"సిలువ ద్వారానే విమోచన కార్యం జరిగాలని ఆనంతజ్ఞానం నిర్ణయించింది" అని జె.సి.రైల్ అంటాడు. ఈ సిలువ మరణం ద్వారానే మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి, విమోచించబడాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకొరకు ఆ పరమ దేవుడైన యేసుక్రీస్తు సిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సిలువ మరణ సమయంలో యేసు చివరిగా పలికిన ఏడు మాటలు, దేవుని ప్రేమను, ఆయన విమోచన ప్రణాళిక యొక్క పరిపూర్ణతను వివరిస్తాయి.
1. మొదటి మాట
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.” (లూకా 23:34)
సిలువలో చిత్రహింసలు భరిస్తున్న క్రీస్తు, తనను హింసిస్తున్న వారి కోసం ప్రార్థించాడు. ఇది యెషయా 53:12లోని “అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనము చేసెను” అనే ప్రవచనానికి ఇది నెరవేర్పు.
క్రీస్తు ఈ ప్రార్థన ద్వారా, దేవుని కృప, కరుణ మానవ తిరస్కారానికి మించినదని రుజువుచేశాడు (రోమీయులు 5:8). ఆయన ప్రధాన యాజకుడిగా (హెబ్రీయులు 4:14-16), మన పాపాలను తనపై వేసుకున్నాడు. “వీరెరుగరు ” అనడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుంది, కాని దేవుడు మారుమనస్సు పొందడానికి అవకాశం ఇస్తాడు (2 పేతురు 3:9).
క్రైస్తవులైన మనం కూడా శత్రువులను క్షమించాలి (మత్తయి 5:44). అలా చేయడం ద్వారా క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించగలం.
2. రెండవ మాట
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను." (లూకా 23:43)
యేసుతో పాటుగా సిలువ వేయబడిన ఒక భయంకరమైన దొంగ, యేసుక్రీస్తును “ప్రభువు” గా గుర్తించి, రక్షణ అనుగ్రహించమని కోరాడు.
ఈ సంఘటన కృప ద్వారా మాత్రమే రక్షణ అనుగ్రహించబడుతుందని నిరూపిస్తుంది (ఎఫెసీ 2:8-9). దొంగ ఎటువంటి సత్క్రియలు చేయలేదు, కాని విశ్వాసం మాత్రమే చూపించాడు (రోమా 10:13). ఆ విశ్వాసానికి ఫలితమే ఆ దొంగకు దేవుని సన్నిధిలో చోటు దొరికింది. గమనిస్తే క్రీస్తు మరణ సమయంలో కూడా ఆయన రాజుగా అధికారం చలాయిస్తున్నాడు (లూకా 23:42).
ఏ పాపి అయినా చివరి క్షణంలో క్రీస్తును నమ్మితే రక్షణ పొందవచ్చు (యోవేలు 2:32). ఇది నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలిగిస్తుంది.
3. మూడవ మాట
"అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను." (యోహాను. 19:26-27)
క్రీస్తు, తన మరణ బాధలో కూడా ఆయనకు బౌతికంగా తల్లియైన మరియను యోహాను సంరక్షణలో ఉంచాడు.
ఇది క్రీస్తు పరిపూర్ణ మానవత్వాన్ని చూపుతుంది (హెబ్రీయులు 2:17). తల్లిని గౌరవించడం దేవుని ఆజ్ఞ (నిర్గమ 20:12), ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. క్రీస్తు సంఘాన్ని కూడా “ఆధ్యాత్మిక కుటుంబం”గా ప్రకటించాడు (మార్కు 3:33-35). మరియను యోహానుకు అప్పగించడం, యోహాను స్వీకరించడంను గమనిస్తే, ఇది సంఘం ఒకరినొకరు చూసుకోవాల్సిన బాధ్యతను సూచిస్తుంది (1 తిమోతి 5:8).
సంఘం క్రీస్తు ప్రేమను ఆచారణాత్మకంగా చూపించాలి (యోహాను 13:35).
4. నాల్గవ మాట
"నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46 మరియు మార్కు 15:34)
క్రీస్తు కీర్తన 22:1ను ఉటంకిస్తూ, మానవాళి పాప భారాన్ని తనపై భరిస్తున్నాడు. మన పాపాలకై సిలువలో ఘోరమైన హింసను భరిస్తూ దేవుని ఎడబాటును జ్ఞాపకం చేసుకున్నాడు.
ఈ మాట ప్రాయశ్చిత్త బలి యొక్క లోతును వివరిస్తుంది. క్రీస్తు మన పాపాలను తనపై మోసాడు (1 పేతురు 2:24), దేవుని న్యాయాన్ని విధులను తృప్తిపరిచాడు (రోమా 3:25-26). ఆ సమయంలో దేవుడు క్రీస్తు చేయ్యి విడవాల్సి వచ్చింది. ఆయన క్రీస్తు చేయి విడిచిపెట్టకపోతే మనకు విమోచన ఉండేదికాదు.
క్రీస్తు ఈ బాధను అనుభవించడంలో దేవుని ద్వారా విడిచిపెట్టబడడం వలన, విశ్వాసులు ఎన్నటికీ దేవుని నుండి వేరుపరచబడరు (హెబ్రీ 13:5).
5. ఐదవ మాట
"నేను దప్పిగొను చున్నాననెను." (యోహాను. 19:28)
యేసుక్రీస్తు సిలువపై శారీరకంగా భయంకరమైన బాధను, నొప్పిని భరిస్తు, కీర్తన 69:21ను నెరవేరుస్తున్నాడు.
ఈ మాట క్రీస్తు సంపూర్ణ మానవత్వాన్ని నిరూపిస్తుంది (యోహాను 1:14). ఆయన దాహం, మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక దాహానికి ప్రతీకగా చూస్తాం (యోహాను 4:14). సిర్కా త్రాగించడం (యోహాను 19:29), యెషయా 53 ప్రకారం ఆయన బాధలను పూర్తి చేస్తుంది. ఆయన దప్పికగొని మనమెన్నడు దప్పికగొనకుండా జీవజాలాన్ని ఇచ్చాడు.
క్రీస్తు మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు; అందుకే మనం నిర్భయంగా ఆయన వద్దకు వెళ్లవచ్చు (హెబ్రీ 4:15).
6. ఆరవ మాట
"సమాప్తమైనది" (యోహాను. 19:30)
క్రీస్తు తన మరణానికి ముందు ఈ మాటను ఉచ్చరించాడు. యేసు తనను అప్పగించిన పనిని సంపూర్ణం చేయడాన్ని తండ్రికి పీర్యాదు చేయడంగా గమనించవచ్చు.ఈ మాట గ్రీకులో “టెటెలెస్టై” అనబడింది అంటే “వెల పూర్తిగా చెల్లించబడింది” అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే పాపపు ఋణం పూర్తిగా తీరిపోయింది (కొల 2:14). యేసు ఈ లోకానికి వచ్చిన పనిని ముగించాడు అంటే మానవ పాపాలకై సంపూర్ణ ప్రాయశ్చిత్తం చెల్లించి, పాత నిబంధనను నెరవేర్చి, విమోచన ప్రణాళికను పూర్తి చేశాడు. రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా ముగించాడు. పాత నిబంధన బలులు వ్యవస్థ ముగిసి, క్రీస్తు చేసిన ఒకే బలి సంపూర్ణంగా సరిపోయింది (హెబ్రీ 10:10). ఆయన బలి ద్వారా దేవాలయ తెర చిరిగిపోయి (మత్తయి 27:51), మనకు దేవునితో ప్రత్యక్ష సంబంధం ఉండేలా చేసింది.
ఆయనను విశ్వసించిన వారు పాప భయం లేకుండా జీవించవచ్చు (రోమా 8:1).
7. ఏడవ మాట
"తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను." (లూకా 23:46)
సిలువ శ్రమను పొందుతున్న క్రీస్తు తన చివరి శ్వాస ముగించే సమయంలో కీర్తన 31:5ను ఉటంకిస్తూ ప్రార్థించాడు.ఈ చివరి మాట క్రీస్తు స్వచ్ఛందమైన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది (యోహాను 10:18). యేసు తనంతట తానే స్వయంగా మానవుల కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించడం, విశ్వాసుల మరణాన్ని “దేవుని చేతుల్లోకి అప్పగించడం”గా చూడగలం (1 పేతురు 4:19). ఇది పునరుత్థానానికి ముందస్తు సూచన (1 కొరింథీ 15:20).
క్రైస్తవులు తమ జీవితాలను, ఆత్మను అన్నింటినీ దేవుని చేతులకు అప్పగించి ధైర్యంగా ఉంచవచ్చు (ప్రసంగి 2:10).







