1. భూమి మీద అంధకారం: పాపం పట్ల దేవుని ఉగ్రతకు నిదర్శన
వాక్యభాగం: మత్తయి 27:45; మార్కు 15:33; లూకా 23:44-45
యేసు సిలువ మరణం సమయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇది సాధారణ గ్రహణం కాదు. ఇది యేసు సిలువ మీద భరిస్తున్న మానవుల పాపాలపై దేవుని ఉగ్రతను, దేవుని న్యాయాన్ని, యేసు చేస్తున్న త్యాగాన్ని సూచించింది. దీని ద్వారా సృష్టికర్త అయిన దేవుడు వెలుగును మరుగుపరిచి, పాపం యొక్క భయంకరత్వాన్ని, మానవ విమోచనకు చెల్లించబడిన వెలను ప్రకటించాడు.
2. దేవాలయపు తెర చినగడం: దేవునితో సంబంధం పునరుద్ధరణ
వాక్యభాగం: మత్తయి 27:51a; మార్కు 15:38; లూకా 23:45
యేసు మరణించిన క్షణంలో, యెరూషలేము దేవాలయంలోని "పరిశుద్ధ స్థలాన్ని" వేరుచేసే తెర పైనుండి క్రిందికు చినిగింది. ఇది పాపం వల్ల మానవుడికి, దేవునికి మధ్య ఏర్పడిన దూరాన్ని సూచించేది (యెషయా 59:2). ఇది క్రీస్తు శరీరం ద్వారా "చింపివేయబడి", విశ్వాసులు తండ్రియైన దేవిణ్ణి చేరుకోడానికి ఎలాంటి అడ్డంకి లేని ప్రవేశాన్ని ఏర్పరచినట్లు సూచిస్తుంది (హెబ్రీయులు 10:19-20). ఇకపై యాజకుల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా మహా యాజకుడైన యేసు, అందరికీ ఒక కొత్త మార్గం ఏర్పాటుచేశాడు.
3. భూమి వణకెను; బండలు బద్దలాయెను: సృష్టి సిలువకిచ్చిన ప్రతిస్పందన
వాక్యభాగం: మత్తయి 27:51, 54
యేసు సిలువ మరణ సమయంలో భయంకరమైన భూకంపం యెరూషలేము పునాదులను కదిలించింది. బండలు బద్దలయ్యాయి. ఆలోచిస్తే సృష్టి తన సృష్టికర్త మరణాన్ని గుర్తించినట్లు అర్థమవుతుంది (కీర్తన 114:7). యూదుల సంప్రదాయంలో, భూకంపాలు దేవుని ఘనతకు సాక్ష్యమిచ్చే సంఘటనలు (నిర్గమ 19:18). ఈ సంఘటన యేసుకు సృష్టిపై ఉన్న అధికారాన్ని, మానవాళిని దేవునితో సమాధానపరిచే ఆయన పాత్రను తెలియజేస్తుంది (కొలస్స 1:20). రాళ్ళు కూడా క్రీస్తు సిలువ మరణ ప్రాముఖ్యతకు సాక్ష్యమిచ్చాయి (లూకా 19:40).
4. సమాధులు తెరవబడడం, పరిశుద్ధుల పునరుత్థానం: మరణంపై విజయానికి నిదర్శన
వాక్యభాగం: మత్తయి 27:52-53
యేసు సిలువపై మరణించినప్పుడు సమాధులు తెరవబడి, అనేకమంది పరిశుద్దులు (బహుశా పాత నిబంధన విశ్వాసులు) పునరుత్థానులయ్యారు. యేసు పునరుత్థానం తర్వాత వారు యెరూషలేములో సంచరించారు. ఈ అద్భుతం క్రీస్తు మరణాన్ని ఓడించిన విజయాన్ని ముందస్తుగా చూపించింది (1 కొరింథీ 15:20-23). ఈ పునరుత్థానం భవిష్యత్తులో అందరు విశ్వాసుల పునరుత్థానానికి నాంది పలికింది. మరణం యొక్క బంధకాలు తెగిపోయాయి. క్రీస్తు సమాధి నుండి కూడా విమోచించగలిగే శక్తిని ప్రదర్శించాడు.
5. శతాధిపతి విశ్వాస ప్రకటన: అందరికీ రక్షణ ఆహ్వానం
వాక్యభాగం: మత్తయి 27:54; మార్కు 15:39; లూకా 23:47
యేసును సిలువ వేస్తున్నప్పుడు కాపలా కాయడానికి వచ్చిన రోమా సైనికాధికారి (అన్యుడు) ఈ అద్భుతాలను చూసి, "నిజముగా ఈయన దేవుని కుమారుడు!" అని ప్రకటించాడు. యుద్ధాలతో కఠినమైన హృదయం కలిగిన ఈ అధికారి యొక్క ప్రతిస్పందన, సిలువ యొక్క సార్వత్రిక ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. యేసు మరణం జాతి, మత బేధాలు లేకుండా అందరిని రక్షణ ఆహ్వానముందని నిరీక్షణనిస్తుంది.
