1. సృష్టిలో దేవుని ప్రత్యక్షత
ఈ సృష్టి మానవులకు దేవుని ఉనికిని గురించి సాక్ష్యమిస్తుందని బైబిల్ బోధిస్తుంది. కీర్తన 19:1 లో ఈలాగు వ్రాయబడింది, ''ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.'' ఇంత గొప్ప విశ్వం యొక్క విశాలత మొదలుకొని, చిన్న చిన్న కణాల రూపకల్పన వరకు అన్నీ కూడా ఈ సృష్టిలో దేవుని శక్తిని ఆయన జ్ఞానాన్ని బయలుపరుస్తున్నాయి. రోమా 1:20 లో అపొస్తలుడైన పౌలు దీనిని పునరుద్ఘాటించడం చూస్తాం: ''ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు."
మానవ ఊహకు కూడా అంతుచిక్కని సృష్టి రహస్యాలు, అలాగే సృష్టిలోని అందాలు, ఈ సృష్టి నిర్మాణం వెనుక ఉన్న సృష్టికర్తను తెలుసుకోడానికి మనలను ప్రేరేపిస్తాయి. ఈ విశ్వ నిర్మాణంలోని పరిపూర్ణ క్రమాన్ని గమనించినప్పుడు, సృష్టి ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, ఇది ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిందనే సత్యాన్ని ప్రతిబింబిస్తుంది.
2. యేసుక్రీస్తు దైవత్వం
యేసుక్రీస్తు చారిత్రక వ్యక్తి ఆయన చరిత్రలో జీవించాడు. ఆయన చేసిన కార్యాలు, బోధలు మానవాతీతమైనవి, అవి కేవలం దేవునికి మాత్రమే సాధ్యమౌతాయి. ఆయన జీవితాన్ని చూసినవారు, ఆయన కాలంలో జీవించినవారు ఆయన చారిత్రకతను వెల్లడించారు.
ఉదాహరణకు, యూదామత చారిత్రకారుడైన "ఫ్లావియస్ జోసెఫస్" మరియు రోమా చరిత్రకారుడు "కొర్నేలియస్ టాసిటస్" ఇలా మొదలైనవారు క్రీస్తు జీవించినట్లు, ఆయనను అనేకమంది వెంబడించినట్లు వారి రచనల్లో పేర్కొన్నారు. యేసు మానవ చరిత్రలో దైవమానవుడిగా జీవించాడు, అనేకమందిని నిత్యజీవానికి నడిపించాడు, నడిపిస్తూనే ఉన్నాడు.
యేసుక్రీస్తు చారిత్రక వ్యక్తి మాత్రమే కాక, క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా కూడా ఉన్నాడు. ఆయన తన గురించి స్వయంగా చేసిన ప్రకటనలు క్రైస్తవ సిద్ధాంతంలో అత్యంత కీలకమైనవి. ఈ ప్రకటనలు క్రైస్తవ విశ్వాసానికి మూలాధారాలు.
- యోహాను 8:58 లో "యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."
- యోహాను 10:30 లో "నేనును తండ్రియును ఏకమైయున్నాము" అని యేసు ప్రకటించాడు.
ఈ ప్రకటనలతో యేసు తనను తాను నేరుగా దేవునితో సమానం చేసుకున్నాడు. ఇవి చాలా లోతైనవి, ఎందుకంటే ఆయన కాలంలోని మత నాయకుల ఈ ప్రకటనల ఆధారంగా యేసు తనను తాను దేవునితో సమానంగా ప్రకటించుకుంటున్నాడని వారు గ్రహించారు (యోహాను 10:33). ఈ ప్రకటనలు మాత్రమే కాదు, యేసు చేసిన అనేక కార్యాలూ, స్వస్థతలూ, పాపములను క్షమించడం, మృతులైన వారిని బ్రతికించడం కూడా ఆయన దేవత్వాన్ని తెలియజేస్తాయి.
సి.ఎస్. లూయిస్ (C. S. Lewis), తన పుస్తకంలో యేసుక్రీస్తు గురించి చాలా ప్రఖ్యాత గాంచిన త్రయ వాదనను ప్రతిపాదించాడు: యేసు అబద్ధికుడు, వెర్రివాడు లేదా ప్రభువు. ఈ వాదన ప్రకారం, యేసు తన ప్రకటనలలో అబద్ధికుడైతే, ఆయన మంచి నైతిక బోధకుడు కాదని తెలుస్తుంది. ఆయన మోసగాడైతే, కోట్లాది మందిని ప్రేరేపించడం అసాధ్యం. చివరిగా మిగిలిన ఒకే ఒక్కటి ఏంటంటే: యేసు నిజంగా దేవుడు, మానవ రూపంలో జన్మించిన దేవుడు. (Mere Christianity, 1952, 40, 41).
మరిన్ని రుజువుల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి: https://www.getedified.org/2024/09/10-10-evidences-to-prove-jesus-christ-is-god.html
3. లేఖనాల సాక్ష్యం
బైబిల్ గ్రంథస్థం చేయబడిన విధానం అలాగే దాని సమకూర్పులోని ఐక్యత కూడా దేవుని ఉనికికి సాక్ష్యమిచ్చుచున్నది. బైబిల్ 1,500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మందికి పైగా రచయితలచే వ్రాయబడింది. అయినప్పటికీ బైబిల్ దాని విమోచన సందేశంలో స్థిరంగా ఉంది. ఏ రచయిత కూడా ఇతర రచయితల సందేశానికి విరుద్ధంగా రాయలేదు. ప్రతీ గ్రంథకర్త సందేశం ఇతర రచయితల సందేశంతో సరిపోతూనే ఉంది. దానికి గల కారణం దేవుడే, ఎందుకంటే బైబిల్ దేవుని ప్రేరణ వలన కలిగిన గ్రంథం.
- 2 తిమోతి 3:16,17 లో ఇలా చెప్పబడింది, ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.''
అనేక శతాబ్దాల తరువాత నెరవేర్చబడిన ప్రవచనాలు కూడా బైబిల్ యొక్క దైవిక ప్రేరణను మరింతగా నొక్కి చెబుతున్నాయి. ఉదాహరణకు, యెషయా 53 ప్రవచించబడిన శ్రమ సేవకుడు మెస్సీయాను గురించిన ప్రవచనం, యేసుక్రీస్తు జీవితంలో ఆయన సిలువ మరణంలో నెరవేర్చబడింది.
మరిన్ని రుజువుల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి: https://www.getedified.org/2024/09/10-top-10-reasons-why-trust-bible.html
4. బైబిల్లోని అద్బుతాలు
బైబిల్లో అనేక అధ్బుతాలు పొందుపరచబడ్డాయి. జరిగిన అధ్బుతాలకు ప్రస్తుతం పక్కా రుజువులు చూపించలేకపోయిన ఆ అధ్బుతాలు జరిగిన ప్రదేశాలు, ఆ దేశాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. అంతమాత్రమే కాకుండా ఈ అధ్బుతాలు కల్పిత కథలు కాదని, వాస్తవంగా చరిత్రలో జరిగిన సంఘటనలు అని అనేక రుజువులు ఇప్పటికే వివిధ పరిశోధనల ద్వారా నిరూపించబడ్డాయి.
కానీ, ఇక్కడ అసాధారణంగా, యెరికో గోడలు బయటవైపుకు కూలిపోవడం చాలా అరుదైనది. ఇలా వెలుపలకు కూలడం యెహోషువ 6:20లో చెప్పిన బైబిలు వచనాన్ని పూర్తిగా అనుగుణంగా ఉంది, "ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి" నగరంలోకి నేరుగా ప్రవేశించడాన్ని తెలియజేస్తుంది. ఈ సంఘటన సహజంగా జరగనట్లు కాక ఇశ్రాయేలీయుల విధేయతకు ప్రతిఫలంగా దేవుడు చేసిన అద్భుతంగా కనబడుతుంది.
యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువుగా ఉంది, ఇది ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు, ఆయన సర్వాధికారాన్ని వెల్లడిస్తుంది. క్రీస్తు పునరుత్థానం దేవునికి మరణంపై శక్తి ఉందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. అలాగే క్రీస్తులో విశ్వాసం ద్వారా పాపముక్తి, నిత్యజీవం అనుగ్రహించబడుతుందనే హామీనిస్తుంది.
ముగింపు
దేవుని ఉనికిని తెలుసుకోడానికి చేసే అన్వేషణ మానవజీవితానికి విలువను, నిత్యజీవానికి మార్గాన్ని చూపుతుంది. ఈ సృష్టి నిర్మాణ క్రమం, వాస్తవమైన చరిత్రాధారాలు, లేఖనాల విశ్వసనీయత—ఇవన్నీ కూడా సృష్టికర్త ఉనికిని ఆయన శక్తిని స్పష్టంగా బయలుపరుస్తూ, ఆయన పరిపూర్ణతకు, మహిమకు, ప్రేమకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ అన్వేషణలో బైబిల్ ద్వారా పొందిన జ్ఞానం, సాక్ష్యాలు దేవుని ప్రత్యక్షతను గుర్తించేందుకు తోడ్పడతాయి, దేవుడు ఉన్నాడు అని రుజువుపరుస్తాయి. చివరికి, దేవుని గురించిన అన్వేషణ మనలో విశ్వాసాన్ని పెంచి, జీవితం పట్ల లోతైన అర్థానిచ్చి, నిత్యమైన నిరీక్షణతో నింపుతుంది.
