యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఇది విశ్వాసుల శరీర పునరుత్థానానికి నిరీక్షణనిస్తుంది. అలాగే యేసుక్రీస్తూ దైవత్వాన్ని నిరూపిస్తుంది. యేసు పునరుత్థాన రుజువులకు సంబంధించిన ప్రశ్నలు బైబిల్ పండితులు మరియు విశ్వాసుల మధ్య చాలా విధాలుగా చర్చించబడుతూనే ఉంటాయి. అయినప్పటికీ యేసు పునరుత్థానం విశ్వాసంపై, చారిత్రక మరియు బైబిల్ ఆధారాల కలయికపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఏది ఏమైనప్పటికీ, యేసు పునరుత్థానం ప్రయోగాత్మక రుజువుల కంటే విశ్వాసానికి సంబంధించినదని తెలుసుకోవాలి. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేచాడనే వాదనలను ఋజువుచేయడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. లేఖనాల నుండి కొన్ని ముఖ్యమైన ఆధారాలు మరియు వాదనలు చూద్దాం.
1. తెరువబడిన సమాధి – (మత్తయి. 28:1-6)
సువార్తలలో వ్రాయబడిన ప్రకారం, యేసు క్రీస్తు సిలువ వేయబడి, పాతి పెట్టబడిన తరువాత, మూడవ రోజున ఆయన సమాధిని చూసినప్పుడు అది ఖాళీగా కనిపించింది. యేసు శిష్యులలో కొందరు మూడవ రోజు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు, అది ఖాళీగా ఉండటం వారు ప్రత్యక్షంగా చూశారు. వీరు సమాధి తెరవబడి ఉండటం ప్రత్యక్షంగా తమ కళ్ళతో చూసారు. యేసును సమాధిలో పెట్టినప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు, ఆయన సమాధిలో నుండి లేచిన తర్వాత ఖాళీ సమాధిని చూచిన సాక్షులు కూడా ఉన్నారు. ఈ ఖాళీ సమాధి యేసు మృతులలోనుండి పునరుత్థానుడై లేచాడనడానికి బలమైన రుజువు.
2. తొలగించబడిన రోమియుల ముద్ర & పొర్లించబడిన రాయి – (మత్తయి. 27:64-66; 28:2)
ఇది ముఖ్యమైనది ఎందుకంటే రోమీయులు సమాధిని పెద్ద బండ రాయితో మూసి, దానికి ముద్ర వేసి, రోమా సైనికులను కాపలాగా ఉంచారు. అత్యంత బలమైన రోమా సామ్రాజ్య ముద్రను, ఆ పెద్ద బండను సాధారణమైన శిష్యులు తొలగించడం అసాధ్యం అని ఆర్ధమవుతుంది. యేసు సిలువ వేయబడుతున్న సమయంలో భయపడి దాకున్న శిష్యులు ఈ పని చేసే అంత ధైర్యం చేయడం కష్టం. ఆ సమాధి తెరవబడాలంటే ఏదో అద్భుతం జరగాలి. ఆ అద్బుతమే దేవుని దూత రావడం, ఆ రోమీయులు ముద్ర వేసిన రాయిన పొర్లించడం. ఈ సంఘటన కూడా క్రీస్తు పునరుత్థానానికి బలమైన రుజువు.
3. చచ్చినవారిలపడిన కావలిగా ఉన్న సైనికులు – (మత్తయి. 28:4)
ఇక్కడ ప్రస్తావించబడిన కాపలాదారులు రోమా సైనికులు. ఈ సైనికులు యేసు దేహాన్ని ఎవరూ దొంగిలించకుండా యేసు సమాధి వద్ద కాపలాగా ఉన్నారు. అయితే, ప్రభువు దూత కనిపించి, సమాధిని మూసిన రాయిని దొర్లించినప్పుడు, కాపలాదారులు భయపడి, చచ్చినవారిలాగా నేలమీద పడిపోయారు. కావలిగా ఉన్న సైనికులను సాధారణమైన శిష్యులు భయపెట్టలేరు, ఇది కేవలం దేవుని శక్తికే సాధ్యం. ఆ సంఘటనను రోమా సైనికులు తమ కళ్ళతో ప్రత్యక్షంగా చూసారు. ఈ సంఘటన యేసు యొక్క దైవిక స్వభావానికి, దేవుని శక్తికి, మరియు పునరుత్థానానికి రుజువుగా కనిపిస్తుంది.
4. యూదా మత నాయకులు చేసిన కుట్ర – (మత్తయి. 28:11-15)
యూదా మత పెద్దలు రోమా సైనికులకు ద్రవ్యమిచ్చి, క్రీస్తు పునరుత్థానాన్ని కప్పిపుచ్చాలని చూసారు. సమాధి ఖాళీగా ఉండకపోతే, యూదు నాయకులు కాపలాదారులకు డబ్బులిచ్చి, తప్పుడు వార్తను ప్రచారం చేయమనిచెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. సమాధి ఖాళీగా ఉందని వారికి తెలుసు, అక్కడ నుండి యేసు తిరిగి లేచాడనీ వారికి తెలుసు, దానీ ద్వారా వారి పేరు ప్రఖ్యాతులు పడిపోతాయని క్రీస్తు పునరుత్థానాన్ని కప్పిపుచాలనుకున్నారు. యేసు తిరిగిలేచాడన్న సత్యం వారికి తెలిసింది అందుకే దానికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాన్ని సైనికులచేత కల్పించారు. వారు చేసిన కుట్ర క్రీస్తు పునరుత్థానుడయ్యాడని తెలియజేస్తుంది.
5. పునరుత్థాన ప్రత్యక్షతలు – (యోహాను. 20:17,18; మత్తయి. 28:9; 1 కొరింథీ. 15:6-8)
కొత్త నిబంధన ప్రకారం, యేసు మరణానంతరం తన శిష్యులకు వివిధ సార్లు మరియు అనేక సందర్భాలలో కనిపించాడు. యేసు శిష్యులతో సహా చాలామంది ప్రజలు ఆయన మరణానంతరం ఆయనను చూశారని పేర్కొన్నారు. ఈ ప్రత్యక్షతలు సువార్తలలో మరియు ఇతర కొత్త నిబంధన రచనలలో వ్రాయబడ్డాయి. ఆయన ప్రత్యక్షమయ్యి, వారితో భోజనం చేసి, వారికి బోధించి, వారిని బలపరచాడు. ఈ ప్రత్యక్షతలు క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యమైన సంఘటనలుగా పరిగణించబడ్డాయి. ఇవి యేసు పునరుత్థానంకు, ఆయన దైవత్వానికి, ఆయన మృతులలో నుండి లేచడనడానికి రుజువులు.
6. మార్పుచెందిన శిష్యులు - (అపొ.కా. 2; యోహాను. 20:26; అపొ.కా. 20: 7)
పునరుత్థానం తర్వాత, యేసును అనుసరించిన శిష్యుల విశ్వాసంలో మరియు ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది. శిష్యులు ఆరాధనకు కూడుకోవడం ప్రారంభించారు, అలాగే ప్రభురాత్రి భోజనంను ఆచరించారు. అంతకుముందు భయం మరియు అనిశ్చయతతో ఉన్నవారు, క్రీస్తు పునరుత్థానం తర్వాత ఆయన కోసం ధైర్యంగా నిలబడి, నమ్మకంగా సువార్త ప్రకటించారు. వారికి హింస మరియు మరణం ఎదురినప్పటికీ వెనకడుగు వేయలేదు. ఎందుకంటే వారు పునరుత్థానుడైన క్రీస్తును చూసినట్లు, ఆయనతో సమయం గడిపినట్లు, అది వారికి నిరీక్షణను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇది యేసు పునరుత్థానం యొక్క వాస్తవికతకు మరియు ఆయన జీవితాలను మార్చే శక్తిమంతుడని ఋజువుపరుస్తుంది.
7. సంఘం ఉనికిలోకి రావడం/విస్తరించడం - (అపొ.కా. 2:24–32; 3:15; 4:2)
యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత కొద్ది కాలంలోనే క్రైస్తవ సంఘం అతివేగవంతంగా అభివృద్ధి చెందింది. సంఘం దినదినానికి ప్రభళిందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇలా సంఘం వ్యాపించడానికి యేసు జీవితం మరియు ఆయన చేసిన బోధలు ఆయన శిష్యులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి, వారు ధైర్యంగా సువార్త ప్రకటించేలా చేశాయని అర్థమవుతుంది. ఆ ఆదిమ సంఘం హింసను భరించడానికి మరియు హత్యసాక్షులవ్వడానికి కూడా సిద్దమయ్యారంటే వారు యేసు పునరుత్థానాన్ని ఎంతగా విశ్వసించారో మనం గమనించాలి. అప్పటివరకు భయపడుతూ ఉన్న శిష్యులు యేసు పునరుత్థానం తర్వాత భూమిని తలక్రిందులు చేశారు (అపొ.కా. 17:6). ఇలా క్రీస్తు పునరుత్థానాన్ని విశ్వాసించిన సంఘం నేటి వరకు కూడా వర్ధిల్లుతూనే ఉండటం కూడా పునరుత్థానాన్ని కొట్టివేయలేని రుజువు.
ముగింపు
ఈ ఋజువులు క్రైస్తవ విశ్వాసంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి, విశ్వాసులకు నిరీక్షణనూ, సంతోషాన్నీ ఇస్తాయి. అలాగే మరణం అంతిమం కాదనే ధైర్యాన్ని కూడా అందిస్తాయి. క్రీస్తు పునరుత్థానం మానవాళికి విమోచనను అనుగ్రహించడమే కాకుండా దేవునికి మహిమను ఆయనయందు విశ్వాసముంచినవారికి నిత్యజీవాన్నిస్తుంది. క్రీస్తు పునరుత్థానం ద్వారా ఆయన నిజమైన దేవుడని, క్రైస్తవ విశ్వాసం వాస్తవమని, క్రీస్తు సువార్తలో శక్తి ఉందని, ఆయనను నమ్మినవారు రక్షించబడుతారని ఋజువుపరుస్తుంది.
.webp)