ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతూ, చదవబడుతున్న పుస్తకం, బైబిల్. ఎందుకంటే ఇది దేవుని వాక్యం – స్వయంగా ఆయన మాటలు. బైబిల్ మొదటి పేజీలోనే ఇది "దేవుని ఆటోబయోగ్రఫీ" అన్నట్టుగా “ఆదియందు దేవుడు” అనే మాటతో ప్రారంభమవుతూ, దేవుడు తనను తాను మానవాళికి ప్రత్యక్షంగా పరిచయం చేసుకోవడం చూస్తాం.
మరి దేవుని వాక్యం చదవడం వల్ల మన జీవితాల్లో వచ్చే మార్పు, మన జీవితాలకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
1. దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది
బైబిల్ సందేశం ప్రకారం, దేవుని వాక్యమే మానవాళికి రక్షణ, విమోచన మరియు నిత్యజీవానికి ఏకైక ఆధారం. యేసు క్రీస్తు బోధలు, పాప క్షమాపణ, నిరీక్షణ వంటి పరమసత్యాలను అర్థం చేసుకోవడానికి బైబిల్ తప్ప మరో మార్గం లేదు. ఈ లోకంలో దేవుని విమోచన ప్రణాళికను ప్రకటించేది బైబిల్ మాత్రమే. ఇది లేకుంటే, మానవుడు ఆధ్యాత్మిక అంధకారంలో నిరాశతో జీవితాన్ని ముగిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా మన హృదయాలను పరిశుద్ధపరుస్తాడు, పాపాన్ని బహిర్గతం చేస్తాడు మరియు నైతిక జీవనానికి మార్గదర్శకమవుతాడు (కీర్తన 19:7). క్రీస్తుని అనుసరించే శిష్యులుగా బ్రతకాలంటే, బైబిల్ నిత్యావసరం.
2. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది
దేవుని వాక్యం కేవలం చారిత్రక సంఘటనలను గురించి మాత్రమే కాక, ఆత్మను కదిలించే జ్ఞానాన్ని ఇస్తుంది (కీర్తన 19:7). క్రీస్తు స్వరూపంలోనికి మారేందుకు లోతైన ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తుంది. హృదయానికి సంబంధించినటువంటి ఆలోచనలను సరిచేస్తూ సత్క్రియలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఎవరైనా కూడా దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా విని కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉండలేరు. దేవుని వాక్య బోధన మనలను అనుదినం దేవుని పోలికలోనికి మారుస్తుంది.
3. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది
పాపపు స్వభావం కలిగిన మనిషి బలహీనుడు కనుక దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటాడు. అనేక సంఘటనల్లో మనిషి దేవునికి విరుద్ధంగా చేసిన క్రియల వలన పొందినటువంటి పర్యవసానాన్ని గురించి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. మనం చేయవలసినవి, చేయకూడనివి బైబిల్ స్పష్టంగా వివరిస్తుంది. దానికి గల కారణం ఏమిటంటే, దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన హెచ్చరికలను బైబిల్లో పొందుపరిచాడు. ఆయన హెచ్చరిస్తూనే ప్రోత్సహిస్తాడు.
4. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది
స్వేచ్ఛకు హద్దులు లేకపోతే, అది విధ్వంసానికి దారి తీస్తుంది. అందుకే దేవుడు మానవ జీవనానికి కొన్ని నియమ-నిబంధనలను ఇచ్చాడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టులుగా ఉండి, సురక్షితంగా జీవించడానికి సీనాయి పర్వతం మీద వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ పాపపు లోకంలో మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ, కాపాడుతున్నాడు. నేడు, దేవుని వాక్యం మన హృదయాల్లో "ఆధ్యాత్మిక కవచం"గా పనిచేస్తుంది. అది లేకుంటే, జీవితపు అంధకార లోయలలో మనం తెలియకుండా తప్పుదారి పట్టిపోతాం. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే ఏ అపాయమైన ఆశీర్వాదమే.
5. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది
దేవుని వాక్యం మన జీవితాలకు నిరీక్షణ కలిగిస్తుంది. క్రీస్తులో ఉన్న నిరీక్షణే మన గొప్ప ఆధారం. మరణం తర్వాత జీవితం ఉంటుందనే నిరీక్షణ క్రీస్తు నందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరలోకమందున్న దేవుని చేరుకొని ఆయనతోపాటు నిత్యత్వంలో ఉంటామనే నిరీక్షణ ఎంతో గొప్పది. ఈ లోక కష్టాలు, అన్యాయాలు ఎంత ఘోరంగా ఉన్నా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు. బైబిల్ ఈ నిరీక్షణను ప్రతి పేజీలో ప్రతిధ్వనిస్తుంది.
ముగింపు
దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన విలువైన సంపద బైబిల్ గ్రంధం. ఆ వాక్యం మన జీవితాలను, మన పరిస్థితులను మార్చగలదు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి మరి ముఖ్యంగా ఈ సత్య వాక్యాన్ని విస్తరింపజేయాలి.
MTh