మానవ మనుగడకు ఆహారం అత్యవసరం. అయితే, కొందరు కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి, ఆత్మీయతకు మేలు చేస్తాయని, మరికొన్ని హానికరమని అభిప్రాయపడతారు. అందుకే చాలామంది (కొందరు క్రైస్తవులు/క్రైస్తవేతరులు) ఆహార నియమాలు నిష్టగా పాటిస్తుంటారు. ఈ విషయంలో, కొన్ని క్రైస్తవ-మతశాఖలు ఆహార నియమాలు పాటించాలని బోధిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తారు. కొన్ని ఆహారాలను తినడం పాపంగా భావించేవారు కూడా ఉన్నారు.
అయితే ఈ ఆహార వివాదంలో "విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని క్రైస్తవులు తినవచ్చా? | Can Christians eat food offered to idols?" అనే ప్రశ్న దాదాపుగా 2,000 సంవత్సరాల నాటి కొరింథీయుల సంఘం నుండి నేటి వరకు అందరినీ అందోళనకు గురిచేస్తూనే ఉంది. ఆ గ్రీకో-రోమన్ కాలంలో, అన్యమత దేవాలయాలలో బలి అర్పించబడిన మాంసం మార్కెట్లలోకి, విందులలోకి చేరేది, దీనితో ఆదిమ క్రైస్తవులు తమ ఆహార ఎంపికల గురించి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చింది. దీనిపై అనేక బోధనలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలంటే బైబిల్ ఆధారంగా దీనిని వేరువేరు కోణాల నుండి పరిశీలించాలి.
బైబిల్ ఆధారాలు: పాత నిబంధన నిషేధాల నుండి కొత్త నిబంధన స్వేచ్ఛ వరకు
విగ్రహాలకు అర్పించిన ఆహారంపై క్రైస్తవ వైఖరిని అర్థం చేసుకోవడానికి, దాని గురించి బైబిల్ ఏం చెబుతుందో క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం.
పాత నిబంధన బోధ
పాత నిబంధనలో విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడంపై ఇవ్వబడిన హెచ్చరికలు, నియమాలు పాత నిబంధన కాలంలో విగ్రహారాధనలో పాల్గొనడాన్ని, దానికి సంబంధించిన ఆహారాన్ని తినడాన్ని స్పష్టంగా, పూర్తిగా నిషేధిస్తుంది. ఆ కాలంలో విగ్రహాలకు పెట్టిన ఆహారం తినడం ఆధ్యాత్మిక వ్యభిచారంగా పరిగణించబడింది. నిర్గమకాండము 34:15, ద్వితీయోపదేశకాండము 32:38 వంటి వచనాలు అబద్ధ దేవతలకు బలిచ్చిన వాటిని తినడం అంటే నిజమైన దేవునికి ద్రోహం చేయడమే అని హెచ్చరిస్తాయి. విగ్రహాలకు దూరంగా ఉండి, దేవుని పట్ల ప్రత్యేకమైన భయభక్తులు ఉండాలనేదే అప్పటి ప్రధాన నియమం.
క్రొత్తనిబంధన బోధ
1. యెరూషలేము సభ తీర్మానం
ఆదిమ సంఘ కాలంలో అన్యజనులైన క్రైస్తవుల కోసం, యెరూషలేములో జరిగిన సభలో "విగ్రహాలకు అర్పించిన వాటికి, వ్యభిచారానికి, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసానికి, రక్తానికి దూరంగా ఉండాలి" అని తీర్మానించబడింది (అపొ. కా 15:20, 29). ఆ తీర్మానం ఆదిమ సంఘ ఐక్యత కోసం, అలాగే విగ్రహారాధనను నిషేదించడానికి ఉద్దేశించబడింది.
2. 1 కొరింథీయులకు 8
పౌలు కొరింథీయులకు వ్రాసిన లేఖలో, విగ్రహాలకు ఉనికి లేనప్పటికీ, వాటికి అర్పించిన ఆహారం తినడం బలహీన విశ్వాసుల మనస్సాక్షిని దెబ్బతీయవచ్చు అంటూ "ప్రేమ" యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. క్రీస్తులో ఇవ్వబడిన స్వేచ్ఛ ఒక "బలహీనమైన విశ్వాసి" పాపం చేయడానికి కారణమైతే, అది క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేయడమే అని పౌలు హెచ్చరించాడు: "ఆహారం వలన నా సహోదరుడు ఇబ్బంది పడితే, నేను ఎప్పటికీ మాంసం తినను" (1 కొరింథీ 8:13). కాబట్టి, క్రైస్తవ స్వేచ్ఛ ప్రేమతో, ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉపయోగించబడాలి.
3. 1 కొరింథీయులకు 10
పౌలు విగ్రహారాధనను ఖండించినప్పటికీ, విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తినడానికి అనుమతించాడు. అది మార్కెట్లో లేదా అవిశ్వాసి ఇంట్లో లభించినప్పుడు, ఆహారం నిష్పాక్షికమైనది, అలాగే విగ్రహాలు దేవుళ్లు కానందున ఆధ్యాత్మికంగా హాని ఉండదని పౌలు వాదించాడు. అయినప్పటికీ, ఇతర విశ్వాసుల మనస్సాక్షికి ఆటంకం కలిగించేటప్పుడు ఆ ఆహారాన్ని/మాంసాన్ని తినకపోవడమే మేలని హెచ్చరించాడు. తోటి విశ్వాసి ఆధ్యాత్మిక శ్రేయస్సు, వ్యక్తిగత స్వేచ్ఛ కంటే ముఖ్యమని పౌలు నొక్కి చెప్పాడు. అందువలన ప్రేమ, వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని, ఇతరులకు ఆటంకం కలిగించకుండా, దేవుని మహిమ కొరకు జీవించాలని ఆయన బోధించాడు.
5. రోమీయులకు 14
పౌలు, విశ్వాసుల మధ్య “వివాదాస్పద విషయాలు లేదా అంతరాత్మ భేదాల”పై చర్చిస్తూ, క్రైస్తవ జీవితంలో స్వేచ్ఛ, ప్రేమ, సహనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆహారం, పవిత్ర దినాలపై వ్యక్తిగత నమ్మకాలు విభేదాలకు దారితీయరాదని వివరించాడు. "ఏదీ స్వతహాగా అపవిత్రం కాదు" (రోమా 14:14) అని పేర్కొంటూ, మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించడం తప్పని, బలహీన విశ్వాసులకు ఆటంకం కలిగించవద్దని, ఇతరులను తీర్పు తీర్చవద్దని హెచ్చరించాడు (రోమా 14:10). మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి కాబట్టి, ప్రేమతో ఒకరినొకరు అంగీకరించాలని, బలహీనమైనవారికి మద్దతు ఇవ్వాలని బోధించాడు.
![]() |
| పట్టిక: విగ్రహాలకు అర్పించిన ఆహారంపై కొత్త నిబంధన యొక్క ముఖ్య దృక్పథాలు |
ఆదిమ సంఘ క్రైస్తవుల విశ్వాసం
ఆదిమ సంఘం కేవలం వేదాంతపరమైన చర్చలతోనే సరిపెట్టుకోలేదు; తమ విశ్వాసం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అనేకమంది క్రైస్తవులు ఉన్నారు. వారి దృఢత్వం నేటికీ కూడా మనకు ఒక పాఠంగా నిలుస్తుంది.
1. పాలికార్ప్: స్ముర్నకు చెందిన బిషప్ పాలిగార్ప్, రోమా చక్రవర్తికి ధూపం వేయడానికి నిరాకరించాడు. చక్రవర్తిని దైవంగా అంగీకరించడం అంటే క్రీస్తును నిరాకరించడమే అని ఆయన నమ్మాడు. ఈ నిరాకరణకు గాను, ఆయనను సజీవ దహనం చేయబడ్డాడు.
2. జస్టీన్ మార్టైర్ (క్రీ.శ. 100-165): ఆదిమ క్రైస్తవ రచయిత జస్టీన్ మార్టైర్, విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడాన్ని తీవ్రంగా ఖండించాడు. తన Dialogue with Trypho/డైలాగ్ విత్ ట్రైఫోలో, అలాంటి వారిని "గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు"గా అభివర్ణించాడు, వారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లుగా భావించాడు. విగ్రహాలకు, దయ్యాలకు మధ్య బలమైన సంబంధం ఉందని నమ్ముతూ, విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం అబద్ధ దేవతలను ఆరాధించడంతో సమానమని ఆయన వాదించాడు.
3. టెర్టూలియన్ హెచ్చరిక (క్రీ.శ. 197): ప్రముఖ క్రైస్తవ రచయిత టెర్టూలియన్, విగ్రహారాధనలో పాల్గొనడం యొక్క తీవ్రతను నొక్కి చెబుతూ, "మీరు ప్రభువు పాత్రలోను, దెయ్యాల పాత్రలోను త్రాగలేరు" అని హెచ్చరించాడు.
4. ఐరేనియస్ (క్రీ.శ. 2వ శతాబ్దం): ఐరేనియస్ కూడా విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తినడం విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లుగా భావించాడు.
5. ఒరిజెన్ (క్రీ.శ. 3వ శతాబ్దం): ఒరిజెన్ కూడా అపొ.కా 15:28-29లోని నిషేధాన్ని వివరించడానికి 1 కొరింథీ 10లోని భాషను ఉపయోగిస్తూ, విగ్రహాలకు అర్పించినది దెయ్యాలకు బలి అని, దేవుని జనాంగం దెయ్యాల బల్లలో చేరకూడదని పేర్కొన్నాడు.
వేదాంతపరమైన సూత్రాలు: ఆధునిక క్రైస్తవులకు
విగ్రహాలకు అర్పించిన ఆహారంపై జరిగే బైబిల్ చర్చలు అన్నీ కాలాలలో క్రైస్తవులకు వారి ఆహార, నైతిక ఎంపికలలో మార్గనిర్దేశం చేయడానికి వేదాంతపరమైన సూత్రాలను అందిస్తాయి.
1. దేవుని సార్వభౌమత్వం మరియు ఆహారం యొక్క నిష్పాక్షికత (Neutrality): "భూమి, దాని సంపూర్ణత ప్రభువుది" కాబట్టి, ఆహారం స్వతహాగా నైతికంగా నిష్పాక్షికమైనది. అంటే సమస్తము దేవుని సృష్టి గనుక తినగలిగినది ఏదైనా తినవచ్చు. "ఏదీ స్వతహాగా అపవిత్రం కాదు" అని పౌలు పేర్కొన్నాడు (రోమా 14:14).
2. ప్రేమ (అగాపే) ఆధిపత్యం: క్రైస్తవ స్వేచ్ఛను నియంత్రించే ప్రధాన సూత్రం అగాపే ప్రేమ, ఇది నిస్వార్థమైన/త్యాగపూరిత ప్రేమ. పౌలు ఇలా అంటాడు: "జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును" (1 కొరి 8:1). కాబట్టి ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి.
3. మనస్సాక్షి పవిత్రత: ఒకరి మనస్సాక్షి ఏదైనా తప్పు అని భావిస్తే, ఆ వ్యక్తికి అది తప్పు. కాబట్టి మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయడం పాపమే.
4. నిజమైన విగ్రహారాధనను నివారించడం: విగ్రహాలలో ఏ జీవం లేనప్పటికీ, దెయ్యాలతో పాలుపంచుకోవడం ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరం. "మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దెయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు" (1 కొరి 10:21).
5. ప్రపంచానికి సాక్ష్యం: క్రైస్తవ ఎంపికలు అవిశ్వాసులకు వారి సాక్ష్యంపై ప్రభావం చూపుతాయి. 1 కొరి 10:32-33లో పౌలు ఇలా అంటాడు: "ఎవరికీ అభ్యంతరము కలుగజేయకుడి", ఆవిధంగా "అనేకులు రక్షింపబడవచ్చు".
ఆధునిక పరిస్థితులకు బైబిల్ సూత్రాలను వర్తింపజేయడానికి ఆలోచనాత్మక విచక్షణ అవసరం. కాబట్టి మన ఎంపికలు/నిర్ణయాలు అహంకారం ద్వారా కాకుండా, దేవుని పట్ల భయభక్తులతో, పొరుగువారి పట్ల ప్రేమతో, మనస్సాక్షి నిశ్చయతతో ఉండాలి.
![]() |
| పట్టిక: మూడు కోణాల ఆచరణ |
సామాజిక సమావేశాలను, ముఖ్యంగా అవిశ్వాసులు లేదా విభిన్న నమ్మకాలు ఉన్న క్రైస్తవులతో కూడి నిర్వహించే సందర్భాలలో ఈ క్రింది సూత్రాలు సహాయపడతాయి.
4. వ్యక్తిగత నమ్మకాలు, బహిరంగ ప్రేమ: మీరు తోటి విశ్వాసి మనస్సాక్షిని కలవరపెట్టే పని ఏదైనా చేయాలని బలంగా అనిపిస్తే, దానిని వ్యక్తిగతంగా లేదా ఎవరికీ అసౌకర్యం కలిగించని విధంగా చేయడం బహుశా ఉత్తమం.
5. గౌరవించడం: క్రైస్తవేతరుల వివాహాలలో/కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు, వారు ప్రసాదం ఇస్తే, "మీ ఆచారం గొప్పది! కానీ నా విశ్వాసం ప్రకారం దీన్ని తినలేను. మీతో ఈ కార్యక్రమంలో ఉండడమే పెద్ద విందు" అని మర్యాదగా చెప్పవచ్చు.
6. కృతజ్ఞతను పెంపొందించండి: కొన్ని తప్పనిసరి సందర్భాలలో ఏదైన విందులో తినాల్సివస్తే, "సమస్తమును సృజించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తినండి” (1 తిమోతి 4:4-5).
7. ఆతిథ్యంపై కాకుండా, ఇచ్చేవారిపై దృష్టి పెట్టండి: ఆతిథ్యం, ఆతిథ్యమిచ్చినవారితో ఏర్పడే సంబంధంపై దృష్టి పెట్టి, భవిష్యత్తులో వారిని దేవునివైపు నడపాలని ప్రయత్నించండి.
ముగింపు హెచ్చరికలు
ప్రస్తుత కాలంలో, ముఖ్యంగా మన దేశంలో విగ్రహాలకు అర్పించకుండా మార్కెట్లలో అమ్మబడేది ఏది లేదు. భోజనం అమ్మేవాళ్ళు మొదటిగా పూజ చేసి తర్వాత అమ్ముతారు. ఎటువంటి వస్తువు తయారు చేయబడిన సరే అది విగ్రహాల పూజకు మొదటిగా అర్పించబడాల్సిందే, ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళిన ఆక్కడ మొదటగా విగ్రహాలకు పూజించిన తర్వాతే వాటిని అమ్మడం మొదలవుతుంది. ఏది తినాలన్న, కొనాలన్న, విహారయాత్రలకు తిరగాలన్న, చివరకు శాస్త్రవేత్తలు రాకేట్స్ ఆకాశంలోకి పంపాలన్నా సరే విగ్రహ పూజార్పణ జరిపించాల్సిందే. కాబట్టి ఇటువంటి సందర్భాలన్ని దృష్టిలో ఉంచుకొని సమతుల్య అవగాహనను కలిగి విచక్షణతో ఉండటం శ్రేయస్కరం. అంతిమంగా, "మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి" (1 కొరింథీ 10:31).
1. స్వేచ్ఛను తెలుసుకోండి - విగ్రహాలకు శక్తి లేదు, అవి మనలను ఏమి చేయలేవు (కొలస్స 2:15).
2. బలహీనులను కాపాడండి - మీ విశ్వాసం సాక్ష్యంగా మారాలి. జ్ఞానం కంటే ప్రేమ గొప్పది కాబట్టి కొన్ని సందర్బాలలో తోటి విశ్వాసుల మేలు కొరకు కొన్నిటికి దూరంగా ఉండండి (1 కొరింథీ 8:1).
3. నష్టమేమి లేదు - మనం ఏది తిన్నా, తినకపోయినా నష్టం లేదు.
4. విచక్షణతో ఉండాలి - అన్య విగ్రహ దేవుళ్లను గౌరవిస్తున్నాం అని వారు భావిస్తుంటే వారి పూజ స్థలాలకు వెళ్లొద్దు, వారిచ్చే ఆహారం తినవద్దు.

.webp)