యూదా ఇస్కరియోతు కథాంశం బైబిల్లోని అత్యంత విచారకరమైనది. యూదా యేసు క్రీస్తు శిష్యుడు కానీ, చివరకు ఆయన క్రీస్తును 30 వెండి నాణేలకు అప్పగించాడు. ఈ సంఘటన కేవలం చారిత్రకమైంది మాత్రమే కాదు గానీ ఇది మన హృదయాలను పరిశీలించుకోవడానికి ఉపయోగపడే అద్దం లాంటిది. నేడు, మనల్ని ఆధ్యాత్మిక పతనం నుండి కాపాడుకోవడానికి, యూదా ద్రోహానికి కారణమైన 5 అంశాలను బైబిల్ ఆధారంగా గమనిద్దాం.
1. దొంగ బుద్ది కలిగుండడం
యోహాను 12:4–6: ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 5. యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. 6. వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.
➤ యూదా శిష్యుడిగా ఉన్నంత కాలం దొంగ బుద్ధితో, దూరాశతోనే ఉన్నాడు
➤ మరియ విలువైన అత్తరుతో యేసుకు చేసిన అభిషేకాన్ని యూదా వ్యతిరేకించాడు. "బీదలకు ఇవ్వవచ్చు" అని నటించాడు, కానీ వాస్తవంలో అతను డబ్బు సంచి నుండి దొంగిలించేవాడు (యోహాను 12:6).
➤ గమనిస్తే డబ్బు పట్ల అతని దురాశ తన నైతికతను కమ్మివేసింది. డబ్బుపై ప్రేమ (1 తిమోతి 6:10) అతన్ని అంధుడ్ని చేసింది.
అన్వయం: చిన్న తప్పులు (అసత్యం, లోభం) పెద్ద దుష్టకార్యాలు చేయడానికి ద్వారం తెరుస్తాయి. సంపద వల్ల కలిగే మోసపూరిత ప్రభావం నుండి హృదయాన్ని కాపాడుకోండి (మత్తయి 6:24).
2. ద్రోహం చేయాలనే దుష్టాలోచన
మత్తయి 26:14–16: అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి 15. నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. 16. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
➤ యూదా ప్రధాన యాజకులను స్వయంగా సంప్రదించి, యేసును అప్పగించడానికి 30 వెండి నాణేలు కుదిర్చుకున్నాడు (మత్తయి 26:15).
➤ ఇది ఒక్కసారి జరిగిన తప్పు కాదు గానీ ఇది ఒక ప్రణాళిక. క్రీస్తును అప్పగించాలనే వాంఛతో యూదా ఎదురుచూసినట్లు అర్ధం అవుతుంది.
➤ పాపం తరచుగా మనల్ని చిన్న చిన్న అడుగులతో మొదలై చాలా దూరంగా తీసుకెళ్లింది.
అన్వయం: చెడ్డ ఆలోచనలను మనసులో పెంచుకోకండి. పొతీఫరు భార్య నుండి పారిపోయిన యోసేపు లాగా (ఆదికాండం 39:12), మొదటి శోధనలోనే జాగ్రత్తగా తప్పించుకోండి.
3. దూరాత్మకు చోటివ్వడం
లూక 22:3: అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను
యోహాను 13:27: వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా
యోహాను 6:70–71: అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను. 71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
➤ యూదా, క్రీస్తుతో కూడా ఉంది, క్రీస్తు బోధలు వింటూనే తన హృదయంలో దూరాత్మకు చోటిచ్చాడు.
➤ యూదా పశ్చాత్తాపం లేకుండా పాపంలో నిలిచిపోయాడు. ఫలితంగా, "సాతాను అతనిలో ప్రవేశించాడు" (లూకా 22:3).
➤ యేసు భోజన సమయంలో కూడా హెచ్చరించాడు (యోహాను 13:27), కానీ యూదా మనసు మార్చుకోలేదు.
అన్వయం: పాపాన్ని పట్టుకోవడం సాతానుకు తావు ఇవ్వడమే (ఎఫెసీయులు 4:27). దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా శత్రువును ఎదుర్కోండి (యాకోబు 4:7).
4. దుర్మార్గాన్ని ఎన్నుకోవడం
మత్తయి 26:47-56: ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. 48. ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి 49. వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
మత్తయి 27:3–5: అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి 4. నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా 5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
➤ యూదా తన జీవితంలో ాన్ని దుర్మార్గాలనే ఎన్నుకున్నాడు.
➤ యూదా "ముద్దు" పెట్టి యేసును అప్పగించాడు. ప్రేమకు సంకేతమైన ముద్దుని ద్రోహం చేయడానికి వాడుకున్నాడు (మత్తయి 26:49).
➤ తర్వాత, అతని "పశ్చాత్తాపం" క్షమాపణకు దారితీయకుండా, నిరాశలో మునిగి ఆత్మహత్యకు దారితీసింది (మత్తయి 27:5). పేతురు లాగా కన్నీరు పెట్టి తిరిగి రాలేదు (లూకా 22:62).
అన్వయం: నిజమైన పశ్చాత్తాపం దేవుని వైపు నడిపిస్తుంది (కీర్తన 51:17). తప్పు చేస్తే, క్రీస్తు సన్నిధిని వెంటనే వెతకండి. క్షమాపణ పొందండి.
5. దైవాదేశాన్ని దిక్కరించడం
మత్తయి 26:21,24: వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. 24. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. 25. ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
➤ యూదా చేయబోయే ద్రోహం దేవుని ప్రణాళికలో భాగమని యేసు చెప్తు, హెచ్చరించాడు (మత్తయి 26:24).
➤ కానీ, దైవ సార్వభౌమత్వం మనుష్యుల బాధ్యతను తొలగించదు. ఈ విధానంలో యూదా దేవుని ఆదేశాలను, హెచ్చరికలను లెక్కచేయకుండా క్రీస్తును అప్పగించాలనే ముందుకు సాగాడు.
➤ ఒకవేళ దేవుని మాట విని, జాగ్రత్తపడి ఉంటే, క్షమాపణ అనుగ్రహించబడేదేమో.
అన్వయం: దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి, కానీ మన ఎంపికలకు మనమే జవాబుదారులం (అపొ.కా 2:23). ఆయన కృపలో నమ్మకంతో జీవించండి (సామెత 3:5–6).
ముగింపు
యూదా జీవితం మనకు ఒక హెచ్చరిక: పాపం మెల్లగా ప్రారంభమై, విధ్వంసంతో ముగుస్తుంది. కానీ, అలాంటి వారికి కూడా క్రీస్తు సిలువ మరణంలో దేవుని విలువైన కృప ఉచితంగా అనుగ్రహించబడుతుంది. యూదా వలె కాకుండా, పేతురు గమనిస్తే త్రోవతప్పిన కూడా, క్రీస్తు అతన్ని పునరుద్ధరించాడు. క్రీస్తు రక్తం అన్ని పాపాలను కడిగివేస్తుంది, చివరకు ద్రోహాన్ని కూడా, కానీ పశ్చాత్తాపపడేవారికి మాత్రమే (1 యోహాను 1:9). నేడు, మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ధనాపేక్ష, దురాలోచనలు, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నారా?
