యేసు క్రీస్తు సిలువ మరణం క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఈ ఘటనలో దేవుని ప్రేమ, జ్ఞానం, న్యాయం అన్నీ తేటగా కనిపిస్తాయి. అయితే యేసు సిలువ మరణం మానవుల పాపము కొరకైన బలి అని స్పష్టమవుతున్నప్పటికీ, లేఖనములు, వేదాంతశాస్త్రము ఈ కీలకమైన సంఘటన వెనుక గల అధ్బుతమైన కారణాలను బయలుపరుస్తాయి.
1. మన పాపాలకై శిక్ష పొందడానికి
మనలను పాపాల నుండి విడిపించడానికి యేసు తనను తాను బలిగా అర్పించుకొని, మనకు బదులుగా శిక్షను అనుభవించాడు. "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).
2. ప్రవచనాలను నెరవేర్చడానికి
క్రీస్తు మరణము యాదృచ్ఛికం కాదు గాని దైవిక ప్రవచనాల నెరవేర్పు. అనాధికాలంగా చెప్పబడిన ప్రవచనాలను సిలువ మరణం నిజం చేసింది. కీర్తన 22లో సైనికులు బట్టలు పంచుకోవడం, యెషయా 53లో నిర్దోషుడైన సేవకుని బలి – ఇవన్నీ యేసులో పరిపూర్ణమయ్యాయి (లూకా 24:44). ఈ ప్రవచనాల నెరవేర్పు ద్వారా యేసే మెస్సీయ అని రుజువవుతుంది.
3. దేవుని ప్రేమను చూపించడానికి
"దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే తన ఏకైక కుమారుడిని మన కోసం అనుగ్రహించాడు" (యోహాను 3:16). సిలువపై యేసు చేసిన త్యాగం దేవుని ప్రేమను కనుపరిచింది. మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మరణించడం గమనిస్తే, ఆయన ప్రేమ అపారమైనదని నిర్థారించబడుతుంది(రోమా 5:8).
4. మరణం మీద విజయాన్ని పొందడానికి
యేసు సిలువలో మరణించడం ద్వారా పాపం, మరణం శక్తిని నాశనం చేశాడు. "ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?" (1 కొరింథీ 15:55). యేసు మరణించడం మాత్రమే కాకుండా ఆయన పునరుత్థానుడై మనకు శాశ్వత జీవాన్ని అనుగ్రహించాడు. ఇక ఆయనలో విశ్వాసులకు మరణం ఒక ఓడిపోయిన శత్రువు.
5. దేవునితో సమాధనపరచడానికి
పాపం వల్ల మనం దేవునికి దూరమయ్యాము. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాము. కానీ యేసు రక్తం ద్వారా ఆయన "మనల్ని దేవునితో సమాధానపరిచాడు" (2 కొరింథీ 5:18). ఇప్పుడు మనం ఆయనను "అబ్బా, నాన్న" అని పిలువడానికి అవకాశం అనుగ్రహించబడింది (గలతీ 4:6). క్రీస్తులో ఉన్నవారు దేవునికి సన్నిహితులు.
6. సాతాను శక్తిని నాశనం చేయడానికి
మానవ పాపం ద్వారా ఈ లోక అధికారం సాతను సొంతమయ్యింది. అయితే సిలువ మీద యేసు "ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను" (కొల 2:15). ఇది సాతాను పరాజయానికి ముద్ర. ఇప్పుడు క్రీస్తులో ఉన్న విశ్వాసులకు సాతాను దురాత్మల అధికారంలో నుండి విడుదల లభించింది (యాకోబు 4:7).
7. కొత్త నిబంధనను ప్రారంభించడానికి
యిర్మియా 31:31లో వాగ్దానం చేసిన "కొత్త నిబంధన"ను యేసు ఆయన రక్తం ద్వారా ప్రారంభించాడు. "ఈ గిన్నె ... నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన" (లూకా 22:20). ఇది శాశ్వతమైన క్షమాపణ ఒప్పందం (హెబ్రీయులు 9:15). పాత నిబంధనలోని బలులు తాత్కాలిక శుద్దిని కలిగించేవి. అయితే యేసు సిలువలో ఆయన రక్తము ద్వారా శాశ్వతమైన పాప శుద్ది చేశాడు, దేవునితో ప్రత్యక్ష సహవాసాన్ని అనుగ్రహించాడు (హెబ్రీ. 9:15).
8. విధేయతను నేర్పించడానికి
యేసు " సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను" (ఫిలిప్పీ 2:8). ఆదాము అవిధేయత వలన మనకు మరణం వస్తే, యేసు విధేయత ద్వారా మనకు జీవం అనుగ్రహించబడింది (రోమా 5:19). దేవుని పట్ల విధేయులుగా జీవించాలని దీని ద్వారా బోధించబడుతున్నాం.
9. దేవుని స్వభావాన్ని చూపించడానికి
యేసు సిలువ మరణం దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. సిలువ దేవుని న్యాయం (పాపాన్ని శిక్షించడం) మరియు కృప (పాపులను రక్షించడం) రెండింటినీ తేటగా చూపుతుంది. "దేవుడు ప్రేమ; ఆ ప్రేమ మన మధ్యకు యేసు రూపంలో వచ్చింది" (1 యోహాను 4:9). ఇది మానవ హృదయాన్ని మార్చే సత్యం.
10. నిత్యజీవానికి హామీ ఇవ్వడానికి
యేసు మరణ-పునరుత్థానం విశ్వాసులకు నిత్యజీవం అనుగ్రహించబడిందనే హామీ ఇస్తుంది. "క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడు. అలాగే విశ్వాసులు కూడా లేపబడతారు" (1 కొరింథీ 15:20-22). "మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను." (1 పేతురు 1:4).