విట్టెన్‌బర్గ్ (Wittenberg), 1517
సంస్కరణ దినోత్సవం చారిత్రకంగా 1517, అక్టోబర్ 31 నాటి సంఘటనను జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజున జర్మనీకి చెందిన ప్రీస్ట్/Priest, ప్రముఖ వేదాంతవేత్త అయిన మార్టిన్ లూథర్ తన తొంభై-ఐదు సిద్ధాంతాలను (Ninety-Five Theses) విట్టెన్‌బర్గ్ చర్చ్ తలుపుపై అతికించాడు. ఆ సంఘటన పెద్ద విప్లవానికి దారితీసి, సంఘ సంస్కరణకు తోడ్పడింది.
లూథర్ అతికించిన ఈ సిద్ధాంతాలు ప్రధానంగా పాప పరిహార పత్రాల (Indulgences) అమ్మకం అనే దురాచారానికి వ్యతిరేకంగా చేసిన విద్యాపరమైన సవాలు. మనుషులు తమ క్రియలతో లేదా డబ్బుతో కొనుగోలు చేసిన పత్రాలపై ఆధారపడకుండా, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ రక్షణ కార్యం (Finished Work (Salvation) of Jesus Christ)పై మాత్రమే విశ్వాసం ఉంచాలనే సవాలుతో నిలబడ్డారు. ఈ సంఘటన దైవశాస్త్ర విప్లవానికి (Theological Revolution) నాంది పలికింది.
ముద్రణా యంత్రం (Printing Press) పాత్ర
15వ శతాబ్దంలో జోహాన్నెస్ గుటెన్‌బర్గ్ (Johannes Gutenberg) ఆవిష్కరించిన ముద్రణా యంత్రం యొక్క ఆవిష్కరణ చాలా కీలకమైన పాత్ర పోషించింది. లూథర్ సిద్ధాంతాలు, ముఖ్యంగా ఆయన చేసిన బైబిలు జర్మన్ అనువాదం, గుటెన్‌బర్గ్ ముద్రణా యంత్రం (Printing Press) సహాయంతో ఐరోపా ఖండం అంతటా సెర వేగంగా వ్యాపించి, సంస్కారణోద్యమాన్ని మరింత బలపరచింది.
ఈ యంత్రం ద్వారా పుస్తకాల ముద్రణ వేగవంతంగా జరిగింది. చేతితో రాసే పద్ధతికి బదులుగా, వేల ప్రతులు తక్కువ సమయంలో ముద్రించడం సాధ్యమైంది. దీనివల్ల లూథర్ కరపత్రాలు, పుస్తకాలు, ముఖ్యంగా బైబిలు ప్రతులు ఐరోపా ఖండం అంతటా అత్యంత వేగంతో విస్తరించాయి.
ముద్రణా యంత్రం లేకపోతే, లూథర్ సందేశం కొద్దిమందికే పరిమితమై, సంస్కరణల ఉద్యమం బలపడటం ఆలస్యం అయ్యుండేది.
దైవశాస్త్ర మూలాలు: 5 సోలాలు (5 Solas)
సంస్కర్తలు తిరిగి కనుగొన్న ముఖ్య సిద్ధాంతాలను ఐదు సోలాలుగా సంగ్రహించారు. ఇవి సంఘ సంస్కరణకు సిద్ధాంతపరమైన ఆధారం. లూథర్, అప్పటి రోమన్ కాథలిక్ చర్చి యొక్క బైబిలేతర సంప్రదాయాలు, క్రియల ఆధారిత ఆచరణలకు విరుద్ధంగా, సంఘాన్ని తిరిగి రక్షణ సువార్త వైపు తిరగలని బోధించాడు.
లూథర్ యొక్క ధైర్యమైన నిలకడ
లూథర్ బైబిలును సామాన్య ప్రజలకు అందించడానికి కృషి చేసి, బైబిలును జర్మన్ భాషలోకి అనువదించాడు, అనేక పుస్తకాలు రాశాడు మరియు బైబిలు ఆధారిత కీర్తనలను (Hymns) రచించాడు.
ఆ కాలంలో చర్చ్ కోర్టు ముందు విచారణకు నిలబడినప్పుడు, లూథర్ తన సిద్ధాంతాలను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయబడినప్పుడు, ఆయన చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి: “నా మనస్సాక్షిని స్వాధీనం చేసుకున్న దేవుని వాక్యానికి నేను కట్టుబడి ఉండక తప్పదు. దీనికి విరుద్ధంగా వ్యవహరించడం సురక్షితం కాదు, సరైనది కూడా కాదు. ఇక్కడ నేను నిలబడి ఉన్నాను; నేను వేరే విధంగా చేయలేను, దేవా, నాకు సహాయం చేయి! ఆమేన్./I cannot choose but adhere to the Word of God, which has possession of my conscience; nor can I possibly, nor will I even make any recantation, since it is neither safe nor honest to act contrary to conscience! Here I stand; I cannot do otherwise, so help me God! Amen.”
లూథర్‌తో పాటు ఇతర ముఖ్య సంస్కర్తలు
లూథర్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పటికీ, ఇతరులు సంస్కర్తలు వేరు వేరు ప్రాంతాలలో దీనికి బలాన్ని చేకూర్చారు:
జాన్ కాల్విన్/John Calvin: దేవుని సార్వభౌమాధికారంపై (Sovereignty) దృష్టి సారించి, సంస్కరణ దైవశాస్త్రాన్ని క్రమబద్ధీకరించాడు.
ఉల్రిచ్ జ్వింగ్లీ/Ulrich Zwingli: స్విజర్లాండ్‌లో సంస్కరణకు తోడ్పడి, ఆరాధన, పరిపాలనలో సోలా స్క్రిప్చురాను కఠినంగా పాటించాలని ప్రతిపాదించాడు.
జాన్ నాక్స్/John Knox: స్కాట్లాండ్‌లో సంస్కరణను నడిపించి, ప్రెస్బిటేరియన్ చర్చిని స్థాపించాడు.
ఈ ఉద్యమం అనబాప్టిస్ట్/Anabaptist మరియు ఇంగ్లీష్ సంస్కరణ ఉద్యమాలకు కూడా దారితీసింది. ఆ తర్వాత, ఈ సంస్కరణ సిద్ధాంతాలు ఐరోపా అన్వేషణ ద్వారా అమెరికాతో సహా దక్షిణాఫ్రికా, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, క్రైస్తవ్య వ్యాప్తికి ప్రభావితం చేశాయి.
సంస్కరణ యొక్క నిరంతర ప్రాముఖ్యత
సంస్కరణ దినోత్సవం అంటే దేవుని వాక్య సత్యాన్ని, సువార్త మూలాన్ని తిరిగి పొందిన సందర్భాన్ని జరుపుకోవడం. అంతేగానీ రిఫర్మేషన్ తెచ్చిన మార్పును నాశనం చేయకూడదు./Do not RUIN what Reformation had REVIVED. ఆ రిఫర్మేషన్ మనుష్యుల ద్వారా మాత్రమే కాక దేవుని ద్వారా ఆయన వాక్యం ద్వారా సాధ్యమైంది/The Reformation was brought by God and His Word, not merely men. అలాగే ఈ సంస్కరణ ఉద్యమం సామాజిక, రాజకీయ ఆలోచనల్లో కూడా మార్పు తెచ్చింది.
ఈ దినోత్సవం క్రైస్తవ సంఘం “ఎల్లప్పుడూ సంస్కరించబడుతూ ఉండాలి” (semper reformanda) అనే హెచ్చరికను ఇస్తుంది. మన రక్షణ కృప ద్వారా మాత్రమే, విశ్వాసం మాత్రమే, క్రీస్తు మాత్రమే, లేఖనం మాత్రమే అనే నిత్య సత్యాలపై మనల్ని మనం స్థిరపరుచుకోవాలి. అంతిమంగా, ఇదంతా దేవునికి మాత్రమే మహిమ (Soli Deo Gloria) కలిగేందుకే అని జ్ఞాపకం చేస్తుంది.

