
“మిత్రమా! ఇంత చలిలో కూర్చొని ఏం చేస్తున్నావు?” తన పక్కన కూర్చుంటూ అడిగాడు ఆ జ్ఞానులలో ఒకడు
“ఇన్ని యేండ్లు గడిచాయి, మన ప్రయాసం అంత వృధా అయినట్టేనా?” చాలా నిరాశతో అన్నాడు
“మన చిన్నతనం నుండి యూదుల చరిత్రను వింటూ వచ్చాము”
“వారి దేవుడు, చెప్పింది నెరవేరుస్తున్నాడు” భుజం పైన చేయి వేసి అన్నాడు
“నా గుండె బరువు ఎక్కుతుంది మిత్రమా, నా రోజులు దగ్గర పడుతున్నాయి అని తెలుస్తుంది, నేను చనిపోయేలోపు అయినా ఆయన జన్మిస్తాడా” పట్టలేని దుఃఖంతో అడిగాడు

“నిరాశ చెందకు మిత్రమా, మన పర్షియా దేశంలోని పెతోరు ప్రాంతానికి చెందిన బిలాము ‘నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును’ (సంఖ్య 24:17) అని చెప్పినట్టుగా తప్పకుండా జరుగుతుంది” బదులు ఇచ్చాడు తన స్నేహితుడు
“దయచేసి నీ తార, ఈ రోజైన చూపించు ప్రభు” ఆకాశాన్ని చూస్తూ ప్రార్థిస్తూనే అక్కడి నుండి లేచారు ఆ జ్ఞానులు
కొన్ని సంవత్సరాల క్రితం వారి ప్రాంతంలో మంత్రిగా పని చేసిన దానియేలుకు కలిగిన దర్శనములు, భూజనులను ఏలేడి రాజు రాక కొరకు ఎదురు చూడటంలో వారికి ఉపయోగపడ్డాయి. ఆ నల్లని ఆకాశంలో మెరిసే తారలు ఎన్నో, వీరి హృదయంలో కదిలే ఆలోచనలు మరెన్నో. వారి ఎదురు చూపులకు ఆ తార వెలిసిన దినం రానే వచ్చింది. ఆ చీకటిలో, ఇసుక తుఫాను వారి తల ఎత్తకుండా చేస్తున్నప్పుడు, ఉన్న చోటునుండి ఆకాశం వైపు వారి తలలు ఎత్తినప్పుడు కన్నులకు విందు చేసేలా మెరుస్తూ కనిపించింది ఆ అందాల తార.
“మిత్రమా ఒకసారి ఈ వైపు చూడు” చూపుడు వేలుతో ఆ నక్షత్రాన్ని చూపించాడు తన స్నేహితుడు

“ఆహా! ఇన్ని కోట్ల నక్షత్రాల మధ్య భలే గమ్మత్తుగా మెరుస్తూ ఉందే, ఇదే అంటావా మనం ఎదురు చూస్తున్న ఆ యాకోబు నక్షత్రం” అన్నాడు ఆ జ్ఞానీ
“ఇదే అవ్వాలి అని కోరుకుందాం” కన్నుల నిండా ఆనంద భాష్పాలతో చెప్పాడు తన స్నేహితుడు
“ఆ తార చూపుతున్న దారిలో వెళితే మనం ఎదురు చూస్తున్న రాజు కనిపిస్తాడేమో, వెళ్దాం పదండి” అని మరోకడు అన్నాడు
“అవును! అవును! పదండి పోదాం” అంటూనే వారి వారి సామాన్లు సర్దుకుంటూ ఒంటెల పైకి ఎక్కారు
“ఆగండి, ఆగండి”
“మిత్రులారా, మనం వెళ్ళేది రాజు దగ్గరికి మన వద్ద ఆయనకు బహుమానంగా ఇవ్వడానికి ఏమైనా ఉండాలిగా”
“మన దగ్గర విలువైనవి ఏవో తీసుకొని పోదాం”
వారి వారి ఇంటిలోకి వెళ్లి, వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఆ ఒంటెల పైన పెడుతున్నప్పుడు, ఆంత చూస్తున్న వారి దాసులు కొందరు వచ్చి,

“అయ్యా! మీరు సంపాదించిన ఆస్తి అంత తీసుకొని వెళ్తున్నారే, మరి మీ పిలల్ల పరిస్థితి ఏంటి?”
“సోదరా! ఆ రాజు చూసుకుంటాడు లే!” భుజం తడుతూ బదులు ఇచ్చాడు
బంగారం, సాంబ్రాణి, బోళము తీసుకొని, బయలు దేరారు ఆ తూర్పు దేశపు జ్ఞానులు. ఆ తార వారికి దిక్సూచిలా మార్గం చూపించింది. అది ఎలానో మన ఊహలకు అందదు. నదులు, ఎడారులు, కొండలు దాటుతూ ప్రయాణిస్తూనే ఉన్నారు. వారిలో అలసట అన్నమాట లేదనేలా సాగుతూనే ఉన్నారు. ఎరిగిన దారులే, జ్ఞానులైతేనేమి మనుషులే కదా పొరపాట్లు చేస్తుంటారు, పగటి జాములో మార్గం తొలగిపోయినా, చీకటి వేళలో ఆ అందాల తార ఎప్పటివోలే వారి త్రోవలో ఎదురు అయ్యేది. వారిది సుదూర ప్రయాణం అయినప్పటికీ వారికీ విసుగు అనేది తెలియలేదు. విశ్వాస యాత్ర అంటే ఇంతేనేమో కాబోలు గురి కొరకే పరిగెడుతూ ఉంటారు. కొన్ని రోజులకి ఆ తార నేరుగా యెరూషలేములోనికి వారిని నడిపించింది.

“హు! హు! వచ్చేసాము మిత్రమా, ఇదే ఆ రాజు పరిపాలించే చోటు. పదండి ఇక్కడి స్థానిక రాజు వద్దకు వెళదాము” ఒకరికి ఒకరు చెప్పుకుంటూనే రాజ భవనంలోకి వెళ్లారు.
కానీ ఆ రారాజు జన్మించింది హేరోదు భవనంలో కాదు అన్న సంగతి వారికీ, అదే విధంగా ఆ హేరోదు రాజుకు కూడా అప్పుడే తెలిసింది. హేరోదు హృదయం కుట్రతో నింపబడితే జ్ఞానుల హృదయాలు స్తుతులతో నింపబడ్డాయి. శాస్త్రులు చెప్పినట్టుగా వారు బెత్లేహేముకు వెళ్లారు. ఆ తార ఓ ఇంటిపై నిలిచింది. ఒంటెలను అక్కడే వదిలి, గబగబ లోపలికి వెళ్లారు. ఉన్నపాటున లోపలికి వచ్చిన జ్ఞానులను చూసిన మరియా యోసేపులు మొదట బయపడ్డప్పటికీ దేవదూత మాటలు గుర్తు చేసుకొని, వారిని ఆహ్వానించారు.

“మేము తూర్పు దేశం నుండి వచ్చాము” యోసేపు వైపు చూసి అన్నాడు ఆ జ్ఞానులలో ఒకడు
“కానీ కానీ..” మేము ఉన్న చోటు ఎలా తెలిసింది అని యోసేపు అడిగేలోపే
“ఇక్కడికి రాడానికి ఆ దేవుడు మాకు ఒక తారను చూపించాడు, ఇక్కడికి మమ్మల్ని నడిపించింది ఆ తారే”
“ఎన్నో యేండ్లుగా మేము ఎదురుచూస్తున్నాం, మా కల ఈరోజు నెరవేరింది” యోసేపును కౌగిలిస్తూ చెప్పాడు ఆ జ్ఞాని
ఆ ఇంటిలో బాలుడైన యేసును చూసినప్పుడు వారి ఆనందానికి అవధుల్లేవు. ఎండిన చెరువు నిండినంత ఆనందం. ఏండ్లతరబడి యెద పై ఉన్న దిగులు అనే బండ జారిపోయినంత తేలిక. కమ్ముకున్న కారుమేఘము తొలిగిపోయినంత వెలుతురు వారికి కలిగింది. వారి ప్రయాస అంత కూడా క్షణంలో పండగలా మారిపోయింది.
పొత్తి గుడ్డలతో చుట్టబడి, చిరునవ్వులు ఒలకబోస్తూ, ఆవలింపలు తీస్తూ, కాళ్ళు చేతులు ఆడిస్తున్న ఆ బాలుడు ఎవరో కాదు. సర్వోన్నతుడైన దేవుడు.
“మిత్రులారా, మనం ఈ విశ్వాన్ని పరిపాలించే సృష్టికర్తను చూస్తున్నం” అని ఆ జ్ఞానుల్లో ఒకడు అనడంతో ఆనందంతో వారి హృదయాలు ఒక్కసారిగా విస్మయం చెందాయి.
“నాధా, నన్ను సృజించిన నిన్ను ఎత్తుకోవడం, నాకు ఎంత భాగ్యమో” బాలుడైన యేసును ఎత్తుకొని ఆనందంతో అన్నాడు వారిలో మరొక్కడు.
“అల్పులమైన మాకు, మా ఈ పాపపు జీవితంలో నీ దర్శన భాగ్యం ఇచ్చావా నాధా” మోకరిస్తూనే బాలుడిని చేతులోకి తీసుకొని అన్నాడు వేరొక్కడు.

ఆహ! వారి చేతులు ఎంత ధన్యమో, వారిని సృజించిన దేవుడిని వారు ఎత్తుకోవడం.
ఇది మాటల్లో ఎలా చెప్పగలం? ఆ బాలుడు జ్ఞానులకే జ్ఞానం ఇచ్చిన దేవుడు. వారు బాలుడైన యేసును వెతుక్కుంటూ వచ్చిన మాట నిజమే కానీ అసలు సత్యం ఏంటి అంటే వారిని వెదికి రక్షించడానికే యేసు వచ్చాడు. పట్టలేనంత సంతోషంతో వారు తెచ్చిన బహుమతులు ఆ బాలుడికి సమర్పించారు, బహుమతులకంటే ముందే వారి హృదయాలను ఆయనకు సమర్పించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు, ఆహ! వారి జీవితాలు ఎంత ధన్యమో!!!
-వోరుగంటి చరణ్ నెహెమ్యా
(Based on Gospel accounts of Jesus Christ)