దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న గురించి ఎప్పటినుంచో చర్చలూ, వాదనలూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. మరికొందరు దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు కోరుతారు లేదా సందేహాలతో ఆలోచిస్తారు. ఇలా దేవుడు లేడని వాదించేవారు సత్యాన్ని తెలుసుకోడంలో విఫలమై, ఎన్ని రుజువులు చూపించిన అంగీకరంచకపోవచ్చు. అయినప్పటికీ సత్యాన్ని తెలుసుకోవడం అలాగే తెలిజేయడం విచక్షణగల జీవులుగా మన బాధ్యత.
ఈ అన్వేషణలో, "దేవుడు ఉన్నాడా? | Is There God?" అనే ప్రశ్నకు సమాధానంగా, దేవుని ఉనికిని నిరూపించే కొన్ని తాత్విక రుజువులను/వాదనలను తెలుసుకుందాం.
1. ప్రపంచ సృష్టి సిద్ధాంతం (Cosmological Argument)
ఈ సిద్ధాంతం ప్రకారం, "ఉనికిలో ఉన్న ప్రతీది కలుగజేయబడినదే" అని థామస్ అక్వినాస్ (Thomas Aquinas) అనే తత్వవేత్త ప్రతిపాదించాడు. ఈయన "Unmoved Mover/స్వయంభవుడు" లేదా "First Cause/ప్రథమ కారకుడు" అనే భావనను ప్రవేశపెట్టారు, ఆ ప్రథమ కారకుడు, దేవుడే అని చెప్పాడు.
ఒకవేళ మీరు, ఈ విశ్వం "బిగ్ బ్యాంగ్" అనే పెద్ద పేలుడు ద్వారా ఆరంభమైంది అని వాదించవచ్చు. కానీ ఆ పేలుడుకు "ముందు" ఏమీ లేకపోతే, ఆ పేలుడు ఎలా జరిగింది? వాస్తవం ఏమిటంటే, మన సృష్టిలో ఉన్నవి ఏవైనా కూడా వాటంతట అవే ఉనికిలోనికి రాలేదు. వాటిని కలుగజేసిన కర్త ఉన్నాడు.
ఉదాహరణకు, మీరు వాడుతున్న ఫోన్ మీ దగ్గరకు ఎలా వచ్చింది? దాన్ని కచ్చితంగా ఎవరో తయారు చేసి ఉండాలి. అదే విధంగా, ఇంత అద్బుతమైన సృష్టి, ఎవరూ సృష్టించకుండా దానంతట అదే ఎలా ఉనికిలోకి వస్తుంది? అది అసాధ్యం! కచ్చితంగా ఎవరో సృష్టించే ఉండాలి. ఆయనే సమస్త ఉనికికి కారకుడు. కాబట్టి, ఈ ప్రపంచానికి కూడా ఒక కారకుడు ఉన్నాడు. ఆ కారకుడు కాలం, స్థలం, భౌతిక నియమాలకు మించిన ఒక శక్తివంతుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు.
ఆలోచిద్దాం: ఒక కారు తయారవ్వాలంటే ఇంజనీర్ ఎలా ఉండాలో, అలాగే ప్రపంచాన్ని నిర్మించడానికి ఒక సృష్టికర్త ఉండాల్సిందే.
2. స్థితి నియమ సిద్ధాంతం (Teleological Argument)
ఈ వాదన మన విశ్వంలోని రూపకల్పన మరియు క్రమాన్ని సూచిస్తుంది. విశ్వంలోని అందం, సక్రమత, నిర్మాణం అన్నిటి వెనుక సృష్టికర్త ఉన్నాడని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఇంత క్రమంగా సాగుతుండంటే దానిని రూపించి నడిపించేవాడు ఉండాలి. లేకపోతే ఇది అసాధ్యం. కాబట్టి మన సృష్టి సక్రమత యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకమైనదని రుజువవుతుంది.
విలియం పేలీ (William Paley) అనే తత్వవేత్త దీనిని గడియారం ఉదాహరణతో వివరించాడు. ఒక గడియారాన్ని గమనించినప్పుడు, దాని క్లిష్టమైన నిర్మాణం, దానిలోని చిన్న చిన్న పరికరాలు, అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయంటే, వాటిని ఒక తెలివైన వ్యక్తి రూపొందించాడని స్పష్టమౌతుంది. అలాగే, మన విశ్వంలోని గురుత్వాకర్షణ, గాలి, నీరు, కాంతి వంటి నియమాలు చక్కగా పనిచేసే విధానం ఒక తెలివైన సృష్టికర్త ఉనికిని వెల్లడిస్తున్నాయి. ఒకవేళ వీటిలో ఒక్కటి కొంచెం నియమం తప్పినా, మనం ఈ లోకంలో బ్రతకలేం! మరి వాటి క్రమాన్ని నియమించి నడిపించేది ఎవరు? కచ్చితంగా వాటిని రూపించినవాడే, ఆయనే సమస్త నియమాలను రూపించిన దేవుడు.
3. నైతిక సిద్ధాంతం (Moral Argument)
ఈ సిద్ధాంతం ప్రకారం, విశ్వవ్యాప్తంగా మానవులు పాటించే నైతికత వెనుక ఆ నైతిక విలువలను అనుగ్రహించినవాడు ఉన్నట్లు తెలుస్తుంది. ఇమ్మాన్యుయెల్ కాన్ట్ (Immanuel Kant) అనే తత్వవేత్త ఈ నైతికతను దేవుని ఉనికితో అనుసంధానించి, దేవుడు లేకపోతే, మంచిచెడులకు ఎలాంటి స్థిరమైన ప్రమాణం ఉండదని చెప్పాడు.
మనందరికీ తెలిసినట్లు, చెడు చేయడం తప్పు, మంచి చేయడం సరైనది. మరి ఈ నైతిక భావాలు మనకు ఎలా ఉన్నాయి? జంతువులను గమనిస్తే వాటికి నచ్చినట్లు క్రూరంగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయి, కానీ మనుషుల్లో "జాలి, ప్రేమ, న్యాయం" వంటి భావాలు ఎందుకు ఉన్నాయి? దానికి కారణమేమిటంటే, ఒక నైతిక నియమాలు రాసిన వ్యక్తి (దేవుడు) ఉంటేనే, అవి అందరికీ వర్తిస్తాయి. ఒక కళాశాలలో నియమాలు ఉన్నాయంటే, అక్కడ కళాశాలను నడిపించే కళాశాలాధ్యక్షుడు ఉన్నట్లు. అలాగే, మన హృదయంలో నైతిక నియమాలకు ఉన్నాయంటే వాటికి ఒక నియమదాత ఉన్నట్లే. ఆయనే నైతికత కలిగిన దేవుడు.
4. అస్తిత్వ సిద్ధాంతం (Ontological Argument)
ప్రముఖ తత్వవేత్త అయిన అన్సేల్మ్ (Anselm), దేవుడు అనే భావనే ఆయన ఉనికికి సాక్ష్యంగా ఉంది అని నొక్కి చెబుతూ, అస్తిత్వ వాదనను రూపొందించాడు. ఈ వాదనలో ఆయన, "సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, పరిపూర్ణమైనవాడైన ఒక అత్యుత్తమ వ్యక్తిని" ఊహించుకోమంటాడు. అలా ఊహించిన వ్యక్తి మన ఆలోచనలో మాత్రమే ఉంటే, ఆ వ్యక్తి "అత్యుత్తమమైన వ్యక్తి" అవ్వడు, ఎందుకంటే ఊహాలో ఉండటం కంటే వాస్తవంలో ఉండటం అత్యుత్తమం అని వాదిస్తాడు.
మనం ఊహించగలిగే అత్యుత్తమమైన వ్యక్తి దేవుడు అని అనుకుందాం. అలాంటి వ్యక్తి "నిజంగా లేకపోతే", అది "అత్యుత్తమం" అస్సలు కాదు. ఎందుకంటే, ఏదైనా నిజంగా ఉంటేనే ఉత్తమం అవుతుంది. ఉదాహరణకు, మనం అందంగా కట్టిన ఒక పరిపూర్ణ ఆలయాన్ని ఊహించుకుందాం. ఆ ఆలయం మన ఊహలో మాత్రమే ఉంటే, అది నిజంగా పరిపూర్ణ ఆలయం అవ్వదు. పరిపూర్ణం అనబడాలంటే వాస్తవంలో ఉండాలి. అలాగే, దేవుడు అనే ఆలోచన మనకు ఉందంటే, ఆయన నిజంగా ఉండాలి. "నిప్పులేనిదే పొగ రాదు అంటారు" అలాంటిది దేవుడు నిజంగా లేకపోతే, మనం పరిపూర్ణ దేవుని గురించి ఎలా ఊహించగలుగుతున్నాం?
ముగింపు
అయితే ... వాస్తవాన్ని ఆలోచిద్దాం!
దేవుణ్ణి నమ్మమని ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయలేరు/చేయటల్లేదు. కానీ విషయం ఏమిటంటే: దేవుడు లేడనే వాదన, ప్రపంచం యాదృచ్ఛికంగా ఏదో మాయలాగా ఏర్పడినట్లు, మానవునికి విలువ లేనట్లు, నైతికత ఒక భ్రమ అన్నట్లు అంగీకరించమంటుంది. కానీ, దేవుడు ఉన్నాడనుకుంటే, ప్రేమ, జాలి, దయ, న్యాయం యాదృచ్ఛికాలు కాదు అవి ఆయన ప్రతిబింబాలు. అలాగే సృష్టి, మానవ జీవితం అనేవి దేవుడు విలువతో ఉద్దేశ్యంతో రూపించినవి. పై వాదనలు దేవుడు మన లోకంలో నిజంగా ఉన్నాడని, సృష్టి క్రమాన్ని ఆయనే నడిపిస్తున్నాడనే నమ్మకాన్ని బలపరుస్తాయి. ఈ ఆధారాలు దృష్టిలో పెట్టుకొని, దేవుడు ఉన్నాడని విశ్వాసంతో అంగీకరించాలి (హెబ్రీ. 11:6).
