యేసు మానవునిగా జన్మించడం క్రైస్తవ విశ్వాసంలో కేంద్రబిందువు. ఆయన భూలోకంలో ఎందుకు జన్మించాడో గ్రహించడం ద్వారా దేవుని ప్రేమ, సార్వభౌమత్వం, మానవాళి కోసం ఆయన ప్రణాళికను తెలుసుకోవచ్చు. బైబిల్లో పొందుపరచిన ఈ ముఖ్య కారణాలను ధ్యానించడం ద్వారా, యేసు ఈ లోకానికి రావడానికి గల కారణాలను గ్రహించగలం.
యేసు ఎందుకు జన్మించాడు?
1. ప్రవచనాలను నెరవేర్చడానికి
మత్తయి 1:22-23 " ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను.."
అనాధికాలం నుండి చెప్పబడిన దైవ ప్రవచనాలను నెరవేర్చడానికి యేసు జన్మించాడు. ఆయన జన్మ పాతనిబంధన ప్రవచనాలను నెరవేర్చి, దేవుని వాక్య విశ్వసనీయతను నిర్ధారించింది (యెషయా 7:14, మీకా 5:2).
2. పాపులను రక్షించడానికి
మత్తయి 1:21 "తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను."
ఆదాము, హవ్వ పతనం దగ్గర నుండి (ఆది 3), మానవజాతి పాపంలో పడిపోయి దేవునికి దూరమయ్యారు. ఈ పాపం వలన కలిగిన ఎడబాటును మానవ ప్రయత్నం తీర్చలేని స్థితి ఏర్పడింది. అందుకే, యేసు పాపుల రక్షణకై సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, పాపాలకు పరిహారం చెల్లించాడానికి ఈ భూలోకంలో జన్మించాడు (రోమా 5:8).
3. దేవునిని ప్రత్యక్షంగా చూపడానికి
యోహాను 1:14 "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి."
దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని అనేకమంది ఎదురు చూశారు, ఆరాటపడ్డారు. కానీ ఎవరు కూడా అప్పటి వరకు దేవునిని ప్రత్యక్షంగా చూడలేదు. యేసు జన్మ ద్వారా దేవుడు తనను మానవులకు ప్రత్యక్షంగా కనుపరచుకున్నాడు. యేసు దేవుని ప్రత్యక్ష స్వరూపం (హెబ్రీయులు 1:3). యేసు జీవితం, బోధనలు, కార్యాలు అన్నీ కూడా దేవుని ప్రేమ, దయ, పరిశుద్ధత, న్యాయాన్ని చూపిస్తాయి.
3. మానవాళిని దేవునితో సమాధానపరచడానికి
2 కోరింథీయులు 5:18-19 "సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని...."
పాపం మానవులకు, దేవునికి మధ్య శత్రుత్వాన్ని సృష్టించింది. యేసు జన్మ ఆ విరోధాన్ని సరిదిద్దడానికి దేవుని ప్రణాళికలో మొదటి అడుగుగా చూస్తాము. యేసు మరణం, పునరుత్థానం ద్వారా, ఆయన సమాధాన బలిని అందజేస్తూ దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించాడు (రోమా 5:1). దేవునికి స్నేహితులుగా మనలను చేశాడు.
5. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి
లూకా 1:32-33 "ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను."
అపవాది అధికారంలో పాపంతో నిండిపోయిన ఈ లోకంలో, యేసు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి జన్మించాడు. దేవుని రాజ్య న్యాయవిధులను, శాంతిని, కనుపరచి దేవుని ప్రేమలో జీవించమని ఎలా జీవించాలో తెలియజేసాడు (మార్కు 1:15).
6. అపవాదిని ఓడించడానికి
1 యోహాను 3:8 "అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను."
యేసు క్రీస్తు అపవాది యొక్క కార్యాలను పూర్తిగా నశింపజేయడానికి ఈ భూమిపై జన్మించాడు. ఆయన పాపం, మరణం, సాతానుపై గెలిచాడు. విశ్వాసంతో ఆయనను అంగీకరించినవారికి శాశ్వత విజయాన్ని, విమోచనాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా, యేసు క్రీస్తు సహాయం ద్వారా మనం అపవాది, పాపపు బంధకాల నుండి విముక్తి పొందగలం.
7. అంధకార ప్రపంచానికి వెలుగును తీసుకురావడానికి
యోహాను 8:12 "యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను."
యేసు క్రీస్తు ఈ ప్రపంచానికి వెలుగులోనికి నడిపించడానికి జన్మించాడు. పాపం, దుఃఖం, ఆధ్యాత్మిక అంధకారం నుండి మనలను విమోచించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనను విశ్వసించినవారికి ఆధ్యాత్మిక వెలుగును అనుగ్రహిస్తాడు.
8. మనకు మహాయాజకుడిగా ఉండడానికి
హెబ్రీయులు 4:14-16 "మనకు పరలోకంలోకి వెళ్లిన మహాయాజకుడు ఉన్నాడు, దేవుని కుమారుడు యేసు."
యేసు క్రీస్తు మన కొరకు మహాయాజకునిగా ఉండడానికి జన్మించాడు. దేవుని కుమారుడిగా, ఆయన మన కొరకు బలిగా అర్పించబడి, మన స్థానంలో దేవుని సమక్షంలో నిలబడి, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన జన్మ మనకు పాపాల కోసం క్షమాపణ, శాంతి, దేవుని కృప పొందే మార్గాన్ని అనుగ్రహించింది.
9. దేవుని ప్రేమను చూపడానికి
యోహాను 3:16 "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."
దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఏసు జన్మించాడు. యేసు జన్మ దేవుని ప్రేమకు అత్యున్నతమైన వ్యక్తీకరణగా చూడగలం. మన పట్ల ఆయన ప్రేమ ఎంతంటే, మనలను రక్షించడానికి, తన సొంత కుమారుడి ప్రాణాలను అర్పించే అంత. ఆ ప్రేమను గ్రహించి ఆయన నమ్మిన వారికి రక్షణ అందజేస్తాడు.
10. మనలను దేవుని పిల్లలుగా చేయడానికి
యోహాను 1:12 "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.."
సాతాను సంబంధులుగా ఉన్న మనలను దేవుని పిల్లలుగా చేయడానికి యేసు ఈ లోకంలో జన్మించాడు. యేసుపై విశ్వాసం ఉంచడం ద్వారా, మనం దేవుని కుటుంబంలో చేరి, దేవునితో పునరుద్ధరించబడిన సంబంధాన్ని ఆనందించగలుగుతాం.
ముగింపు
యేసు క్రీస్తు జన్మ మనకు దేవుని ప్రణాళిక, ప్రేమ కృపను పరిచయం చేస్తుంది. మానవాళిని పాపాల నుండి విమోచించడానికి, దేవుని స్వభావాన్ని మానవులకు తెలియజేయడానికి, మనలను తన పిల్లలుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో, మనం ఈ అద్భుతమైన సందేశాన్ని విశ్వసించి, ఆయనను మన ప్రియమైన రక్షకుడిని ఆరాధిస్తూ, ఆయన రక్షణ, ప్రేమను ఇతరులకు మనసారా ప్రకటిద్దాం.
.webp)