ప్రేమ అనేది బైబిల్లో అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఈ ప్రేమ కేవలం ఒక భావోద్వేగమో లేదా తాత్కాలిక అనుభూతో కాదు, ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే ఒక గాఢమైన, త్యాగపూరితమైన, మార్పు తీసుకువచ్చే శక్తిగలది. బైబిల్లో ప్రేమ అనేది దేవుడు మానవాళితో కలిగి ఉన్న సంబంధానికి పునాది మరియు మనుషులు ఒకరితో ఒకరు కలిగి ఉండాల్సిన సంబంధాన్ని వివరించే నియమావళి. ఈ ప్రేమకున్న నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే దేవుని స్వభావాన్ని తెలుసుకోవాలి.
స్వయంగా, దేవుడే ప్రేమ
1 యోహాను 4:8లో "దేవుడు ప్రేమాస్వరూపి" అని బైబిల్ బహిరంగంగా ప్రకటిస్తుంది. ఈ గంభీరమైన ప్రకటన ప్రేమ అనేది దేవుడు చేసే ఒక పని మాత్రమే కాదు గానీ అది ఆయనే స్వయంగా ప్రేమైయున్నాడని తెలియజేస్తుంది. ప్రేమ దేవుని స్వభావానికి అంతర్లీనమై ఉంది. సృష్టి ఆరంభం నుండి క్రీస్తు మరణం ద్వారా అనుగ్రహించిన విమోచన వరకు, దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.
యోహాను 3:16లో, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" అని చదువుతాం. అయితే ఈ వాక్యం దైవ ప్రేమ గురించిన సారాన్ని సంగ్రహిస్తుంది: ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, నిత్యమైనది, నిస్వార్థమైనది, షరతులేనిది ముఖ్యంగా జీవాన్ని అనుగ్రహించేది.
4 రకాల ప్రేమ | 4 Types of Love
ప్రేమ గురించి బైబిల్ వివిధ గ్రీకు పదాలతో వివరిస్తుంది. ప్రతి పదం కూడా ప్రేమకు సంబంధించి వేర్వేరు కోణాలను తెలియజేస్తుంది.
1. ఆగాపే (Agape): ఇది అత్యున్నతమైన ప్రేమ, దీన్ని దైవ ప్రేమ లేదా షరతులేని ప్రేమ అని చెప్పవచ్చు. ఇది నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది అలాగే మార్పులేనిది. ఇది దేవుడు మనకు చూపించే ప్రేమ మరియు మనం ఇతరులకు చూపించాల్సిన ప్రేమ. రోమా 5:8లో, "దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను" అనేది దేవుని అగాపే ప్రేమను వివరిస్తుంది.
2. ఫిలియో (Phileo): ఇది స్నేహం లేదా ఆప్యాయతపూరిత ప్రేమ. స్నేహితుల మధ్య లోతైన బంధాన్ని సూచిస్తుంది. యేసు యోహాను 15:13-15లో తన శిష్యులతో "మీరు నా స్నేహితులైయుందురు" అని చెప్పినప్పుడు ఈ ఫిలియో పదాన్ని ఉపయోగించాడు.
3. స్టోర్గే (Storge): ఇది కుటుంబ ప్రేమ. తల్లిదండ్రులు-పిల్లలు, సహోదరులు మధ్య ఉండే సహజమైన ఆప్యాయత. నోవహు మరియు అతని కుటుంబం కథలో ఇది కనిపిస్తుంది (ఆదికాండం 6-9).
4. ఎరోస్ (Eros): రొమాంటిక్ లేదా ఉత్సాహభరితమైన ప్రేమ. ఈ పదం క్రొత్త నిబంధనలో కనిపించదు, కానీ సొలోమోను రచించిన పరమగీతములలో వివాహ సందర్భంలో ఈ ప్రేమను గురించి చూడగలం.
ప్రేమ యొక్క లక్షణాలు | Characteristics of Love
1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో అనేది స్పష్టంగా వివరిస్తుంది. "ప్రేమ దీర్ఘశాంతముగలది, ప్రేమ దయగలది...etc" అని పౌలు వ్రాస్తూ, ఆగపే ప్రేమను గురించి వివరిస్తున్నాడు. ఆ ప్రేమ లక్షణాలు:
1. ప్రేమ త్యాగపూరితమైనది: ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. "తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు" (యోహాను 15:13).
2. ప్రేమ షరతులేనిది: ప్రేమలో ఎలాంటి షరతులు ఉండవు. షరతులు ఉంటే అది వ్యాపారమవుతుంది. దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. ఆయన మన పాపాలను ఉపేక్షించి ప్రేమిస్తాడు (రోమా 5:8).
3. ప్రేమ యథార్థమైనది: నిజమైన ప్రేమ యథార్థ కలిగి సత్యంలో సంతోషిస్తుంది (1 కొరి 13:6). మోసం చేయదు, పాపంతో ఎంత మాత్రమూ రాజీపడదు.
4. ప్రేమ సహిస్తుంది: ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. అది బాధైనా, కష్టమైనా, నష్టమైనా, హింసైనా అది ఏదైనా సరే సర్వమును సహిస్తుంది (1 కొరి 13:7).
5. ప్రేమ తగ్గించుకుంటుంది: ప్రేమ అహంకారం చూపించదు, తగ్గించుకొని ఉంటుంది (ఫిలి 2:5-8).
6. ప్రేమ క్షమిస్తుంది: ప్రేమిస్తే ఎలాంటి తప్పులనైనా క్షమించాలి. అదే నిజమైన ప్రేమ. ప్రేమ తప్పులను లెక్కపెట్టదు (కొల 3:13).
7. ప్రేమ శాశ్వతమైనది: కొంతకాలమే ఉంటే అది ప్రేమ కాదు వ్యామోహం. ఒకసారి ప్రేమించడం ఆరంభిస్తే జీవితాంతం వరకు ప్రేమించాలి. "ఆయన వారిని అంతము వరకు ప్రేమించెను" (యోహాను 13:1).
ప్రేమకు అత్యుత్తమ ఉదాహరణ: యేసు క్రీస్తు
యేసుక్రీస్తు ప్రభువు జీవితం, మరణం, పునరుత్థానం ఆగాపే ప్రేమను పూర్తిగా వివరిస్తాయి. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు (యోహాను 15:13). మనలో ఉన్న పాప లోపాలను పట్టించుకోకుండా, మనం ఆయన్ని మోసగిస్తామని, ఆయన్ని బాధిస్తాం అని తెలిసిన కూడా మనలను విమోచించడానికి తన రక్తాన్ని చిందించాడు. యేసు సిలువపై చేసిన త్యాగం మనల్ని పాప శిక్ష నుండి, మరణం నుండి రక్షించింది. ఆయన ప్రేమ అమూల్యమైనది, నిస్వార్థమైనది, శాశ్వతమైనది. ప్రేమ దేవునితోనే ప్రారంభమవుతుంది. "ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము" (1 యోహాను 4:19).
క్రైస్తవుని గుర్తు: ప్రేమ
యేసు చెప్పినట్లుగా, "మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను" (యోహాను 13:35). ప్రేమ అనేది క్రీస్తు అనుచరులకు ప్రత్యేకమైన గుర్తు/గుర్తింపు. 1 యోహాను 3:18లో "మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము" అని హెచ్చరించబడింది.
యేసుక్రీస్తును "అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏది?" అని అడిగినప్పుడు, యేసు ఇలా సమాధానమిచ్చాడు: "అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే" (మత్తయి 22:37-39). ఇక్కడ యేసు సంపూర్ణ ధర్మశాస్త్రమంతటిని ప్రేమ అనే పదంలో సంగ్రహించాడు. కాబట్టి దేవునిని ప్రేమించడాన్ని, పొరుగువారిని ప్రేమించడాన్ని వేరు చేయలేం. దేవునిపై ప్రేమ ఒక వృక్షానికి ఉండే వేరు లాంటిది (అది భూమిలోపల ఉన్నా కానీ అత్యవసరమైనది). పొరుగువారిపై ప్రేమ ఆ వృక్షానికి ఉండే కొమ్మలు లాంటిది (బయటకు కనిపించాల్సినది). రెండూ కూడా ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవసరం.
ముగింపు
బైబిల్లో ప్రేమ ఒక భావం కాదు, అది దేవుని స్వభావం మరియు మన సంబంధాలకు పునాది. ఈ ప్రేమ దేవుడే. దేవుని ప్రేమ మన యోగ్యత లేదా పనితీరుపై ఆధారపడి ఉండదు; ఇది ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానం. ఈ ప్రేమ త్యాగపూరితమైనదిగా, షరతులేనిదిగా అలాగే శాశ్వతంగా ఉండాలి. పరిపూర్ణ ప్రేమతో దేవునినీ, పొరుగువారిని ప్రేమించడం ద్వారా, మనం దేవుని ప్రేమను ప్రపంచానికి ప్రతిబింబిస్తాము. పౌలు చెప్పినట్లుగా, "విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే" (1 కొరి 13:13), ఎందుకంటే దేవునికి మనపై ప్రేమ నిత్యత్వంలో కూడా ఉంటుంది. అలాంటి ఈ ప్రేమను మన జీవితాల్లో ప్రదర్శించడం ద్వారా, మనం దేవుని మహిమకు సాక్షులుగా ఉండగలం.
