మానసిక క్షోభ, హృదయ వేదనను భరించలేని పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయాలకు దారితీస్తాయి. ఇది మానవాళి ఎదుర్కొనే అత్యంత సున్నితమైన విషయాలలో ఒకటి. బైబిల్ ఈ సంక్లిష్ట సమస్యను నైతిక స్పష్టతతో, అంతే సహానుభూతితో విశ్లేషిస్తుంది. కొందరి జీవితాలలో ఆత్మహత్య అనేది వారి ఆధ్యాత్మిక సంక్షోభానికి పరిణామం అని తెలియజేస్తూ, అదే సమయంలో కొందరి భక్తుల జీవితాల ద్వారా నిరాశకు పరిష్కారం ఉందని, దేవుని కృపలో నిరీక్షణ పొందగలమని నేర్పుతుంది.
బైబిల్లోని ఆత్మహత్యలు
బైబిల్లోని ఆత్మహత్యలు చారిత్రక సంఘటనలుగా నమోదయ్యాయి. కొందరు తమ జీవితాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన, తప్పుడు క్రియల వలన తమ ప్రాణాలను హతమార్చుకున్నారు. సౌలు (1 సమూ 31:4), అహీతోపెలు (2 సమూ 17:23), జిమ్రీ (1 రాజులు 16:18), యూదా ఇస్కరియోతు (మత్తయి 27:5) వంటి వారి క్రియలు, నిర్ణయాలు వారి జీవితాల్లోని ఆధ్యాత్మిక పతనాన్ని చూపిస్తాయి.
బైబిల్ ఉదాహరణలు: నిరాశలో నిరీక్షణ
బైబిల్లో అనేక మంది ప్రముఖులు గాఢమైన నిరాశను ఎదుర్కొన్నారు, ప్రాణాలు పోగొట్టుకోవాలి అని కోరుకున్నారు కానీ దేవుని కృపను పొందుకున్నారు.
➤ సొలొమోను సుఖాల వెంట పరుగెత్తుతూ "బ్రదుకుట నాకసహ్యమాయెను" (ప్రసంగి 2:17) అని అన్నాడు. కానీ సొలొమోను చివరికి "దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి" (ప్రసంగి 12:13) అని గ్రహించాడు.
➤ ఏలీయా భయం, నిరాశలో మరణాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏలీయాకు విశ్రాంతి, ఆహారం, నూతన ఉద్దేశ్యాన్ని ఇచ్చాడు (1 రాజులు 19:4-8).
➤ యోనా తన కోపంతో ప్రాణాలు కోల్పోవాలి అనుకున్నప్పుడు, దేవుడు యోనాను సరిచేసాడు (యోనా 4:8-11).
➤ పౌలు కూడా "బ్రదుకుదుమను నమ్మకములేక....అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు" (2 కొరింథీ 1:8) అని ఒప్పుకున్నాడు. కానీ పౌలు నేర్చుకున్నది ఏమిటంటే: "మృతులను లేపు దేవునియందే... నమ్మికయుంచాలి...." (2 కొరింథీ 1:9).
ఆత్మహత్య పరిష్కారం కాదు. నిరాశతో నిండిన జీవితానికీ దేవుడు నిరీక్షణనిస్తాడు. గుర్తుంచుకోండి! దేవుడు మీ బాధను చూస్తున్నాడు, మీ కన్నీళ్లను లెక్కిస్తున్నాడు (కీర్తన 56:8). మీరు ఒంటరివారు కాదు. మీ జీవితం విలువైనది, దేవుడు దాన్ని పునరుద్ధరించే శక్తి గలవాడు.
ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కోవడానికి మార్గాలు
సంఘాన్ని ఆశ్రయించండి: ఒంటరితనం నిరాశను పెంచుతుంది. "ఒకని భారముల నొకడు భరించి" (గలతీ 6:2) అనే ఆజ్ఞ ప్రకారం, మీ పాస్టర్లు లేదా సలహాదారులతో, తోటి విశ్వాసులతో మాట్లాడండి.
దేవుని వాగ్దానాలను నమ్మండి: "ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు" (ద్వితీ 31:6), "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు" (కీర్తన 23:4) వంటి వాక్యాలతో ధైర్యం పొందండి.
వైద్యుల సలహాలు పొందండి: మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. జీవితం యొక్క గొప్పతనాన్ని గౌరవించండి (సామెతలు 11:14).
దేవునితో చెప్పుకోండి: "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి" (ఫిలిప్పీ 4:6-7).
బైబిల్ స్పష్టంగా చెబుతుంది: ఆత్మహత్య ఒక పాపం. ఇది దేవుడు సృష్టించిన జీవితాన్ని తిరస్కరించడం మరియు ఆయన సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం (1 కొరింథీ 3:16-17). ప్రాణాలు తీసుకోవడం ఎప్పుడూ సరైన ఎంపిక కాదు.
ఒకవేళ మీరు క్రీస్తును నమ్మని వారైతే, దేవుడు మీ జీవితాన్ని మార్చే శక్తి గలవాడు. యేసు క్రీస్తు ద్వారా మీ జీవితానికి నిజమైన ఉద్దేశ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ మీరు ఇప్పటికే క్రీస్తులో విమోచించబడి ఉంటే, మీ ప్రస్తుత పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని దేవుడు ఆయన మహిమ కోసం ఉపయోగించగలడు.
ఆత్మహత్య అనేది దేనికీ శాశ్వత పరిష్కారం కాదు. సొలొమోను, ఏలీయా, పౌలు వంటి వారు దేవుని కృప ద్వారా తిరిగి నిలబడ్డారు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది: "విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును" (కీర్తన 34:18). మీరు ఒకవేళ నిరాశలో మునిపోయి ఉంటే దేవుడు మీకు అండగా ఉన్నాడని, మీరు ఒంటరివారు కాదని, మీ జీవితం విలువైనది గుర్తించండి, జీవించండి.
చివరిగా ఒక మాట
నీకు, నాకు, అందరికీ చావు ముందే నిర్ణయించబడింది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒకరోజు చచ్చిపోవడం కాయం. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు వద్దు అనుకున్న కూడా చచ్చిపోవడం పక్కా. అప్పుడు ఆహ్వానం లేని అతిధిలాగా మరణం నీ ఇంట్లోకి వస్తుంది. అంతలోనే ఆత్రం ఎందుకు? అంత తొందరెందుకు? చావు రాకముందే చావడం ఎందుకు, ఆలోచించు? చావు వచ్చే లోపే ఉన్న మొత్తం జీవితం బ్రతకొచ్చు కదా. Fertility Centers/గర్భధారణ కేంద్రాలకు వెళ్ళి చూడు, ఎన్ని ప్రాణాలు భూమి మీదకు వచ్చి బ్రతకాలని ఆరాటపడుతుంటాయో. అలాంటిది నీకు ఒక జీవితం అనుగ్రహించబడింది అంటే నీ బ్రతుకు/జీవితం చాలా విలువైనదని అర్థంచేసుకో. బ్రతకాలి, బ్రతుకు.. బ్రతకడం ముఖ్యం. కొందరు సూక్తులు చెప్పినట్టు హంసలాగా బ్రతకాలి అనేది తర్వాత, దానికంటే ఎక్కువగా బ్రతకడం ముఖ్యం. బ్రతకడమే ముఖ్యం - చచ్చే వరకు బతుకు.
