క్రీస్తు సిలువలో పలికిన మాటల నుండి పరిశీలించిన కారాణాలు
1. మన పాప క్షమాపణకై
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.” (లూకా 23:34)
యేసుక్రీస్తుకు సిలువ శిక్ష వేస్తున్న వారిని క్షమించమని కోరుతూ తండ్రికి చేసిన ప్రార్థన ఇది. ఆయనను అన్యాయంగా హింసిస్తున్నవారి క్షమాపణ కోసం యేసు చేసిన ఈ ప్రార్థన వారి పట్ల ఆయనకున్న కనికరాన్ని, దయను తేటగా కనుపరుస్తుంది. యేసును హింసిస్తున్నవారు అజ్ఞాన తో ప్రవర్తిస్తూ, వారు చేస్తున్న భయంకరమైన చర్యలను అర్థంచేసుకోలేకపోయారు. వారి స్థితిని యేసుక్రీస్తు గ్రహించి వారి క్షమాపణకై ప్రార్థించాడు. యేసు పాప క్షమాపణను అనుగ్రహించి దేవుని కృపను కనుపరిచాడని ఈ మాట తెలియజేస్తుంది. దేవునితో మానవాళిని (నిన్ను, నన్ను) సమాధానపరచడానికి, మన పాపాలను క్షమించడానికి యేసు సిలువలో చనిపోయాడని మనం తెలుసుకోవాలి.
2. మన నిత్యత్వంకై
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను." (లూకా 23:43)
యేసు తనతో పాటు సిలువ వేయబడిన నేరస్థులలో ఒకరితో ఈ మాట చెప్పాడు. ఈ మాట యేసు సిలువలో శ్రమపడుతూ కూడా క్షమించడానికి ఆయనకున్న కనికరాన్ని చూపిస్తుంది. ఇక్కడ యేసు వాడిన "పరదైసు" అనే పదం మరణించిన తర్వాత విశ్రాంతి పొందే స్థలాన్ని సూచిస్తుంది. ఈ మాట ఆ నేరస్థునికి తక్షణమే పరలోకంలో దేవునితో ఉంటాడానే నిశ్చయతను కలిగించింది. ఈ మాట యేసును విశ్వసించే వారందరికీ వారి గత జీవితంలో చేసిన పాపాలతో సంబంధం లేకుండా ఆయన నిత్యజీవాన్ని ఇవ్వగల శక్తిమంతుడని వెల్లడిస్తుంది. యేసు క్రీస్తు మనలను నిత్యత్వంకు నడిపించడానికే సిలువలో మరణించాడు. ఆయన పట్ల విశ్వాసం ఉంచిన అనర్హులు కూడా పరలోకం చేరుతారని దీని ద్వారా మనం తెలుసుకోవాలి.
3. మన సహవాసంకై
"అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను." (యోహాను. 19:26-27)
ఈ మాటను యేసు తన తల్లియైన మరియ, ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహానుతో చెప్పాడు. ఈ మాట యేసు తన హింసను భరిస్తూ కూడా తన కుటుంబం పట్ల ఆయనకున్న శ్రద్ధను మరియు భాధ్యతను ప్రదర్శిస్తుంది. మరియను యోహానుకు, యోహానును మరియకు అప్పగించడం ద్వారా, యేసు రక్త సంబంధాలకు మిన్నగా ఉండే విశ్వాస ఆధారమైన నూతన బంధాన్ని ఏర్పరచాడు. ఈ మాట యేసు మానవాళి రక్షకుడని సూచిస్తుంది, ఆయనపై విశ్వాసం ఉంచడం ద్వారా నూతనమైన ఆధ్యాత్మిక కుటుంబంలోకి ఆయన నడిపిస్తాడనే నమ్మకాన్నిస్తుంది. తండ్రితోనూ, సంఘంతోనూ, నూతన సహవాసాన్ని ఏర్పరచాడనికి యేసు సిలువలో మరణించాడని మనం తెలుసుకోవాలి.
4. మన సమాధానంకై
"నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46 మరియు మార్కు 15:34)
యేసు సిలువపై ఉన్నప్పుడు ఆయన నిరాశ మరియు వేదనతో పలికిన మాట ఇది. ఈ మాట కీర్తన 22:1లోని ప్రవచనానికి నెరవేర్పు. యేసు తండ్రి ద్వారా విడిచిపెట్టబడిన అనుభూతి ఆయన మానవాళి తరపున మోస్తున్న పాప భారాన్ని తెలియజేస్తుంది. ఈ మాట యేసు యొక్క మానవత్వాన్ని మరియు మానవుల పాపాలను పూర్తి స్థాయిలో భరించడానికి ఆయన అంగీకారాన్ని కూడా వెల్లడిస్తుంది. మానవుని పాపం వలన దేవుని ఉగ్రత కలిగింది, దానిని భరించడానికి తండ్రి యేసుని విడిచిపెట్టాల్సివచ్చింది. యేసు తండ్రి ద్వారా విడిచిపెట్టబడి, మనం పొందాల్సిన ఉగ్రత అనుభవించి, మనలను తండ్రితో సమాధానపరిచాడనికి సిలువలో మరణించాడని మనం తెలుసుకోవాలి.
5. మన సంతృప్తికై
"నేను దప్పిగొను చున్నాననెను." (యోహాను. 19:28)
ఈ మాట కీర్తన 22:15లోని ప్రవచనానికి నెరవేర్పు. ఇది యేసు సిలువపై అనుభవిస్తున్న శారీరకమైన బాధను సూచిస్తుంది. తన శారీరక దాహాన్ని వ్యక్తం చేయడం ద్వారా, యేసు తన సంపూర్ణ మానవత్వాన్ని మరియు ఆయన బాధ యొక్క లోతును తెలియజేశాడు. ఈ మాట ఆయన మానవులలో ఒకడని మరియు వారిని విమోచించడానికి, వారి స్థానంలో వారి బాధలను అనుభవించడానికి ఆయన సిద్ధమయ్యడాని తెలియజేస్తుంది. యేసు మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి, నిత్యజీవాన్ని అందించే జీవజలాన్ని ఇస్తాడని గుర్తుచేస్తుంది (యోహాను 4:13-14). యేసు మన కోసం దప్పికగొని, మన దాహాన్ని తీర్చి, మనలను సంతృప్తి పరచాడానికి సిలువలో మరణించాడని మనం తెలుసుకోవాలి.
6. మన సంపూర్ణతకై
"సమాప్తమైనది" (యోహాను. 19:30)
ఈ మాట యేసు మరణం ద్వారా మానవాళిని విమోచించడానికి చేస్తున్న కార్యం సంపూర్తి అయ్యిందని సూచిస్తుంది. ఈ మాటకు "పూర్తయింది" లేదా "పూర్తిగా చెల్లించబడింది" అనే అర్థం వస్తుంది. దీని ద్వారా యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, పాపం కోసం తనను తాను బలిగా అర్పించుకునే కార్యం నెరవేరిందని యేసు సూచిస్తున్నాడు. ఈ మాట పాపం, మరణం మరియు అంధకార శక్తులపై క్రీస్తు సాధించిన విజయాన్ని కూడా సూచిస్తుంది. యేసు మన రక్షణ కొరకైన కార్యాన్ని సంపూర్ణంగా ముగించాడని, ఆ రక్షణకై మనమేమీ చేయాల్సిన అవసరంలేదని ఈ మాట మనకు గుర్తుచేస్తుంది. మనలను రక్షణలో సంపూర్ణులను చేయడానికే యేసు సిలువలో మరణించాడని మనం తేలుసుకోవాలి.
7. మన ఆత్మ సంరక్షణకై
"తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను." (లూకా 23:46)
ఈ మాట యేసు సిలువపై ఉండి తండ్రి పట్ల నమ్మకంతో ఆయనకు లోబడి చేసిన ప్రార్థన. ఈ మాట యేసు తండ్రి చిత్తానికి పూర్తి విధేయతను చూపించినట్లు, అలాగే తండ్రి ఆయనతో ఉన్నాడనే విశ్వాసాన్ని చూపుతుంది. “అప్పగిస్తున్నాను” అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా, దేవుడు తన ఆత్మను నిత్యత్వంలోకి స్వీకరిస్తాడనే నమ్మకాన్ని యేసు సూచిస్తున్నాడు. ఈ మాట మరణంపై యేసు గెలిచిన విజయాన్ని మరియు పునరుత్థాన వాగ్దానాన్ని తెలియజేస్తుంది. దేవుని బిడ్డలందరూ విశ్వాసంతో వారి పోషణకై, ఆత్మ సంరక్షణకై దేవుణ్ణి నమ్మీ, ఆయనకు లోబడాలని గుర్తుచేస్తుంది. మన ఆత్మ నరకంలో నశించకుండా, మన ఆత్మను సంరక్షించడానికే యేసు సిలువలో మరణించాడని మనం తెలుసుకోవాలి.
ముగింపు
సిలువపై యేసుక్రీస్తు పలికిన ఈ ఏడు మాటలు, ఆయన ప్రేమ యొక్క లోతును, ఆయన త్యాగం యొక్క శక్తిని మరియు ఆయన పునరుత్థానం యొక్క అంతిమ విజయాన్ని వెల్లడిస్తాయి. అంతేకాక మానవాళిని దేవునితో సమాధానపరచడానికి యేసు చేసిన త్యాగం ఎంత గొప్పదో తెలియజేస్తాయి. ఈ మాటలు ఆయన మరణించడానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తాయి. యేసు మనలను సంపూర్ణంగా విమోచించడానికే సిలువలో మరణించాడు. ఆయన మరణించాడని నమ్మీ, ఆయనయందు విశ్వాసముంచితే నీవు కూడా రక్షించబడుతావు.

.webp)
.webp)
.webp)
.webp)
.webp)

.webp)