గమనిక: ఈ ప్రసంగం వాక్యాన్ని బోధించడానికి ఒక ఆలోచన మాత్రమే, దీనిని పూర్తి ప్రసంగంగా భావించకండి. దేవుడు మిమ్మల్ని నడిపించిన రీతిలో, ఈ సందేశాన్ని మీకు వీలైన విధంగా మెరుగుపరచుకొని, దేవుని వాక్య సత్యాన్ని నమ్మకంతో బోధించడానికి సిద్ధపడండి.
"యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమి."
పరిచయం
యేసు క్రీస్తు జననం చరిత్ర సంఘటనలలోనే అపూర్వమైనది. ఇది మానవరక్షణ కోసం దేవుని ప్రణాళికను వెల్లడిస్తుంది. అయితే, ఈ సంఘటనలో తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు జన్మస్థలాన్ని తెలుసుకొని, ఆయనను ఆరాధించడానికి సుదూర ప్రయాణం చేసి, హేరోదు రాజును అడిగిన ప్రశ్న అందరినీ భయపెట్టింది. మరి ఆ జ్ఞానులు అడిగిన ప్రశ్నలో అంత ప్రమాదమూ, పరమార్థమూ ఏముంది? ఈ సందేశంలో తెలుసుకుందాం!
జ్ఞానులు అడిగిన ప్రశ్న: “యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు” - (మత్తయి 2:2)
ప్రసంగం
1. ఈ ప్రశ్న కలవరపరిచేది
"యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? " (మత్తయి 2:2)
- ఒక్క ప్రశ్నతో రాజు, రాజ్యం మొత్తం కంగుతింది. హేరోదు రాజు ఈ ప్రశ్నను తన రాజ్యానికి ముప్పుగా భావించాడు. ఇది ఆయనను అపోహలకూ, భయానికీ, ఆగ్రహానికీ, హింసకూ దారితీసింది.
- రాజు మాత్రమే కాకుండా యెరూషలేము మొత్తం కలత చెందింది. ఎందుకంటే, క్రీస్తు జననం వారి జీవితాల్లో మార్పులు తీసుకురానుంది.
- ఈ ప్రశ్న కలవరానికి దారితీసింది ఎందుకంటే అది నిజమైన రాజు గురించి అవగాహనను తెచ్చింది.
➤ మన జీవితాల్లో సత్యాన్ని గ్రహించి, క్రీస్తును రాజుగా అంగీకరించాలి. కలవరం చెంది తప్పులు చేయకూడదు.
2. ఈ ప్రశ్న కష్టాన్ని తెలియజేసేది
"తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రం చూచి..." (మత్తయి 2:2)
- నక్షత్రాన్ని అనుసరించారంటే ఖగోళ శాస్త్రం తెలిసినవాళ్లు అయ్యుంటారు. లేఖనాలను, ప్రవచనాలను చాలా ఎక్కువగా పరిశీలించి ఉంటారు (సంఖ్యా 24:17).
- జ్ఞానులకు ఇది సులభమైన ప్రయాణం కాదు. అనేక మైళ్ల దూరంతో పాటు, అనేక అపాయకరమైన మార్గాల గుండా ప్రయాణించి ఉంటారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు తమ ఆరోగ్యం, భద్రతను ప్రమాదంలో పెట్టుకుని ప్రయాణించారు.
- అన్యులైనప్పటికీ రాజులకు రాజైన క్రీస్తును ఆరాధించడానికి ఎంతటి కష్టాన్నైనా సహించారు. అసౌకర్యమైన వాతావరణం, దొంగల ముప్పు, అస్పష్టమైన గమ్యం లాంటి అడ్డంకులను దాటి క్రీస్తును చేరుకున్నారు.
3. ఈ ప్రశ్న కారణార్థమైనది
"ఆయనను పూజింప వచ్చితిమి..." - (మత్తయి 2:2)
- నిజమైన రాజును, మనసారా పూజించాలి అనే కారణంతో వచ్చారు. నిజమైన రాజు కోసం శోధించారు (కీర్తన 29:2).
- వారు ఎవరిని పూజించాలి అనే ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నారు: అది రాజైన క్రీస్తును మాత్రమే.
- వారి కానుకలు కూడా విలువైనవి అలాగే అర్థవంతమైనవి. దూర ప్రయాణమైన కూడా ఉన్నతమైన కానుకలను జాగ్రత్తగా తెచ్చి తమ రాజుకు అర్పించారు (మత్తయి 2:11).
4. ఈ ప్రశ్న కనువిప్పు కలిగించేది
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చి - (మత్తయి 2:4)
- ఇది ప్రధాన యాజకులను, శాస్త్రులను మేల్కొలిపింది. కొంతవరకైనా క్రీస్తు జననం గురించి వారికి జ్ఞాపకం కలిగించింది.
- కానీ వారికి కేవలం గ్రంథ జ్ఞానం మాత్రమే ఉంది కానీ వారికి నిజమైన రాజును ఆరాధించాలనే కోరిక కలిగి క్రీస్తును వెతికనట్టు మనకు బైబిల్లో సమాచారం లేదు (యాకోబు 1:22).
- బహుశా క్రీస్తు గురించి తెలిసినప్పటికీ, హేరోదుకు భయపడో లేదా వారికీ అశక్తిలేకనో దేవుని దగ్గరకు రాలేదు.
ముగింపు
- జ్ఞానులు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నారు: యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు నీ క్రిస్మస్ లో ఎక్కడ? క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడానికా లేకా నీ, నా ఆడంబరాలకా? సమాధానం ఇవ్వు
- మనకు జ్ఞానులలాగే యేసును మనసారా వెతికి, ఆయననుఆరాధించాలనే ఆకాంక్ష ఉందా?
- పండుగా, పాటలు, ఆటలు, ఆడంబరాలు, విందులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ క్రిస్మస్ రాజైన క్రీస్తు ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ?