హోలీ కమ్యూనియన్/Holy Communion, లేదా ప్రభుబల్ల/Lord's Table అని పిలవబడే ప్రభురాత్రి భోజనం క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పవిత్ర ఆచారం. కానీ చాలా మంది క్రైస్తవులకు దీనిని ఎందుకూ, ఎలా ఆచారించాలో తెలియదు. ఈ ప్రభురాత్రి భోజనంలో పాలుపంచుకొనే సరైన విధానాన్ని తెలుసుకోవడానికి దాని ఉద్దేశమును, చరిత్రను, వివిధ అభిప్రాయాలను బైబిల్ ఆధారం చేసుకొని పరిశీలించడం అవసరం.
ప్రభురాత్రి భోజన ఉద్దేశం | The Purpose of Lord's Table
సువార్తలలో వ్రాయబడినట్లుగా, ప్రభురాత్రి భోజనం అనేది యేసు సిలువ మరణానికి అప్పగించబడబోవు రాత్రి తన శిష్యులతో కలిసి చివరిగా భోజనము చేస్తున్నప్పుడు జరిగించిన కార్యం (మత్తయి 26:26-29, మార్కు 14:22-25, లూకా 22:14-20). భోజన సమయంలో, యేసు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని, వాటిని ఆశీర్వదించి, వాటిని ఆయన శరీరము మరియు రక్తానికి గుర్తుగా తన శిష్యులకు అందించి, "నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి" అని ఆజ్ఞాపించాడు (లూకా 22:19). కావున, ప్రభురాత్రి భోజన ప్రాధమిక ఉద్దేశం ఏమిటంటే:1. యేసుక్రీస్తు సిలువలో చేసిన బలియాగాన్ని, ఆయన విరిగిన శరీరమును, మన పాప క్షమాపణ కొరకు ఆయన చిందించిన రక్తమును జ్ఞాపకము చేసుకోవడం (1 కొరింథీ 11:24-25)
2. ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రకటిస్తూ, ఆయన రాకడకై ఎదురుచూడటం (1 కొరింథీ 11:26).
2. ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రకటిస్తూ, ఆయన రాకడకై ఎదురుచూడటం (1 కొరింథీ 11:26).
3. మన వ్యక్తిగత జీవితాలను మనమే స్వయంగా పరీక్షించికోవడం (1 కొరింథీ 11:27-28).
ప్రభురాత్రి భోజనములో పాలుపొందడం అంటే క్రీస్తు మరణము వైపు తిరిగి చూచి, ఆయనను జ్ఞాపకంచేసుకోవడం మాత్రమే కాదు గానీ ఆయన రెండవ రాకడ కొరకు కూడా ఎదురుచూడడం.
ప్రభురాత్రి భోజనం గురించిన వివిధ అభిప్రాయాలు | Different Views on Lord's Table
ప్రభురాత్రి భోజనం గురించి క్రైస్తవ చరిత్రలో వివిధ అభిప్రాయాలు, వాధనలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా, రొట్టె మరియు ద్రాక్షారసంలో ప్రభువు సన్నిధి ఉందా లేదా అనే చర్చలు క్రైస్తవ శాఖలలో విభిన్న దృక్పథాలకు దారితీశాయి.
1. రూపాంతరీకరణం/ట్రాన్సాబ్స్టాన్సియేషన్ (Transubstantiation), అంటే ప్రభురాత్రి భోజన సమయంలో రొట్టె మరియు ద్రాక్షారసం నిజమైన క్రీస్తు శరీరంగా, రక్తంగా రూపాంతరం చెందుతాయి.
2. సమ-స్వరూపత్వం/కాన్సాబ్స్టాన్సియేషన్ (Consubstantiation), అంటే రొట్టె మరియు ద్రాక్షారసం క్రీస్తు శరీర రక్తాలుగా మారకపోయినప్పటికీ క్రీస్తు "వాటితో, వాటి మధ్య" ఉంటాడు.
3. ఆత్మీయ సన్నిధి/Spiritual Presence, అంటే రొట్టె మరియు ద్రాక్షారసం క్రీస్తు శరీర రక్తముగా మారవు కానీ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు క్రీస్తు సన్నిధి ఆత్మీయంగా ఉండుంది.
4. జ్ఞాపకార్ధం/Memorial, అంటే ప్రభురాత్రి భోజనంలోని రొట్టె మరియు ద్రాక్షారసం క్రీస్తు శరీర రక్తానికి సాదృశ్యాలు లేదా చిహ్నాలుగా ఉంటాయి. దీనిలో పాల్గొనేవారు క్రీస్తు సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆరాధన భావంతో, కృతజ్ఞతా పూర్వకంగా నిర్వహించాలి. ఇది బైబిల్ బోధకు అనుగుణంగా ఉంటుంది.
ఈ అభిప్రాయాల గురించి మరింత వివరణ కొరకు:
బైబిల్ బోధ
బైబిల్లో బోధించబడిన ప్రకారం, ప్రభురాత్రి భోజనం క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొనడానికి జరిగించే కార్యం. అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ 11:23-29లో యోగ్యమైన రీతిలో పాలుపొందమని చెబుతాడు. ఎందుకంటే, ఒకవేళ మనము అయోగ్యముగా పాల్గొంటే అపరాదులమై దేవుని శిక్షకు గురౌతాము. అందుకే స్వీయ పరిశీలన చేసుకొని వినయంతో ప్రభుబల్లలో పాలుపొందాలి.
ప్రభుబల్లలో పాలుపొందడం అనేది మనకు దేవుని కృపను మరియు క్షమాపణను జ్ఞాపకం చేస్తుంది. సంఘంగా కూడుకొని పాలుపొందడానికి సిద్ధపడటంలో సంఘ సమైక్యత మెరుగుపడుతుంది. అపోస్తులుడైన పౌలు సంఘ ఐక్యతను గురించి 1 కొరింథీ 10:17లో ఇలా అంటాడు: "మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము."
ముగింపు
ప్రభురాత్రి భోజనంలో పాలుపంచుకోవడం కేవలం ఆచారమే కాదు గానీ యేసు త్యాగానికి గుర్తుగా, ఆయనతో మరియు తోటి విశ్వాసులతో ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించడానికి జరిగించే ఆత్మీయ కార్యం. దీనిని బైబిల్లో బోధించిన విధంగా ఆచరించడం వలన క్రీస్తు రాజ్యంలో ఆయనతో కలసి బల్లలో పాలుపంచుకునే రోజు కొరకు సిద్ధపాటు కలిగుంటాం.
