దేవుడు అందరిని స్వస్థపరుస్థాడా? | Does God Heal Everybody?

0


Jesus Healing the Sick
కొంతమంది క్రైస్తవులూ, అలాగే క్రైస్తవేతరులూ, దేవుడు అన్నివేళల్లో, అందరినీ స్వస్థపరచాలని అనుకుంటారు. ముఖ్యంగా విశ్వాసంతో స్వస్థపరుస్తాం (Faith Healers) అనే మరికొందరు, దేవుడు ప్రేమ స్వరూపి గనుక తన పిల్లలు బాధను అనుభవించడం చూడలేడు, అందుకే ప్రతి ఒక్కరినీ స్వస్థపరుస్తాడని వాదిస్తారు. అయితే, ఈ భావన దేవుని వాక్యానికి పూర్తిగా విభిన్నమైనది. బైబిల్లో చెప్పబడిన ప్రకారం, దేవుడు ప్రతిసారీ అందరినీ స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఎవరు స్వస్థత పొందాలో అనేది ఆయన చిత్తం, ఉద్దేశ్యం ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ఈ నేపథ్యంలో, దేవుని చిత్తం, మన బాధలకు సంబంధించిన ఆయన ఉద్దేశ్యం, మరియు బైబిలు ఏమి చెబుతుందనే విషయాలపై మరింత వివరణ తెలుసుకోవడం ఎంతైనా అవసరం.  

1. దేవుడు ఆందరినీ స్వస్థపరచలేదు  

లేఖనాలలో చూస్తే, శ్రమలు అనుభవించడం, స్వస్థత పొందకపోవడం లాంటి వాస్తవ సంఘటనలు చాలా కనిపిస్తాయి. 

పాత నిబంధన ఉదాహరణలు

దేవుడు అందరిని స్వస్థపరచలేదని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఆయన తన చిత్తము ప్రకారం కేవలం కొంతమందిని మాత్రమే స్వస్థపరిచాడు. 
  • రాజైన ఉజ్జియా రోగిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను స్వస్థపరచలేదు. "రాజైన ఉజ్జియా మరణ దినము వరకు కుష్టి రోగియై యుండెను" (2 దిన 26:16-21). 
  • దేవుడు, దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించినట్లు చూస్తాం. ఆ దావీదుకు పుట్టిన బిడ్డను దేవుడు స్వస్థపరచలేదని 2 సమూ 12:1-13 వచనాలు తెలియజేస్తాయి. తన కుమారుడు బ్రతకాలి అని దావీదు దేవునికి ప్రార్థించినప్పటికీ, ఆ శిశువు మరణించాడు. 

క్రొత్త నిబంధన ఉదాహరణలు

కొత్త నిబంధనలో యేసు ప్రభువు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు కానీ ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరిని స్వస్థపరచలేదు. 
  • ఆ రోజుల్లో అనేక మంది కుష్టు రోగులు ఉన్నప్పటికీ యేసు ప్రభువు కేవలం కొందరిని మాత్రమే స్వస్థపరిచాడు. 
  • అనేక మంది మరణించారు కానీ యేసు అందరిని మరణం నుండి లేపలేదు. 
  • బేతెస్ద అనబడిన కోనేరు దగ్గర దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించు సమయంలో, స్వస్థతపొందడానికి అనేకమంది రోగులు గుంపులుగా ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ యేసు ఒక్కడినే స్వస్థపరిచాడు (యోహాను 5:1-9). 
పైన తెలిపిన వాటిని బట్టి, దేవుడు అందరినీ స్వస్థపరచలేదని అర్థమవుతుంది. 

2. స్వస్థపరచడం దేవుని సార్వభౌమ చిత్తము

ఒకరిని స్వస్థపరచడం, స్వస్థపరచకపోవడం అనేది దేవుని చిత్తం. వివిధ కారణాలను బట్టి దేవుడు తన పిల్లల్లో కొంతమందిని జీవితాంతం అనారోగ్యంతో ఉండటానికి అనుమతిస్తాడు. 

పౌలు మరియు తిమోతి యొక్క రోగము

పౌలు, తిమోతి తమ జీవితాల్లో  స్వస్థత పొందలేదు. వారు ప్రార్ధించారా? ఖచ్చితంగా ప్రార్ధించారు. పౌలు, అనారోగ్యం నిమిత్తం మూడుసార్లు ప్రార్ధించాడు (2 కొరంథి 12:1-10), అందుకు దేవుడు నా కృప నీకు చాలును అని చెప్పాడు. 

తిమోతి కడుపుజబ్బు నిమిత్తము ప్రార్థించి ఉంటాడు, కానీ అతడు స్వస్థత పొందలేదు. అందుకే తన కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసము తీసుకోమని పౌలు చెబుతాడు (1 తిమోతి 5:23). ఇలా తిమోతి ఎంతకాలం ఔషధంగా ద్రాక్షరసం తీసుకొని ఉంటాడు, చివరికి అతనికి నయం అయ్యిందా, లేదా, దానిపై ఎవరు కూడా వితండవాదం చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే తిమోతి స్వస్థత గురించి పౌలు తన పత్రికలలో ఎక్కడా కూడా రాయలేదు. కానీ నిశ్చయమైన విషయమేమిటంటే, తిమోతికి ఉన్నా సమస్య సుదీర్ఘమైన అనారోగ్యం అని తెలుస్తుంది. 

త్రోఫిము 

మిలేతు వద్ధ త్రోఫిము అనారోగ్య సమస్యతో ఉండటానికి దేవుడు అనుమతించాడు (2 తిమో 4:30). ఇవన్నీ కూడా, దేవుడు ఆయన పిల్లలను అన్నివేళల్లో స్వస్థపరచడం తన పరిపూర్ణ చిత్తం కాదని నిరూపిస్తాయి, అలాగే దేవుడు ఎల్లప్పుడూ స్వస్థపరచాల్సిన అవసరం కూడా లేదు. రోగిగా ఉన్న వ్యక్తిని నయం చేయాలా వద్దా అనేది ఆయన ఇష్టం. 

3. క్రైస్తవ జీవితంలో శ్రమల పాత్ర

ప్రతీ ఒక్కరూ,  ఎల్లప్పుడూ స్వస్థత పొందుతూ, ఆరోగ్యంతో ఉంటే ఎవ్వరూ కూడా చనిపోకూడదని భావిస్తున్నట్లు. కానీ మానవుడు మరణించకుండా ఉంటాడా? అది అసాధ్యం. అందుకే కొన్నిసార్లు అనారోగ్యం మరణానికి దారితీస్తుంది. 

మనం ఈ లోకంలో అనారోగ్యంతో, దుఃఖంతో, పేదరికంతో, అనేక సమస్యలతో, శోధనలతో శ్రమపడుతాం. కానీ యేసు క్రీస్తులో ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు ఈ శ్రమలన్నిటినీ జయిస్తాం, వ్యాధులను కూడా జయిస్తాం. యేసుక్రీస్తు తన మహిమలో ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు మనకు పరిపూర్ణమైన జీవితం అనుగ్రహింపబడుతుంది. ఆయన మన కన్నీటినంతటిని తుడిచి వేస్తాడు, మరియు మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, బాధయైనను ఇక ఉండవు, అవన్నీ ఆయన రాజ్యంలో నూతనపరచబడుతాయి (ప్రకటన 21:4). అప్పటి వరకూ, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం శ్రమలు అనుభవించాలి. 

4. దేవుడిచ్చే ఆత్మీయ స్వస్థత  

ఏది ఏమైనప్పటికి, ఆధరణకర్తయైన దేవుడు మన ఆత్మీయ, శరీర బలహీనతలయందు మనలను బలపరుస్తూ, ఆత్మయందు నూతన పరుస్తున్నాడు. యేసుక్రీస్తులో మనకున్న గొప్ప దీవెన ఏమిటంటే, ఆయన రక్తం ద్వారా మన పాపపు హృదయం కడగబడటం. యేసుక్రీస్తు సువార్త మన హృదయాలకు తాకినప్పుడు అది మనలను సమస్త దుర్నీతి నుండి శుద్ధిచేస్తుంది. అందువలన, మనం శరీర రోగాల నుండి స్వస్థత కోరడం కంటే పాపం అనే రోగం నుండి స్వస్థత పొందటానికి, మన పాపములను క్షమించమని ప్రభువును ప్రార్ధించడం మరియు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం అన్నిటికంటే ముఖ్యమైనది. 

5. హెచ్చరికలు 

  • శరీర స్వస్థతల కోసం అబద్ధ బోధకుల మాటలు గుడ్డిగా నమ్మీ మోసపోకండి. 
  • స్వస్థత వస్తుంది అని మాయ చేసే బోధకుల దగ్గర అనవసరమైన మూలికలూ, పండ్లూ, నూనెలూ, నీళ్లకు డబ్బులు ఇచ్చి నష్టపోకండి.  
  • అనవసరమైన భయాలకు గురై, మూడనమ్మకాలను పాటించకండి. 
  • అనారోగ్యంతో సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల సలహాలు, సరైన వైద్యాన్ని తీసుకోవడం ఎంతైనా మేలు. 
  • మరీ ముఖ్యంగా, దేవునిపైన నమ్మకముంచి, వాక్యానుసారంగా ప్రార్థించండం ఆలవాటు చేసుకోండి.  

ముగింపు 

క్రైస్తవులు స్వస్థత విషయంలో, దేవుని సార్వభౌమ చిత్తమును అంగీకారిస్తూనే స్వస్థత కొరకు బలంగ ప్రార్థించడం చాలా అవసరం. భౌతికంగ స్వస్థత పొందకపోయిన, క్రీస్తు ద్వారా ఆత్మీయంగా నూతనపరచబడుతాం. ఈ విశ్వాస ప్రయాణంలో, స్వస్థత ఎల్లప్పుడూ మనం కోరుకున్నట్లు రాకపోయినా, దేవుని పరిపూర్ణ ప్రణాళికపై మనం ఉంచే విశ్వాసం, మనకు సమాధానమును, భవిష్యత్తు కొరకు నిరీక్షణను అనుగ్రహిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !