దేవుని చిత్తం కోసం నా కోరికలు చంపుకోవాలా? | Should I kill my desires for God's will?

0

Confused cartoon man standing at a crossroads with multiple direction signs

కోరికలు, ఇష్టాలు మన జీవితాలకు స్పూర్తినిస్తాయి. ఆ కోరికలను తీర్చుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి కష్టానికైనా సిద్ధపడతాం. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇలాంటి కోరికలతో కొట్టుమిట్టూలాడుతూ, "నా కోరికలు తీర్చుకోవాలా? లేదా దేవుడు చిత్తాన్ని జరిగించాలా?" అనే ఆలోచనలతో సతమతమౌతుంటాం.  ఇలాంటి సందర్భాలలో దేవుని చిత్తమూ, ఆయన ఉద్దేశాలు మంచివని తెలిసినప్పటికీ, ఆయన చిత్తంతో మన కోరికలను ఏకీకృతం చేయడం చాలా కష్టమనిపిస్తుంది. ఈ కష్టమైన పరిస్థితికి పరిష్కారం దొరకాలంటే బైబిల్ కోణంలో దీనిని అర్థం చేసుకోవాలి. 


దేవుని చిత్తాన్ని అంగీకరించడం ఎందుకు అంత కష్టం?

1. నష్టపోతాం అనే భయం: "దేవుని చిత్తాన్ని అనుసరిస్తే నా కోరికలు, కలలు చచ్చిపోతాయి" అనే భ్రమ దేవుని చిత్తం అంగీకరించకుండా చేస్తుంది.

2. దేవునిని అపార్థం చేసుకోవడం: దేవునిని "నియంత"గా భావిస్తూ, "తండ్రి"గా ఉండి ఆయన చూపించే ప్రేమ, ఆయన జ్ఞానం గుర్తించకుండా చేస్తాయి (యిర్మియా 29:11). 

3. లోకం చూపే ప్రభావం: "నీవే నీ జీవితానికి యజమానివి", "నీ మనసు మాట విను" అనే ఆధునిక సందేశాలు దేవునికి చిత్తానికి విధేయులుగా ఉండకుండ బలహీనం చేస్తాయి.

4. ఫలితాలు కనిపించకపోవడం: దేవుని మార్గాలు తర్కానికి అందనివని గ్రహించి (యెషయా 55:8-9), అనుకున్న ఫలితాలు కనిపించేవరకు విశ్వాసంతో ఎదురుచూడడం పెద్ద సవాలుగా అనిపిస్తుంది.


దేవుని చిత్తాన్ని అనుసరిస్తే "నా కోరికలు చచ్చిపోతాయా"?

దేవుని చిత్తాన్ని వెంబడించడం అంటే మన కోరికలను "చంపడం" కాదు, వాటిని పవిత్రీకరించి, పరిపూర్ణంగా మార్చడం. దేవుడు మనలను ఆశ-జీవులుగా సృష్టించాడు, కానీ పాపం వాటిని వక్రీకరించింది. మనం "చంపాల్సింది" ఆ పాపపు కోరికలు మాత్రమే (యాకోబు 1:15). 

ఉదాహరణకు: ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ధనాన్ని ఆశిస్తున్నాడు అనుకుందాం. ఆ కోరిక ప్రవిత్రీకరించడానికి ఆ డబ్బును స్వార్థం కోసం కాకుండా, ఇతరుల సేవ కోసం ఉపయోగించాలనే కోరికగా మారినప్పుడు, అది దేవుని రాజ్య విస్తరణకు సాధనమవుతుంది. "దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడితే ఏమీ లభించదు; ప్రశాంతంగా సమర్పించుకుంటే కోల్పోయేది ఏమి లేదు/There is nothing got by struggling against the will of God; nor anything lost by a quiet submission to it”. (A Christian Directory - Part I: Christian Ethics, 2022, 440).


కోరికలు: "నా ఇష్టం" vs "దేవుని చిత్తం"

మనుషుల కోరికలు స్వభావతంగా చెడ్డవి కాకపోవచ్చు. ఎందుకంటే ఆనందం, ప్రేమ, మంచి జీవనం మొదలైనవి ఆకాంక్షించడాన్ని దేవుడే సృష్టించాడు. కీర్తన 37:4 ఇలా చెప్పబడింది: "యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును". కానీ పాపం ఈ కోరికలను వక్రీకరిస్తుంది. ఆశలు, కోరికలు పెరిగి దూరాశలై నష్టపోయేలా చేస్తాయి, క్రమేణా నాశనానికి నడుపుతాయి (యాకోబు 1:14-15).  

ఒక ఉదాహరణ: "ఒక యవ్వనస్థుడు తన తండ్రిని వేదించి వేదించి "నాకు పుట్టినరోజు కానుకగా బైక్ కావాలి, కొనివ్వండి, అది నన్ను సంతోషపెడ్తుంది" అని గోల గోల చేశాడు. తండ్రి కొంచం ఆగు నాయన నీకోసం వేరే విలువైన బహుమతి ఉందని చెప్పినా కూడా వినలేదు. తన కొడుకు వేదింపులకు తట్టుకోలేక బైక్ కొనిపించాడు, తండ్రి. పుట్టినరోజు అయిన తర్వాత, అతని తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో నా బైక్ అని సంబరంగా చెప్పుకున్నాడు. అప్పుడు అతని తల్లి ఏమందంటే "ఓరి! పిచ్చిమాలోకం మీ నాన్న నీకు కార్ కొనివ్వాలని మొత్తం రెఢీ చేస్తే, నువ్వేమో నాకు బైక్ కావాలని గోల చేశావు. లేదంటే నీకు ఆ కార్ కొనిచ్చేవారు మీ నాన్న అని చెప్పింది, అమ్మ. ఆ మాటతో దుఖఃముఖం పెట్టాడు". 

కాబట్టి, మన కోరికలు, ఇష్టాల కంటే దేవుని చిత్తంలో వచ్చే ప్రయోజనాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకోవాలి. ప్రారంభంలో మన ప్రణాళికలు, కోరికలు మంచివిగాను, సంతోషాన్నిచ్చేవి గాను అనిపించవచ్చు, కానీ దేవునివి గొప్పవి, సంపూర్ణతను అనుగ్రహించేవి. మన చిత్తానుసారమైన కోరికల ప్రారంభం బాగుండోచ్చేమో కానీ దేవుని చిత్తంలో ముగింపు అన్నీంటిని సంతోషకరంగా చేస్తుంది. మనం దేవుని పరిపూర్ణ సమయానికి, ఆయన మనకు అన్నీ అనుగ్రహించే ప్రాణాళికకు మనం విరుద్ధంగా ఉంటే నష్టపోయేది మనమే. 


దేవుని చిత్తం: ఆనందానికి ఆరంభం, అంతం

దేవుని చిత్తం కఠినమైన ఆజ్ఞ కాదు, సంపూర్ణ సంతోషానికి, సుఖానికి, సంతృప్తికి మార్గం. కీర్తనకారుడైన దావీదు ఏమంటడంటే, "నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు" (కీర్తన 16:11). ఆ దేవుని చిత్తం మన ఆనందానికి శత్రువేమీ కాదు గానీ సర్వ సంతోషాలకు ఆధారం.  రిచర్డ్ బాక్స్టర్ అనే వేదాంతవేత్త మాటల్లో, "దేవుని చిత్తం......మన ఇష్టాలకు కేంద్రం మరియు లక్ష్యం. దేవుని చిత్తంలోనే మన ఇష్టాలకు విశ్రాంతి ఉంది". (A Christian Directory, Part I: Christian Ethics, 2022, 440)

మన కోరికలు, ఇష్టాలు తాత్కాలిక ఆనందంతో మొదలవుతాయి (బైక్ కావాలని ఆ యవ్వనస్థుడు వేదించినట్టు), కానీ దేవుని చిత్తం శాశ్వత సంతోషంతో ముగుస్తుంది. అబ్రాహాము విశ్వాసం (ఆదికాండం 22), పౌలు మార్పు (అపొ. కార్యాలు 9) మన ఇష్టాలను, కోరికలను దేవునికి సమర్పించుకోవడం శాశ్వత ప్రయోజనాలకు దారితీస్తుందని చూపిస్తాయి. మన కోరికలను దేవునికి సమర్పించుకోవడం అంటే మన కోరికలను చంపుకోడమో లేదా ఓడిపోడమో కాదు, దేవుని మేలు చేసే సార్వభౌమత్వంలో సంతృప్తి పొందడం, నిత్య సుఖములు ఆయనలో అనుభవించడం. రిచర్డ్ బాక్స్టర్ అనే వేదాంతవేత్త ఏమంటారంటే, "దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడితే ఏమీ లభించదు; ప్రశాంతంగా సమర్పించుకుంటే ఏమీ కోల్పోము/There is nothing got by struggling against the will of God; nor anything lost by a quiet submission to it”. (A Christian Directory, 440)


ముగింపు

మనం కోరికలను, ఇష్టాలను దేవుని చిత్తంతో విలీనం చేసి చూసినప్పుడు, ఆ కోరికల ద్వారా కలిగే అసలైన ఫలితాన్ని గ్రహించగలం. ఆ మన కోరికలు దేవుని చిత్తంలో కలిసినప్పుడు అవి పవిత్రపరచబడి, పరిపూర్ణమై, సరైన మార్గంలో నడవడానికి సహాయపడుతాయి. అలా దేవుని చిత్తంతో మన చిత్తాన్ని ఏకం చేసుకున్నప్పుడు, మనం ఆయన రాజ్య విస్తరణలో భాగస్వాములవుతాము. కాబట్టి మన కోరిక/ఇష్టం/చిత్తం ఏదైనా సరే అది దేవుని రాజ్యాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించినప్పుడు, మన చిత్తం దేవుని చిత్తంతో ఏకమై పరిపూర్ణమవుతుంది.  మనం దేవుని చిత్తంలో సంతోషిస్తే ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా అనుభవించగలం. 

"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును" (సామెతలు 3:5-6).


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !