క్రిస్మస్ గురించి మీకు తెలియని 6 అపోహలు | 6 Christmas Myths You Don't Know

0

A stylized Nativity scene depicting Jesus, Mary, and Joseph in a snowy stable, simultaneously visited by the Three Wise Men and shepherds. The image illustrates common misconceptions by including Santa Claus standing with a sack of gifts, Santa flying in a sleigh, a decorated Christmas tree, and a winter setting under a bright star.
బైబిల్‌ను లోతుగా అధ్యయనం చేసేవారికి, ఆధునిక క్రిస్మస్ వేడుకలు వైరుధ్యాన్ని కలిగిస్తాయి. ఆధునిక క్రిస్మస్ చిత్రాలు, నాటకాలు క్రీస్తు జననాన్ని సూచించినప్పటికీ, చాలావరకు చారిత్రక, బైబిల్ ఆధారాలకు భిన్నంగా ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ లోక సంప్రదాయాలు అసలు చరిత్రను కప్పివేశాయి. ఈ పొరలను తొలగించి, వాక్యాన్ని, చారిత్రక భౌగోళిక పరిస్థితులను మరియు యూదుల సంస్కృతిని పరిశీలిస్తే, దేవుడు మానవ చరిత్రలో శరీరధారిగా దిగివచ్చిన గొప్ప సత్యం వెల్లడవుతుంది.


దేవుని వాక్యం మరియు చరిత్ర ఆధారంగా, క్రిస్మస్/Christmas గురించి ప్రచారంలో ఉన్న 6 ప్రధాన అపోహలు మరియు వాటి వాస్తవాలు తెలుసుకుందాం:


1వ అపోహ: క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడు 

అపోహ: యేసు క్రీస్తు నడి చలికాలంలో, కచ్చితంగా డిసెంబర్ 25న జన్మించారని అందరూ భావిస్తారు.


వాస్తవం: యేసు పుట్టిన తేదీ గురించి బైబిల్లో ఏమి చెప్పబడలేదు. కానీ, అంతర్గత ఆధారాలను బట్టి చూస్తే అది చలికాలం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే, లూకా 2:8లో “గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండిరి” అని గమనిస్తాం. కానీ యూదయ కొండ ప్రాంతాల్లో డిసెంబర్ (కిస్లేవ్ లేదా టెబెత్ నెలలు/Kislev or Tevet) వర్షాకాలం మరియు విపరీతమైన చలి ఉంటుంది. ఆ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. అటువంటి వాతావరణంలో గొర్రెల కాపరులు తమ మందలను బయట పొలాల్లో ఉంచరు; వాటిని గుహలల్లోనో లేదా దొడ్లల్లోనో భద్రపరుస్తారు.


అంతేకాకుండా, రోమా చక్రవర్తి ఆగస్టస్ (Agustus) జనాభా లెక్కల కోసం ప్రజలను వారి సొంత ఊళ్లకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు (లూకా 2:1). పరిపాలనలో కచ్చితత్వాన్ని పాటించే రోమన్లు, రోడ్లు బురదగా మారి, ప్రయాణానికి వీలులేని చలికాలంలో ప్రజలను ప్రయాణించమని ఆదేశించే అవకాశం లేదు. దీన్ని బట్టి, యేసు జననం వసంత కాలంలో లేదా శరదృతువులో/spring or autumn సుమారుగా పర్ణశాలల పండుగ సమయంలో/Feast of Tabernacles జరిగి ఉండవచ్చని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. డిసెంబర్ 25 అనేది రోమన్ల శీతాకాల పండుగలైన 'సాటర్నేలియా' లేదా 'సోల్ ఇన్విక్టస్/Saturnalia or Sol Invictus' (సూర్య దేవుని పండుగ) స్థానంలో 4వ శతాబ్దంలో క్రైస్తవులు నిర్ణయించిన తేదీ మాత్రమే.


2వ అపోహ: యేసు పశువుల పాకలో జన్మించాడు 

అపోహ: సత్రపు యజమాని యోసేపును మరియను  నిర్దయగా వెలగొట్టాడని, “సత్రంలో స్థలం లేక” ఊరి బయట ఉన్న ఒక పశువుల పాకలో లేదా గుహలో యేసును కనాల్సి వచ్చిందని చాలామందికి ఒక అభిప్రాయం ఉంది.


వాస్తవం: ఈ అపోహ ఒక తప్పుడు అనువాదం వల్ల వచ్చింది. లూకా 2:7లో వాడిన గ్రీకు పదం 'కటలుమా' (Kataluma). దీనికి సరైన అర్థం “అతిథి గది” (Guest Room) లేదా మేడ గది. యేసు ప్రభువు తన చివరి రాత్రి భోజనం చేసిన గదికి కూడా లూకా ఇదే పదాన్ని వాడారు. అదే లూకా, డబ్బులు చెల్లించే సత్రం (మంచి సమరయుడు ఉపమానంలో) గురించి చెప్పినప్పుడు 'పాండోకియోన్' (Pandocheion) అనే పదాన్ని వాడాడు.


మొదటి శతాబ్దపు యూదుల ఇళ్లు సాధారణంగా రెండు అంతస్తులుగా ఉండేవి. పైభాగంలో (కటలుమా) కుటుంబం నివసించేది. కింది భాగంలో (Ground floor), రాత్రిపూట భద్రత కోసం మరియు ఇంటికి వెచ్చదనం కోసం జంతువులను ఉంచేవారు. ఆ జంతువులకు మేత వేసే రాతి తొట్టెలు (Mangers) ఆ కింది భాగంలోనే ఉండేవి. బైబిల్ వాస్తవం ఏమిటంటే, యోసేపును మరియను ఎవరూ గెంటేయలేదు. జనాభా లెక్కల వల్ల బంధువుల ఇంట్లోని “అతిథి గది” (పై గది) నిండిపోవడంతో, ఆ కుటుంబం వారిని సాదరంగా ఆహ్వానించి, ఇంట్లోని కింది భాగంలో (జంతువులను ఉంచే చోట) బస ఇచ్చారు. యేసు సమాజం నుండి వెలివేయబడినవానిగా కాకుండా, ఒక యూదా కుటుంబం మధ్యలో, వారి ఆప్యాయత నడుమ జన్మించాడు.


3వ అపోహ: శాంటా క్లాజ్/Santa Clause (క్రిస్టమస్ తాత)

అపోహ: శాంటా క్లాజ్ క్రిస్మస్ స్ఫూర్తికి ప్రతీక అని, యేసు ప్రభువుకు లౌకిక సమాంతర రూపమని భావిస్తారు.


వాస్తవం: శాంటా క్లాజ్, 4వ శతాబ్దానికి చెందిన సెయింట్ నికోలస్ జీవితం ఆధారంగా కల్పించబడింది. ఈయన త్రిత్వ సిద్ధాంతాన్ని సమర్థించి, పేదలకు సహాయం చేసిన బిషప్. అయితే, ఆధునిక శాంటా క్లాజ్ పాత్ర దైవత్వాన్నే సవాలు చేసేలా ఉంది. కేవలం దేవునికి మాత్రమే ఉండే లక్షణాలను (Omni-qualities) చాలామంది శాంటాకు ఆపాదించడం: సర్వజ్ఞాని (మనం నిద్రపోయేది, లేచేది ఆయనకు తెలుసు), సర్వవ్యాపి (ఒకే రాత్రి ప్రతి ఇంటికి వెళ్లగలడు), మరియు న్యాయాధిపతి (ఎవరు మంచో, ఎవరు చెడో నిర్ణయించి లిస్ట్ రాస్తాడు).


దైవశాస్త్రం (Theology) ప్రకారం చూస్తే, శాంటా కథ “క్రియల సువార్త”ను (Gospel of Works) బోధిస్తుంది - అంటే “నువ్వు బుద్ధిగా ఉంటేనే బహుమతి వస్తుంది”. ఇది బైబిల్ చెప్పే “కృపా సువార్త”కు (Gospel of Grace) పూర్తిగా విరుద్ధం ఉంది. మనం పాపులైనప్పటికీ (Naughty list లో ఉన్నప్పటికీ), దేవుడు మన క్రియలను బట్టి కాకుండా, ఆయన మంచితనాన్ని బట్టి మనకు రక్షణ అనే ఉచిత బహుమానాన్ని ఇచ్చాడు. ఈ రెండింటినీ కలపడం వల్ల పిల్లల్లో గందరగోళం ఏర్పడి, రక్షణ అనేది సంపాదించుకునేది అనే తప్పుడు భావన కలుగుతుంది.


4వ అపోహ: జ్ఞానులు వచ్చినప్పుడు యేసు పశువుల పాకలో ఉన్నాడు

అపోహ: క్రిస్మస్ సందర్భ నాటకాల్లో గొర్రెల కాపరులు, ముగ్గురు జ్ఞానులు ఒకేసారి బాలుడైన యేసు ముందు మోకరిల్లినట్లు చూపిస్తారు.


వాస్తవం: ఇది రెండు వేర్వేరు సంఘటనలను కలిపి చూడటం వల్ల వచ్చిన అపోహ. యేసు పుట్టిన రాత్రి పశువుల తొట్టిలో ఉన్న శిశువును (Brephos) చూసింది కేవలం గొర్రెల కాపరులే (లూకా 2). తూర్పు జ్ఞానులు (Magi) రావడానికి కొన్ని నెలలు లేదా దాదాపు రెండు సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. మత్తయి 2:11 ప్రకారం, జ్ఞానులు వచ్చేసరికి యేసు ఒక “ఇంట్లో” (House) ఉన్నాడు, పాకలో కాదు. అప్పుడు ఆయనను “చిన్న పిల్లవానిగా” (Paidion - Toddler) పేర్కొన్నారు.


అంతేకాకుండా, బైబిల్‌లో ఎక్కడా “ముగ్గురు” మనుషులని రాయలేదు. బంగారం, సాంబ్రాణి, బోళము అనే మూడు రకాల బహుమతులు తెచ్చారు కాబట్టి ముగ్గురు అని అనుకుంటారు. ఆ కాలంలో అంత విలువైన సంపదతో ప్రయాణించేటప్పుడు, రక్షణ కోసం పెద్ద సమూహంగా వచ్చేవారు. చారిత్రక ఆధారాల ప్రకారం వారు రాజులు కాదు, పర్షియన్ ఖగోళ శాస్త్రజ్ఞులు (Magi). వారి రాకను బట్టి హేరోదు రాజు “రెండు సంవత్సరాల లోపు” పిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు. దీన్ని బట్టి జ్ఞానులు వచ్చేసరికి యేసు అప్పుడే పుట్టిన బిడ్డ కాదని స్పష్టమవుతోంది.


5వ అపోహ: క్రిస్మస్ చెట్టు (Christmas Tree)

అపోహ: క్రిస్మస్ చెట్టు అనేది క్రీస్తు జననాన్ని ఆచరించడానికి బైబిల్ ఆజ్ఞాపించిన పురాతన క్రైస్తవ చిహ్నం అని చాలామంది భావిస్తారు. 


వాస్తవం: యేసు జనన వృత్తాంతంలో క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఎక్కడా లేదు. యిర్మీయా 10:3-4లో చెట్టును నరికి, వెండి బంగారాలతో అలంకరించడాన్ని బైబిల్ ఖండిస్తుంది. (అయితే యిర్మీయా అక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నారు). ఏది ఏమైనా, ప్రకృతిని లేదా చెట్లను ఆరాధించడం అన్యజనుల ఆచారమే తప్ప యూదులది కాదు.


క్రిస్మస్ చెట్టు మూలాలు ఈజిప్షియన్లు మరియు రోమన్లు శీతాకాలంలో పచ్చని కొమ్మలను (Evergreens) మరణంపై జీవం పొందే విజయానికి గుర్తుగా అలంకరించుకునేవారు. అయితే 16వ శతాబ్దంలో జర్మనీ క్రైస్తవులు దీనిని ఒక ఆధునిక సంప్రదాయంగా మార్చారు. కానీ, అమెరికాలోని ప్యూరిటన్లు (Puritans) దీనిని అన్యజనుల ఆచారంగా (Pagan custom) భావించి తీవ్రంగా వ్యతిరేకించారు, నిషేధించారు కూడా. చివరికి 1846లో ఇంగ్లాండ్ రాణి విక్టోరియా, ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ తమ పిల్లలతో కలిసి క్రిస్మస్ చెట్టు చుట్టూ ఉన్న చిత్రం ప్రచురితమయ్యాకే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ఇది ఒక సాంస్కృతిక అలంకరణ మాత్రమే తప్ప, దీనికి దేవుడు మానవునిగా జన్మించిన (Incarnation) సిద్ధాంతానికి ఎలాంటి సంబంధం లేదు.


6వ అపోహ: క్రీస్తు జన్మించిన రాత్రి పశువుల పాకపై నక్షత్రం నిలిచింది

అపోహ: యేసు పుట్టిన రాత్రి, ఒక పెద్ద నక్షత్రం నేరుగా పశువుల పాక పైన నిలిచి, గొర్రెల కాపరులకు దారి చూపింది అని చాలామంది నమ్ముతారు. 


వాస్తవం: సువార్తలు జాగ్రత్తగా చదివితే, గొర్రెల కాపరులకు మార్గం చూపింది “నక్షత్రం” కాదు, “దేవదూతలు”. లూకా 2వ అధ్యాయంలో, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందని, దేవదూత వారికి శుభవార్త చెప్పాడని ఉంది. వారు వెతకాల్సిన గుర్తు ఆకాశంలో ఉన్న నక్షత్రం కాదు, పశువుల తొట్టిలో ఉన్న శిశువు (లూకా 2:12).


బెత్లెహేములో ఉదయించిన నక్షత్రం కేవలం మత్తయి సువార్తలో, తూర్పు జ్ఞానుల వృత్తాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించింది. అది ఆ ఇంటిపై నిలిచే సమయానికి, యేసు అప్పటికే కొంత ఎదిగిన బాలుడిగా ఇంటిలో ఉన్నాడు. యేసు పుట్టిన రోజు రాత్రి ఉన్న వెలుగు దేవుని మహిమ వల్ల, దేవదూతలు ప్రత్యక్షమవడం వల్లే వచ్చింది. చాలా దినాల తర్వాత జ్ఞానులకు దారి చూపిన నక్షత్ర కాంతి కాదు అది.

An infographic chart in Telugu titled 'The Biblical Timeline of Christ's Birth,' showing the chronological sequence of events from the birth in the manger to the flight to Egypt and return to Nazareth.



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !