ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో దేవునితో కలిగి ఉండే సంబంధానికి ప్రాణం లాంటిది. ఇది కేవలం పదాలను జపించడం లాంటిద కాదు గానీ దీనత్వంతో, విశ్వాసంతో, సమర్పణ కలిగి మన సృష్టికర్తతో చేసే సంభాషణ. అటువంటి విలువైన ప్రార్థనను వాక్యానుసారంగా చేస్తూ, మన ప్రార్థనా జీవితాన్ని ఎలా బలపరచుకోవాలో తెలుసుకుందాం.
1. క్రమం తప్పకుండా ప్రార్థించండి
దేవుడు నిజాయితీనీ, యథార్థతను ఆదరిస్తాడు, ప్రదర్శనను కాదు. ఏదేమైనా సరే నియమం తప్పకుండా ప్రతీరోజు ప్రార్థన చేయడానికి ప్రత్యేక సమయాన్ని (ఉదయమైన/సాయంత్రమైన) నిర్ణయించుకోండి. బైబిల్లో దానియేలు చేసిన మాదిరిగా, ఎన్ని అడ్డంకులు ఉన్నా రోజుకు మూడుసార్లు ప్రార్థించే నిబద్ధతను అలవరచుకోండి (అంతకంటే ఎక్కువ కూడా) (దానియేలు 6:10). ఇలా చేయడం వల్ల దేవునితో మీరు సన్నిహితమైన సంబంధాన్ని అనుభవించగలరు.
2. ప్రార్థనకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచుకోండి
మనం ఏ చోట నుండైన ప్రార్థించవచ్చు. అయినప్పటికీ మీ ప్రార్థనకు ఎలాంటి ఆటంకాలు రాకుండ ఉండటానికి మీ ఇంట్లోనో, గదిలోనో లేదా మీకు అనుకూలమైన దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలాన్ని ఏర్పరచుకోండి. ఇలా ఒక నిమ్మలమైన, శాంతమైన ప్రదేశాన్ని నిర్ణయించుకోవడం ద్వారా మీ మనస్సును దేవుని సన్నిధిలో కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. యేసు తరచుగా ఒంటరిగా ప్రార్థించడానికి విడిగా వెళ్లేవాడు (లూకా 5:16).
3. వాక్యాన్ని అనుసరించి ప్రార్థించండి
దేవుని వాక్యం జీవం గలది, శక్తి కలది (హెబ్రీయులు 4:12). ఆయన వాక్యంలో బోధించిన రీతిగా ప్రార్థించడానికి వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అనుసరించి ప్రార్థించండి. ప్రార్థించడానికి పదాలు దొరకనప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి స్తుతించండి, మీ విన్నపాలను కూడా తెలియజేయండి. వాక్యానికి వ్యతిరేకంగా విచ్చలవిడి కోరికలు కోరకుండా, దేవుని హృదయానికి, మీ క్షేమాభివృద్దికి అనుకూలమైన విధంగా ప్రార్థించండి.
4. యేసు నామంలో ఉన్న శక్తిని అంగీకరించండి
"యేసు నామంలో” ప్రార్థించడం (యోహాను 14:13-14) ఒక సంప్రదాయం కాదు గానీ ఇది ఆయన అధికారంపై ఆధారపడటం. దేవుని సన్నిధిని చేరుకోవాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఇది గుర్తుచేస్తుంది (1 తిమోతి 2:5). యేసు క్రీస్తు సార్వభౌమాధికారనికి తలవంచి, ఆయన నామమున, పరిశుద్ధాత్మలో, తండ్రిని వేడుకోవడం ఎంతైనా శ్రేయస్కరం.
5. వినే హృదయాన్ని పెంపొందించుకోండి
ప్రార్థనచేయడం అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనేది ఇరువైపుల సంభాషణ. అందుకే దేవుడి ఏం మాట్లాడుతాడో వినడానికి సిద్ధపడాలి. సమూయేలు నేర్చుకున్నట్లు, "నీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను" (1 సమూయేలు 3:10). ప్రార్థనచేయడం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మౌన ధ్యాన సమయాన్ని పాటిస్తూ, దేవా! నాతో మాట్లాడు అని అడగండి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతాడు.
6. సంఘముతో కలిసి ప్రార్థించండి
ఆదిమ సంఘం “ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి” (అపో.కా 2:42). ఒక చిన్న సమూహం లేదా ప్రార్థన సహచరులతో మీ భారాలు, విజయాలు పంచుకోని, కలిసి ప్రార్థించండి. సామూహికంగా చేసే ప్రార్థన ఐక్యతను పెంచుతుంది. “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను” (మత్తయి 18:20).
7. విశ్వాసంతో ఓర్పుగా ఉండండి
లూకా 18:1వ వచనం నుండి “విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు” యేసు చెప్పిన ఉపమానం ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. దేవుని దగ్గర నుండి రావలసిన సమాధానాలు ఆలస్యమైనా, దేవుడు మీ పనే చేస్తున్నాడని నమ్మండి (యెషయా 64:4). *“నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును” (యాకోబు 5:16) .
.webp)