అనేకమంది క్రైస్తవులు, దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నతో సతమతం అవుతుంటారు. కొందరు దీనిని అర్థం చేసుకోవడానికి కష్టపడతారు, మరికొందరు అయోమయానికి లోనవుతారు. చాలామందికి దేవుని చిత్తాన్ని కనుగొనడంలో విఫలమయ్యామనే భావన మిగిలిపోతుంది, అలాగే ఇంకొందరైతే దీని గురించి అసలు ఆలోచన కూడా చేయరు. క్రైస్తవులుగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. రిచర్డ్ బ్యాక్స్టర్ అనే వేదాంతవేత్త ఏమంటాడంటే, "Do the best you can to know the will of God and do it". అంటే "దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దానిని జరిగించడానికి మీకు కుదిరినంత ఉత్తమంగా ప్రయత్నించండి". (The Christian Directory, 1673, 162).
ఇటువంటి పరిస్థితులలో దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి (How Can We Know God's Will?), దానిని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో అనే సందేహాలను బైబిలు ఆధారంగా పరిశీలించడం ఉత్తమం.
1. అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించడం
దేవుని చిత్తం ఆయన వాక్యానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉండదు. దేవుని వాక్యం స్వయంగా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. "దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది" అని 2 తిమోతి 3:16లో చెప్పబడింది. దేవుడు "బయలుపరిచిన చిత్తం" లేఖనాలలో మనకు ప్రస్పుటంగా కనిపిస్తుంది.
1. అందరూ రక్షించబడి, సత్యాన్ని తెలుసుకోవాలనేది దేవుని చిత్తము - 1 తిమో 2:3-4
2. యేసుక్రీస్తును నమ్మీ, నిత్యజీవం పొందాలనేది దేవుని చిత్తము - యోహా 6:40
3. మనం పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని చిత్తం - 1 థెస్స 4:3-5
4. ఎల్లప్పుడూ సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం - 1 థెస్స 5:15-18
5. యాదార్థమైన ప్రవర్తన కలిగి జీవించడం దేవుని చిత్తం - 1 పేతు 2:15
6. మనం న్యాయంగా, కనికరముతో, దీనులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు - మీకా 6:8
మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, దేవుని వాక్యాన్ని పరిగణనలోకి తీసుకొని, ఆయన బయలుపరిచిన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు, కాలక్రమేణా మన జీవితంలో ఆయన వ్యక్తిగత చిత్తం ఏమిటో తెలియజేస్తాడు. కాబట్టి, బైబిల్ చదవడం, దానిని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే మనం దేవుని చిత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం.
2. క్రమంగా ప్రార్థన చేయడం
ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, ఆయనను ఆడగడం. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో, మన జీవితానికి ఆయన చిత్తము ఏమిటో తెలుసుకోడానికి ఆయనను అడిగి వేడుకోవడం కంటే మేలైన మార్గం ఏముంది! చెప్పండి?
దేవునితో అనుదినము మాట్లాడుతూ, ఆయన కోరిన విధంగా జీవిస్తూ, స్నేహపూర్వకమైన బంధాన్ని పెంచుకొని, అయ్యా! నీ చిత్తాన్ని తెలుసుకోవాలని అడిగితే, దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. మనం దేవుని త్తాన్ని తెలుసుకున్నప్పుడు ఆయనలో ఉండే శాంతి, సమాధానాలు అనుభవిస్తాం (ఫిలిప్పీ 4:6-7).
3. పరిశుద్ధాత్మ నడిపింపు
దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఆనుగ్రహించాడు. ఆయన మనకు బోధిస్తూ, సత్యం వైపు నడిపిస్తాడు. మనము ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆధరణ కలిగించి, మారాన్ని చూపుతాడు (యోహాను 14:26). మనం చేయాల్సినదల్లా, పరిశుద్ధాత్మను ఆర్పకుండా, మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సహకరించాలి (1 థెస్స 5:19).
మనం దేవుడు కోరినట్లు జీవిస్తూ, నిజాయితీగా ప్రార్థిస్తునప్పుడు, పరిశుద్ధాత్మ మన హృదయాలను, మన ఆలోచనలను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే మార్గంలో నడిపిస్తాడు.
4. మనస్సాక్షి ఉపదేశం
దేవుడు మన మనస్సాక్షి ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అనేక సందర్భాలలో మన మనస్సాక్షి ద్వారా మంచి చెడులను గ్రహించే సూచనలిస్తాడు. ఏదైనా స్పష్టంగా తప్పు అని, వాక్యానికి విరుద్ధమని మనకు అర్థమౌతున్నప్పుడు, అది దేవుని చిత్తం ఎలా అవుతుంది? అస్సలు కానే కాదు. ఎందుకంటే ఆయనను మహిమపరిచే నీతియుక్తమైన ప్రవర్తన, నైతిక విలువలు, ఆజ్ఞలు మన హృదయములో ఉంచి, మన మనస్సాక్షిని న్యాయవిమర్శ చేయడానికి నియమించాడు (రోమా 2:15). కాబట్టి వాక్యానుసారంగగా జీవించడం (యాకో 4:17) ఆయన సృష్టించిన అంతరంగ మనస్సాక్షిలో చేసే ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలము.
హెచ్చరిక: కొన్ని సందర్భాలలో మనస్సాక్షి కూడా మోసం చేసే ఆవకాశాలు ఉన్నాయి. దేవుని మీద ఆధారపడి వివేచనతో ముందడుగు వేయాలి.
5. పరిస్థితులు
దేవుడు పరిస్థితులను ఉపయోగించుకుంటాడు. మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, సంఘటనలు, ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని కనుపరుస్తాడు. కొన్ని సమయాల్లో బంధాలు తెగిపోవడం, అవకాశాలు దొరకకపోవడం లేదా దారులు మూసుకుపోవడం ద్వారా మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. మనం అనుకున్న విధంగా జరగనీయ్యకపోవడం ద్వారా కూడా ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు.
కొన్ని సందర్భాల్లో, సమస్తమును మన కొరకు సిద్ధంచేసి, అన్నీటిని మనకోసం అనుకూలంగా మార్చీ, ఆయనే మార్గదర్శకునిగా నడిపించడం ద్వారా ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు.
హెచ్చరిక: అన్నీ కోరుకున్నట్లు జరుగుతూ, అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని చిత్తం కాకపోవచ్చు. దైవ వివేకంతో జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వెళ్ళాలి.
6. ఆధ్యాత్మికుల సలహాలు
దేవుని జ్ఞానం కలిగిన బోధకులు, పెద్దలు, విశ్వసనీయ ఆధ్యాత్మిక సలహాదారులు కూడా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సూచనలు ఇవ్వడంలో ఉపయోగపడతారు (ప్రసంగి 11:14).
సుబోధకులతో సహవాసం చేయడం, ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించడం, సంభాషించడం ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మనము గ్రహించే సూచనలు తెలియజేస్తాడు.
7. దేవుని చిత్తానికి అనుకూలమైన జీవితం
దేవుని ఆజ్ఞలు పాటించడం, నియమాలు అనుసరించడం, ఆయన పట్ల విధేయత చూపించడం ద్వారా మన జీవితం పట్ల ఆయన ఉద్దేశ్యం ఏమిటో వెల్లడిస్తాడు (యోహా 14:21). అలా కాకుండా, వాస్తవికతలో, మనం దేవుని చిత్తానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ఆయన చిత్తాన్ని తెలియజేయమనడం సరైన పద్ధతి కాదు. మనకు నచ్చిన విచ్చలవిడి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం ఎలా జీవించగలం? ఆలోచించండి!
మన ఆలోచనలు, కోరికలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి (రోమీయులు 12:1-2). మన జీవితాన్ని దేవునికి అర్పించి, సహనంతో దేవునిపై ఆధారపడి ఆయన కొరకు వేచిచూడాలి.
ముగింపు
మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని అనుకోవడం మంచి విషయమే, కానీ ఆయన చిత్తాన్ని తెలుసుకున్న మనం దానికంటే అధికంగా, ఆయనపై సంపూర్ణ విశ్వాసముంచి, విధేయతతో జీవించడం ముఖ్యం. ఎందుకంటే దేవుని చిత్తం అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చే రహస్య జ్ఞానం కాదు, అది క్రమక్రమంగా దేవుని నీడలో నేర్చుకొనే పాఠం. అందుకే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మన ఆధ్యాత్మిక జీవిత యాత్రగా భావించాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు శాంతి సంతోషాలు అనుభవిస్తాము, గందరగోళము ఉండదు. దేవుని చిత్తమును తెలుసుకోవడం సులభమే గాని దానిని పాటించడమే చాలా కష్టంగా అనిపించవచ్చు.
మీకు ఎప్పుడైన దేవుని చిత్తాన్ని చేయడం కష్టంగా అనిపించిందా?
