దేవుని చిత్తాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు? | How Are You Misusing God's Will?

0

Two hands tearing a paper with the word 'misuse' written on it, symbolizing the concept of addressing or eliminating misuse.

అనేక మంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఆయన ఉద్దేశానుసారంగా జీవించాలని కోరుకుంటారు. అయితే, ఈ కోరికతో ఆయన చిత్తాన్ని నిజంగా అర్థం చేసుకుంటున్నారా లేదా అనే ప్రశ్న ఎదురౌతుంది. బాధకరమైన విషయం ఏమిటంటే, దేవుని జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తాన్ని తప్పుగా అర్థం చేసుకొని, దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి.


ఇప్పుడు, క్రైస్తవులు దేవుని చిత్తాన్ని వివిధ సందర్భాల్లో ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో పరిశీలిద్దాం.


1. దేవుని చిత్తాన్ని కల్పితంగా ఊహించుకుంటూ దుర్వినియోగించడం

చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తం ఏమిటో ప్రార్థనాపూర్వకముగా  వెదకకుండా వారికి నచ్చినట్లు కల్పిస్తూ, ఊహించుకుంటూ దేవుని చిత్తాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వివేచన లేకుండా "నేను అనుకున్నదే, నాకు అనిపించినదే, నేను చెప్పేదే దేవుని చిత్తం, దేవుడు ఏమి కోరుకుంటున్నాడో నాకు బాగా తెలుసు, నాకు చాలా అనుభవం ఉందని" వాధిస్తూ, వారికి నచ్చినట్లు దేవుని చిత్తాన్ని ఊహిస్తూ, అంతిమ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలా వివేచన లేకుండా చేసే ఈ ప్రయత్నాలు, తీసుకొనే నిర్ణయాలు జీవితంలో చాలా గందరగోళానికి, తప్పుడు నిర్ణయాలకు దారితీస్తాయి. 


కాబట్టి సొంత కల్పితాలను, ఊహాలను దేవుని చిత్తంగా పరిగణించడం మానేసి దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. సామెతలు 3:5-6 చెప్పబడినట్లు ''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో ప్రభువునందు నమ్మికయుంచుము."


2. దురాశల కొరకు దేవుని చిత్తాన్ని దుర్వినియోగించడం

చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని తమ దురాశల కోసం వాడుకుంటారు. తమ కోరికలు తీర్చుకోడానికి, దురాశలు నెరవేర్చుకోడానికి దేవుని చిత్తాన్ని బలిపశువుగా చేస్తారు. ఈ ఆక్రమ క్రియలో తమ దురాశలను ఖండించే వాక్యభాగాలను పక్కనపెట్టి, తమకు ముందుగానే ఉన్న భావనలకు సరిపోయే వాక్యాలను మాత్రమే ఎంచుకొని, తమకు నచ్చినట్లు వివరించుకుంటారు. తమ ఆలోచనలకు, ఇష్టాలకు అనుగుణంగా ఉండేలా దేవుని వాక్యంలోని ప్రవచనాలను కూడా మలుచుకుంటారు. ఇలా చేయడం వల్ల దేవునికి అవమానం కలిగిస్తూ, ఇతరులను మోసం చేస్తూ, తమను తామే మోసం చేసుకుంటారు. 


జాగ్రత్త! దురాశల కొరకు దేవుని వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని దుర్వినియోగం చేసేవారు, తమను తామే నాశనం చేసుకుంటారు. 2 పేతురు 3:16 "....లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు."


 3. దేవుని నైతిక చిత్తాన్ని విస్మరించడానికి దేవుని చిత్తాన్ని దుర్వినియోగించడం  

దేవుని చిత్తం ఎల్లప్పుడూ ఆయన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఆయన లేఖనాల ద్వారా ఇచ్చిన నైతిక చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడం బహుశా అత్యంత ఘోరమైన దుర్వినియోగం. దేవుని చిత్తాన్ని చేస్తున్నాం అనే సాకుతో, దేవుడు ఇచ్చిన నైతిక ఆజ్ఞలను ఉల్లంఘిస్తారు. ఇది సరైన పద్దతి కాదు అని ప్రశ్నిస్తే, దేవుని చిత్తం చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు అనే వంకర సమాధానాలు చెప్తారు. అంతిమంగా దేవుని చిత్తం జరగాలి అందుకే ఈ తప్పులు చేయాల్సివచ్చింది అని సమర్దించుకుంటారు. ఇది క్షమించలేని నేరం. ఆక్రమమైన పనులు అంతిమ మేలు కోసం అనడం నేరం. 


గమనించండి! దేవుని చిత్తాన్ని జరిగించడం ఎంత ముఖ్యమో, దానిని సరైన పద్దతిలో జరిగించడం కూడా అంతే ముఖ్యం. దేవుని చిత్తాన్ని కోరుకొనేవారు ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. యోహాను 14:15 లో యేసు, "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని చెప్పాడు. 


4. దేవుని చిత్తాన్ని వ్యక్తిగత స్వార్ధానికి దుర్వినియోగించడం  

కొంతమంది క్రైస్తవులు తమ స్వార్ధాభిలాషలకు, స్వలాభాలకు, వ్యక్తిగత ఆశయాలను లేదా కోరికలను దేవుని చిత్తాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. దేవుని చిత్తం ఎల్లప్పుడూ వారి వ్యక్తిగత లక్ష్యాలు మరియు కోరికలకు అనుగుణంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. వారి చర్యలు ఏదోక విధంగా దేవుని ప్రణాళికలో భాగమని చెప్పుకుంటూ, పాపపు ప్రవర్తనను సమర్థించుకోడానికి దేవుని చిత్తాన్ని ఉపయోగించుకుంటారు. కానీ ఇలాంటి వారు మారిచిపోయే విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని స్వార్థానికి వాడుకుంటే దేవుని శిక్షలో సర్వనాశనాన్ని చూస్తారు. 


కాబట్టి వ్యక్తిగత కోరికలకు, దేవుని చిత్తంకు మధ్య తేడాను గుర్తించి, దేవుని చిత్తాన్ని స్వార్థానికి దుర్వినియోగించడం మానేయాలి.  


5. దేవుని చిత్తాన్ని కాలయాపనకు సాకుగా దుర్వినియోగించడం  

కొంతమంది క్రైస్తవులు "దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాం" అంటూ వారు చేస్తున్న కాలయాపనకు దేవుని చిత్తాన్ని సాకుగా చెప్తారు. ఈ ప్రక్రియలో తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూ, చేయాల్సిన పనులను పక్కన పెడతారు. స్పష్టమైన దేవుని చిత్తం కోసం ఎదురుచూస్తూ, పరిశుద్ధాత్మ, లేఖనాలు, వివేచనగల సలహాలను వదిలిపెట్టడం ప్రమాదకరం. 


విశ్వాసులుగా దేవుని చిత్తం కొరకు వేచియున్నప్పుడు, ఆయన జ్ఞానము కలిగి విశ్వాసముతో వ్యవహరించమని కూడా దేవుడు ఆదేశిస్తున్నాడు. దేవుని చిత్తం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ముందుకు అడుగులు వేస్తూ, చేయాల్సినవి చేస్తూ, ప్రతి దశలో ఆయనపై విశ్వాసం ఉంచడం ఉత్తమం. యాకోబు 2:17 స్పష్టంగా చెప్పేదేమిటంటే, "విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును." 


6. వ్యక్తిగత వైఫల్యాలకు దేవుని చిత్తాన్ని దుర్వినియోగించడం  

కొందరు క్రైస్తవులు తమ తప్పుడు ఎంపికల వలన కలిగిన వైఫల్యాలకు దేవుని చిత్తమే కారణంగా నిందిస్తారు. వారు తీసుకున్న నిర్ణయాల వలన ఏదైనా నష్టం వస్తే  "ఇది దేవుని చిత్తమైయుండాలి" అందుకే నష్టపోయాం అంటూ నిందలు వేస్తారు. అయితే, అనేకసార్లు కలిగే నష్టాలు, వచ్చే వైఫల్యాలకు స్వంత నిర్ణయాలే కారణం. దేవుని చిత్తమును వెదకాలి గాని తప్పుడు నిర్ణయాలతో చేసిన పనులకు ఎవరికివారే జవాబుదారీతనమును వహించాలి. మత్తయి 25 లో, యేసు తలాంతులను గూర్చిన ఉపమానమును బోధిస్తూ, "ఒక దాసుడు తలాంతును దాచిపెట్టిన బాధ్యత వహించలేదని గద్దించాడు."


గమనించండి, నిర్ణయం ఎవరిదో వారే పర్యావసానాలకు కూడా బాధ్యత వహించాలి. వ్యక్తిగత నిర్ణయాల వల్ల కలిగిన నష్టాలకు దేవుని చిత్తాన్ని నిందిస్తూ, దుర్వినియోగం చేయకూడదు. 


7. హానికరమైన చర్యలకు దేవుని చిత్తాన్ని దుర్వినియోగించడం  

ఇతరులకు హాని కలిగించే లేదా బైబిల్ బోధలకు వ్యతిరేకంగా చేసే చర్యలను సమర్థించడానికి కొందరు దేవుని చిత్తాన్ని దుర్వినియోగం చేస్తారు. తమ సొంత ఉద్దేశాలకు తగినట్లుగా లేఖనమును, దేవుని చిత్తమును వక్రీకరిస్తారు. తాము చేసే తప్పుడు పనులకు, అసభ్యకరమైన కార్యాలకు, అవినీతికి, అక్రమ క్రియలకు, హానికరమైన చర్యలకు దేవుని చిత్తాన్ని వాడుకుంటారు. వారి తప్పులకు, పాపాలకు దేవుని చిత్తాన్ని కారణంగా వాడుకుంటారు. పైగా మేము ఇలా చేయడం దేవుని చిత్తం అని కూడా వాదిస్తారు. ఇలాంటి వక్రీకరణ చేసేవారు దేవునితో తలపడుతున్నట్టే. 


అయితే, దేవుని చిత్తం పాపానికి లేదా హానికరమైన చర్యలకు, అసభ్యకరమైన కార్యాలకు మద్దతు ఇవ్వదు. దేవుని చిత్తం ఎల్లప్పుడూ పరిశుద్ధత, న్యాయం, ప్రేమ, నిజాయితీకి ప్రతీకగా ఉంటుంది.  


ముగింపు 

దేవుని చిత్తాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగంచేయడం వలన కలిగే పర్యవసానాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని ఏ విధంగా కూడా దుర్వినియోగంచేయడం మానేసి, ఒకవేళ ఇప్పటికే అలా చేసుంటే ఆ తప్పులను అంగీకరించి, సరిదిద్దుకోవడం, పరిశుద్ధాత్మ సహాయంతో సత్యమార్గంలో కొనసాగడం అత్యంత శ్రేయస్కరం. ఇలా దేవుని చిత్తాన్ని సరైన పద్ధతిలో అనుసరించి ఆయన ఉద్దేశం ప్రకారం జీవించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలను పొందడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా కూడా నిలవచ్చు. 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !