యేసు క్రీస్తు పునరుత్థానుడై లేచి మరణానికే మరణాన్ని చూపించాడు. ఆ కాలంలో పునరుత్థానాన్ని నమ్మని అనేకమందికి ముందుగానే ప్రవచించి, అనేక సూచనలిచ్చి, ఆయన మృత్యుంజయుడై వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు. ఆయన మరణ పునరుత్థానం విశ్వాసులకు పునరుద్థాన నిరీక్షణనిచ్చింది. ఈ పునరుత్థానం రాబోయే కాలంలో జరిగే పునరుద్ధానాలకు కూడా నాంది పలికింది. బైబిల్ అంతటా వివరించబడిన ఈ పునరుత్థానాలు, మరణాన్ని జయించే దేవుని శక్తిని తెలియజేస్తూ నిత్యజీవానికి నిరీక్షణను అందిస్తాయి.
1. సిలువలో పునరుత్థాన సంకేతం
యేసు సిలువ మీద "సమాప్తమైనది!" అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిన సమయంలో (యోహాను 19:30), భూమి కంపించింది, సమాధులు తెరవబడి, అనేకమంది పరిశుద్ధుల లేచి యెరూషలేము వీధుల్లో సంచరించారు (మత్తయి 27:52–53). ఈ అద్భుతమైన సంఘటన, మరణంపై క్రీస్తు పునరుత్థాన విజయానికి ముందస్తు సూచన. అప్పుడు సమాధులలో నుండి పునరుత్థానులైన పరిశుద్ధులు, యేసు మరణం ద్వారా మానవాళి విమోచన ప్రారంభమైందని సూచించారు. వారి పునరుత్థాన శరీరాలు యేసు పునరుత్థానుడై ఖచ్చితంగా లేస్తాడని సూచించాయి.
2. క్రీస్తు పునరుత్థానం
యేసు సిలువలో మరణించి, సమాధిచేయబడి మూడు రోజుల తర్వాత, కేవలం బ్రతకలేదు ఆయన మహిమతో, నిత్యశరీరంతో పునరుద్ధానుడై లేచాడు (1 కొరింథీ 15:20). ఆయన చేసిన బోధలు, ప్రకటనలు వాస్తవమని నిరూపించాడు. ఈ పునరుత్థానం, ఆయన దైవత్వాన్ని నిరూపించింది, సాతానును ఓడించింది, విశ్వాసులందరికీ నిత్యజీవ హామీనిచ్చింది (రోమా 4:25). ఆయన మహిమ శరీరం, మనకు భవిష్యత్తులో పొందబోయే నూతన శరీరాలకు ఆదర్శం (ఫిలిప్పీ 3:21).
3. సంఘం యొక్క పునరుత్థానం
అత్యంత ప్రాముఖ్యమైన, సంఘమంతా ఎదురుచూసే పునరుత్థానమే, సంఘ పునరుత్థానం/సంఘం ఎత్తబడటం. దీనిని రాప్చర్/Rapture అని కూడా అంటారు, అంటే "ఎత్తబడటం" అని అర్థం. ఒక్క క్షణంలో, అకస్మాత్తుగా "క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు," "ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము" (1 థెస్స 4:16–17). ఈ "పునరుత్థానం" సంఘాన్ని మహా శ్రమల కాలం (Tribulation/ట్రిబ్యులేషన్) నుండి కాపాడుతుంది (1 థెస్స 1:9,10). దీని ద్వారా క్రీస్తు తన ప్రియమైన సంఘం కోసం తిరిగి వస్తాడనే నిరీక్షణను భలపరుస్తుంది (యోహాను 14:3).
4. మహాశ్రమల పరిశుద్ధులు, పాత నిబంధన విశ్వాసుల పునరుత్థానం
సంఘం ఎత్తబడిన తర్వాత, మహా శ్రమల కాలంలో క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండి, తమ విశ్వాసం కొరకు మరణించినవారు క్రీస్తు రెండవ రాకడలో పునరుత్థానం చెంది, క్రీస్తుతో కలిసి వెయ్యేండ్ల సంవత్సరాలు ఆయనతో రాజ్యం చేస్తారు (ప్రకటన 20:4–6). దానియేలు 12:2 ప్రకారం, పాత నిబంధన కాలంలోని విశ్వాసుల కూడా ఇదే సమయంలో పునరుత్థానులుగా లేపబడతారు. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుంది (యెహెఙ్కేలు 37:12–14).
5. పాపుల పునరుత్థానం
ఈ లోకం అంతమైపోయే చివరిలో, చరిత్ర అంతటిలో, క్రీస్తును తిరస్కరించిన వారందరూ ధవళమైన మహా సింహాసనం ముందు తీర్పుకై క్రీస్తు ఎదుట నిలబడతారు (ప్రకటన 20:11–15). కయీను మొదలుకొని ఆ సమయం వరకు ఉన్న పాపులందరూ లేపబడతారు. కానీ ఈ పునరుత్థానం తీర్పు కొరకు, వారిని శిక్షించడానికి. దీనినే పాపుల పునరుత్థానం అని కూడా చెప్పవచ్చు. వారి క్రియలు వారిని ఖండిస్తాయి. కానీ క్రీస్తులో విశ్వాసంతో రక్షించబడినవారు మాత్రం "కొత్త యెరూషలేము"లో నిత్యజీవం పొందుతారు, అక్కడ "మరణము ఇక ఉండదు" (ప్రకటన 21:4).
సిలువ మరణం దగ్గర జరిగిన పునరుత్థానం నుండి నిత్యత్వం వరకు, ఈ పునరుత్థానాలు మనకు ఒకే సత్యాన్ని చాటుతున్నాయి: క్రీస్తు ఖాళీ సమాధి మన నిత్యజీవానికి హామీ. ఆయన తిరిగి రెండవ రాకడలో సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన రోజు, విశ్వాసులందరూ సమాధుల నుండి పునరుత్థానం చెందుతారు. సోలి డియో గ్లోరియా/Soli Deo Gloria (దేవునికే మహిమ కలుగును గాక).
