యేసుక్రీస్తు దైవత్వం క్రైస్తవ్యంలో అత్యంత కీలకమైనది. లేఖనాలను విశ్వసించే క్రైస్తవులంతా యేసు దైవత్వాన్ని అంగీకరిస్తారు. ఆయన దైవత్వం సువార్తలలోని ఆయన మాటలు, చర్యల ద్వారా స్పష్టంగా వెల్లడైంది.
అయితే యేసుక్రీస్తు ”నేను దేవుడను” అని ఎక్కడైనా చెప్పాడా?/Where did Jesus Christ say, “I am God?” అనే ప్రశ్న తరతరాలుగా క్రైస్తవులు/క్రైస్తవేతరులచే చర్చించబడుతూనే ఉంది. వీరు యేసు తన భూలోక పరిచర్యలో తనను తాను స్పష్టంగా దైవంగా ప్రకటించుకోలేదని అభిప్రాయపడతారు. అయితే, లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, యేసు తనను తాను దేవునిగా ప్రకటించుకున్న ప్రత్యక్ష/పరోక్ష ప్రకటనలు తేటగా కనిపిస్తాయి. వాటిని గమనించినప్పుడు యేసు తనను తాను దేవుడని చెప్పిన సంఘటనలు, కనుపరచుకున్న సందర్భాలు అనేకమని రుజువవుతుంది.
ప్రత్యక్ష ప్రకటనలు/నిర్ధారణలు
1. సమరయ స్త్రీతో: (యోహాను 4:25-26)
సమరయలోని సుఖారు అనే ఊరిలో బావి వద్ద యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె మెస్సీయ (క్రీస్తు) రాబోతున్నాడని తనకు తెలుసునని చెప్పింది. అప్పుడు యేసు “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” అని సూటిగ ప్రకటించాడు. సాధారణంగా యేసు తన గుర్తింపును రహస్యంగా ఉంచేవారు, కానీ ఈ సందర్భంలో ఆయన తనను తాను మెస్సీయాగా స్పష్టంగా ప్రకటించుకున్నాడు.
2. యూదులతో: (యోహాను 8:56-59)
యేసు ప్రభువారు, యెరూషలేములో యూదులతో మాట్లాడుతూ, “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను”. ఈ మాట విన్న యూదులు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు, ఎందుకంటే ఈ ప్రకటన దేవునికి మాత్రమే ఉన్న నిత్యత్వపు ఉనికిని యేసు తనకు తాను ఆపాదించుకొంటున్నాడని వారు అర్థంచేసుకొన్నారు. అంటే ఇక్కడ యేసు తనను తాను దేవుడని ప్రత్యక్షంగ ప్రకటించుకున్నాడని స్పష్టమౌతుంది.
3. యూదా అధికారులతో: (యోహాను 5:18, 10:30, 33)
యేసు యూదుల అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, వారు ఆయనను చంపడానికి ప్రయత్నించారు. దీనికి కారణం, యేసు దేవుణ్ణి తన సొంత తండ్రిగా చెప్పుకోవడం ద్వారా తనను తాను దేవునికి సమానంగా చేసుకున్నాడని వారు స్పష్టంగా గ్రహించారు. అంతేకాకుండా, యేసు “నేనును తండ్రియు ఏకమైయున్నాము” అని ప్రకటించినప్పుడు, వారు యేసు “తనను తాను దేవునిగా ప్రకటించుకొంటూ, దేవునితో సమానునిగా చేసుకొంటున్నాడని” అర్థంచేసుకున్నారు.
4. ఫిలిప్పుతో: (యోహాను 14:8-9)
యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో మాట్లాడుతున్న సందర్భంలో, ఫిలిప్పు “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము” అని అడిగినప్పుడు, యేసు “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు” అని సమాధానమివ్వడంతో, ఆయనే దేవుడని ప్రత్యక్షంగా ప్రకటించాడు. ఈ ప్రకటన యేసు, తండ్రి దేవునితో ఉన్న లోతైన ఐక్యతను, సమానత్వాన్ని స్పష్టం చేస్తుంది. యేసును చూడటం అనేది దేవుణ్ణి చూడటంతో సమానం, అంటే యేసే దేవుడు.
5. ప్రధాన యాజకునితో: (మత్తయి 26:63-64, లూకా 22:70, మార్కు 14:62)
ప్రధాన యాజకుడు “నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా?” అని అడిగినప్పుడు, యేసు “మీరన్నట్టు నేనే ఆయనను” అని సమాధానమిచ్చాడు. అంటే ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తని ఒప్పుకొంటూనే, ఆయన దైవత్వాన్ని ప్రకటించాడు. ఆయన తనను తాను ప్రత్యక్షంగా దేవుడని ప్రకటించుకొన్నాడనే కారణం చేతనే యూదులు ఆయన్ను సిలువ వేయడానికి అప్పగించారు.
6. పిలాతుతో: (యోహాను 18:37, 19:7)
రోమా అధికారైన పిలాతు ముందు, విచారణలో, “నీవు యూదుల రాజువా?” అని యేసును అడిగినప్పుడు, యేసు “నీవన్నట్టు నేను రాజునే” అని బదులిస్తూ ఆయన దైవత్వాన్ని ప్రకటించాడు. యేసు “రాజు” అనే బిరుదును ధృవీకరించి, అది కేవలం రాజకీయ బిరుదు కాదని, అంతిమ దైవ అధికారంతో కూడినదని యేసు ప్రకటించాడు. ఇది యూదులతో పాటుగా పిలాతు కూడా గ్రహించి అందుకే ఆయన్ను సిలువ మరణానికి అప్పగించారు.
# “నేను/నేనే/I AM” ప్రకటనలు
యోహాను సువార్తలో, యేసు ఏడు వేర్వేరు సందర్భాలలో “నేను/నేనే” (గ్రీకు: ఎగో ఎయిమి) అనే సంపూర్ణ పదాన్ని ఉపయోగించాడు. ఈ పద వాడకం నిర్గమకాండము 3:14లో, దేవుడు మోషేకు తనను తాను “నేను/I AM ఉన్నవాడను” అని ప్రకటించుకున్న అదే దైవ ప్రకటనను యేసుక్రీస్తు తన దైవత్వాని తెలియజేయడానికి ఉపయోగించడాన్ని సూచిస్తుంది.
1. “జీవాహారము నేనే” (యోహాను 6:35) - యేసుక్రీస్తు మానవాళికి ఆత్మ సంబంధమైన పోషణను, నిత్యజీవాన్ని అనుగ్రహించేవాడు.
2. “నేను లోకమునకు వెలుగును” (యోహాను 8:12) - యేసు చీకటిని, అజ్ఞానాన్ని, పాపాన్ని తొలగించి, దైవిక సత్యాన్ని, దేవుని మార్గపు వెలుగుని చూపిస్తాడు.
3. “ద్వారమును నేనే” (యోహాను 10:8) - దేవుని వద్దకు, నిత్యజీవానికి చేరుకోవడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గం.
4. “నేను గొఱ్ఱలకు మంచి కాపరిని” (యోహాను 10:11, 14) - యేసు ఆయన అనుచరులను ప్రేమతో నడిపిస్తాడు, రక్షిస్తాడు, వారి అవసరాలను తీరుస్తాడు.
5. “పునరుత్థానమును, జీవమును నేనే” (యోహాను 11:25) - మరణంపై విజయాన్ని, నిత్యజీవాన్ని అనుగ్రహించే శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది.
6. “నేనే మార్గమును, సత్యమును, జీవమును” (యోహాను 14:6) - దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, నిజమైన జీవితాన్ని పొందడానికి యేసుక్రీస్తే మూలం.
7. “నేను నిజమైన ద్రాక్షావల్లిని” (యోహాను 15:1) - విశ్వాసులు యేసుక్రీస్తుతో ఐక్యమైతేనే ఆధ్యాత్మిక ఫలాలను ఇవ్వగలరు.
ఈ “నేను/నేనే” ప్రకటనలు/వాదనలు దైవ గుర్తింపు ప్రకటనలు అనడానికి అత్యంత బలమైన రుజువులు. కానీ యేసు దేవుడని యూదులు గ్రహించకుండ ఆయనను అపార్థంచేసుకొని హింసాత్మక ప్రతిచర్యలకు పాల్పడ్డారు. ఆయన దైవదూషణ (దేవునిగా ప్రకటించుకోవడం) చేస్తున్నాడు అని భావించి ఆయనను రాళ్లతో కొట్టడానికి రాళ్లను ఎత్తారని (యోహాను 10:31, 33) అనేక సువార్త వృత్తాంతాలు ధృవీకరిస్తున్నాయి, ఎందుకంటే వారు ఆయనను “తనను తాను దేవునిగా చేసుకుంటున్నాడు” (యోహాను 10:33) అని వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
పరోక్ష ప్రకటనలు
యేసు చేసిన ప్రత్యక్ష ప్రకటనలకు మించి, ఆయన దైవత్వాన్ని రుజువుచేసే మరికొన్ని పరోక్ష ప్రకటనలు, చర్యలు ద్వారా తెలియజేయబడ్డాయి.
1. విశ్రాంతిదినము, ధర్మశాస్త్రంపై అధికారం
యేసు తనను తాను “విశ్రాంతిదినమునకును ప్రభువు” అని ప్రకటించుకున్నాడు (మత్తయి 12:8, మార్కు 2:28, లూకా 6:5). ఈ ప్రకటన మోషే ధర్మశాస్త్రంపై ఆయనకు ఉన్న అధికారాన్నిచాటిచెప్తూనే, పరిసయ్యులు స్థాపించిన ధర్మశాస్త్ర సంప్రదాయాలను నేరుగా సవాలు చేస్తుంది. యేసే విశ్రాంతిదినమును సృష్టించి నియమించినవాడని (యోహాను 1:3; హెబ్రీయులు 1:10), ఆయన దానిని వ్యాఖ్యానించడానికి, రద్దు చేయడానికి, అలాగే దాని అనుసరణను “తిరిగి వ్రాయడానికి” ఆయనకు సర్వ హక్కులున్నాయంటూ చేసిన బహాహిరంగ ప్రకటన ఇది.
2. పాపములను క్షమించే అధికారం
యేసు ఒక పక్షవాత రోగితో “కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి” (మార్కు 2:5-12; మత్తయి 9:2; లూకా 5:21) అని చెప్పినప్పుడు, శాస్త్రులు వెంటనే ఆయన దైవదూషణ చేస్తున్నాడని ఆరోపించారు, “దేవుడు తప్ప పాపములను క్షమించగలవాడు ఎవడు?” (మార్కు 2:7) అని వాదించారు. అప్పుడు యేసు ఆ రోగిని స్వస్థపరచడం ద్వారా తన దైవ అధికారాన్ని ప్రదర్శించాడు, ఆవిధంగా ఆయన చేసిన ప్రకటన సత్యమని నిరూపించాడు.
3. ఆరాధనను అంగీకరించడం
సువార్తలలో అంతటా, యేసు వివిధ సందర్భాలలో అనేకమంది వ్యక్తుల నుండి ఆరాధనను (ప్రోస్కైనెసిస్) అంగీకరించాడు (మత్తయి 8:2; మత్తయి 14:33; యోహాను 9:38). గమనిస్తే యేసు చేసిన బోధలలో కూడా స్వయంగా దేవుడు మాత్రమే ఆరాధించబడాలని బోధించాడు కాబట్టి (మత్తయి 4:10; లూకా 4:8) ఇలా ఆరాధనను అంగీకరించడంలో ఆయనే దేవుడు అని ప్రకటించడాన్ని గమనించవచ్చు.
4. సృష్టి, వ్యాధులు, మరణంపై అధికారం
యేసు మన భౌతిక ప్రపంచంపై అపూర్వమైన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఆయనే దేవుడని నిరూపించాడు: తుఫానులను నిమ్మలపరచడం (మత్తయి 8:26), వేలమందికి ఆహారం పెట్టడం (యోహాను 6:11), రోగులను స్వస్థపరచడం (మార్కు 2:5-12), గుడ్డివారికి కళ్లు తెరవడం (యోహాను 9:5) వంటి వాటిలో ఇది కనిపిస్తుంది. ఇంకా లోతుగా ఆలోచిస్తే, ఆయన మరణంపై కూడా అధికారాన్ని ప్రదర్శించాడు, లాజరును (యోహాను 11:25), యాయిరు కుమార్తెను (మార్కు 5:41-42) మరణం నుండి తిరిగి లేపాడు. ఈ అద్భుతాలు కేవలం ఆయన శక్తి ప్రదర్శనలు కావు, గానీ ఆయన దైవత్వ గుర్తింపును, ఆయన భూలోకానికి రావడానికి గల కారణాన్ని తెలియజేసే తిరుగులేని “సూచనలు”.
%20(1).webp) |
| పట్టిక: యేసు గురించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలు |
“యేసుక్రీస్తు తాను దేవుడని ఎక్కడ చెప్పాడు” అనే ప్రశ్నకు, సువార్తలలో ప్రత్యక్షంగా ఆయన దేవుడని స్పష్టంగా చేసిన ప్రకటనలు/క్రియలే రుజువు. యేసు తాను దేవుడని ప్రకటించుకోవడం కంటే, ఎక్కువగా తన కార్యాల ద్వారా ఆయన ఎవరో కనుపరచాడు, అంటే దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు చేసి చూపించాడు. అవి చాలా ప్రస్పుటంగా సువార్తలలో లిఖించబడ్డాయి. అయినప్పటికీ, ఇలాంటి బలమైన ఋజువులు ఎన్ని చూపించిన కొందరు “పచ్చకామెర్లు ఉన్నోళ్లకు లోకమంత పచ్చగానే కనబడినట్లు” సత్యాన్ని అంగీకరించడానికి తమ దృక్కోణాన్ని మార్చుకోరు. ఒకటి దేవుడే ఒప్పింపజేయాలి, రెండూ వారు కఠిన హృదయాలోచనలు మార్చబడాలి.