బైబిల్ అంటే ఏంటి?
'బైబిల్' అనే పదం గ్రీకు పదమైన 'బిబ్లియన్' (biblion) నుండి ఉద్భవించింది, దీనికి 'పుస్తకం, గ్రంథం' అని అర్థం. బైబిల్ 66 పుస్తకాలు సమూహంగా ఉన్న ఒకే-పుస్తకం. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే రెండు నిబంధనలుగా విభజించబడి, పాత నిబంధనలో ప్రధానంగా సృష్టి మరియు మానవుని ఆరంభం, ఇశ్రాయేలీయుల చరిత్ర, ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రవచనాల గురించి వివరిస్తూ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితం, ఆయన బోధలు మరియు అపొస్తలుల బోధలు లిఖించబడ్డాయి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం కాలక్రమేణ ప్రపంచమంతటా అనేకులకు మార్గాన్ని చూపుతూ, పాపపు జీవితం నుండి పరిశుద్ధ జీవితం వైపు నడిపిస్తూ ఉంది.
బైబిల్ విశిష్టత
1. పుస్తకాల సమకూర్పు
ఒకే గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉండటం విశేషం. వాటిలో పాత నిబంధనగా 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనగా 27 పుస్తకాలు సమకూర్చబడ్డాయి. పాత నిబంధనలోనేమో మానవాళి రక్షణకై దేవుని ప్రణాళికను గురించి ఉంటే, క్రొత్త నిబంధనలో ఆ రక్షణకై యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని చూస్తాం.
2. భాష మరియు రచన కాలం
బైబిల్ ప్రధానంగా హెబ్రీ, అరామిక్ మరియు గ్రీకు భాషల్లో రాయబడింది. బైబిల్ గ్రంథ రచయితలు దాదాపు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ గ్రంథాన్ని రచించారు. అయినప్పటికీ ప్రస్తుత కాలంలో కూడా సమస్త మానవాళికి అర్థమయ్యేలా అందుబాటులో ఉండటం విశేషం. ఈ ఘనత ప్రపంచాలో ఏ గ్రంథానికి లేదు.
3. రచయితలు, వారి నేపథ్యం
బైబిల్ గ్రంథాన్ని రచించడంలో దాదాపుగా 40 మంది రచయితలు పాత్ర ఉంది. వీరిలో కొందరు రాజులు, ప్రవక్తలు, జాలరులు, అపోస్తలులు, వైద్యులు వంటి వేర్వేరు వృత్తులకు చెందినవారు ఉన్నారు. అంతమాత్రమే కాకుండా ఈ గ్రంథకర్తలు వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు కాలాలకు చెందినవారు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారి రచనలలో గానీ, సందేశంలో గానీ ఒకదానికొకటి ఎటువంటి విభేదాలు, పొరపాటులు లేకుండా ప్రశంశనీయంగానే ఉంది.
4. స్థిరత్వం మరియు విశ్వాసం
బైబిల్ అనేక భయంకరమైన శక్తులను, పరిస్థితులను ఎదుర్కొని ఇప్పటికీ కూడా స్థిరంగానే ఉంది. ఇది ప్రపంచంలోనే అధికంగా కొనుగోలు చేయబడి, చదవబడే పుస్తకంగా ఉండటమే కాకుండా, అనేక సంవత్సరాలుగా ఎవరూ నాశనం చేయలేని గ్రంథంగా మనుగడలోనే ఉంది.
బైబిల్ మనకెందుకు అవసరం?
బైబిల్ మనలను ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించగల శక్తివంతమైన గ్రంథం. ఎందుకంటే ఇది దేవుని వాక్యమైయున్న జీవగ్రంథం. ఈ బైబిల్ గ్రంథం మనలో మార్పును తెస్తుంది, మన హృదయాలను పరిశుద్ధపరుస్తుంది. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన అనుగ్రహించే నిత్యజీవాన్ని పొందడానికి బైబిల్ చాలా అవసరం. ఎందుకంటే:
- దేవుని ప్రత్యక్షతను ఆయన స్వభావాన్ని తెలుసుకోడానికి బైబిల్ అవసరం - (యోహా.5:39; 1:1-5)
- బైబిల్ గ్రంథం స్వయానా దేవుని వాక్యం - (2 తిమో.3:16-17)
- బైబిల్లో ఎటువంటి పొరపాటులు లేవు - (2 పేతు. 1:20-21)
- బైబిల్ దేవుని మనస్సును, ఆలోచనలను తెలియజేస్తుంది - (లెవీ.26:12)
- మన జీవితం పట్ల దేవుని ఉద్దేశ్యాన్ని తెలుసుకోడానికి బైబిల్ అవసరం - (1 పేతు. 2:9)
- బైబిల్ వాక్యం పాపం చేయకుండ కాపాడుతుంది - (కీర్తన.119:11)
- దేవుని వాక్యం మనలను పవిత్రపరుస్తుంది - (యోహాను:15:3; 17:17; ఎఫె.5:26).
- బైబిల్ నిత్యజీవాన్ని అనుగ్రహించే క్రీస్తును గురించి తెలియజేస్తుంది - (యోహా.17:3).
ముగింపు
బైబిల్ ప్రత్యక్షంగా దేవుని వాక్యం, ఇది మన జీవితాలకు అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్శిని. బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాక, దేవుని మాటలను, సత్యాన్ని మనకు తెలియజేసే జీవ గ్రంథం. దీని ద్వారా మనం దేవుని గుణాలక్షణాలను, మనవాళి పట్ల ఆయన ప్రేమను తెలుసుకోగలం, ఆ దేవుని యందు విశ్వాసముంచి నిత్యజీవం పొందగలం. అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్ విలువను తెలుసుకుని, వాక్యాన్ని అనుసరించి జీవించడం శ్రేయస్కరం.
సృష్టికర్తయిన దేవుడు అనుగ్రహించిన బైబిల్ గ్రంథానికి నీ జీవితంలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది?
