసులుగా జీవించాలి.
